దంగ‌ల్ దెబ్బ‌కు బాహుబ‌లి 2 రికార్డ్ ఖ‌ల్లాస్‌

బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ న‌టించిన దంగ‌ల్ మూవీ చైనాలో లేట్‌గా రిలీజ్ అయినా చైనా చ‌రిత్ర‌లోనే కొత్త రికార్డు లిఖించ‌డంతో పాటు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఓవ‌రాల్‌గా హ‌య్య‌స్ట్ గ్రాస్ వ‌సూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. ఇండియాలో ముందుగా రూ.700 కోట్లు సాధించిన దంగ‌ల్ ఇప్పుడు చైనాలో క‌ళ్లు చెదిరిపోయే వ‌సూళ్లు సాధిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చైనాలో దంగ‌ల్ రూ. 1100 కోట్ల వ‌సూళ్లు సాధించి అక్క‌డ స‌రికొత్త చ‌రిత్ర క్రియేట్ చేసింది.

చైనాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హాలీవుడ్ సినిమా కూడా ఇంత గొప్ప‌గా వ‌సూళ్లు సాధించ‌లేదు. దీంతో చైనాలో రూ.100 0 కోట్లు సాధించిన తొలి చైనాయేత‌ర సినిమాగా దంగ‌ల్ రికార్డుల‌కు ఎక్కింది. మే 5న చైనాలో రిలీజ్ అయిన దంగ‌ల్ కేవ‌లం 20 రోజుల‌కే రూ.1100 కోట్లు సాధించింది. అక్క‌డ దంగ‌ల్ జోరు ఇంకా త‌గ్గ‌క‌పోవ‌డంతో ఈ సినిమా అక్క‌డే రూ.1500 కోట్లు సాధిస్తుంద‌ని అంటున్నారు.

దంగ‌ల్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.1800 కోట్లు సాధించ‌డంతో ఈ దెబ్బ‌కు బాహుబ‌లి 2 రికార్డులు ఖ‌ల్లాస్ అయిపోయాయి. బాహుబ‌లి 2 ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 1575 కోట్లు సాధించింది. దంగ‌ల్ ఈ సినిమా రికార్డును బీట్ చేయ‌డంతో బాహుబ‌లి 2 రెండో స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

అయితే చైనాతో పాటు ఇత‌ర దేశాల్లో ఇంకా బాహుబ‌లి 2 రిలీజ్ కావాల్సి ఉంది. మ‌రి అక్క‌డ బాహుబ‌లి 2 మ‌రిన్ని వ‌సూళ్లు సాధిస్తే దంగ‌ల్ రికార్డును బీట్ చేయ‌వ‌చ్చు. అయితే దంగ‌ల్ ఎమోష‌న‌ల్ ఫీలింగ్ బేస్‌డ్ మూవీ…ఇక బాహుబ‌లి 2 లాంటి గ్రాఫిక్ బేస్‌డ్ చిత్రాలు చైనాలో కోకొల్లుగా వ‌స్తుంటాయి. దీంతో బాహుబ‌లి 2కు అక్క‌డ దంగ‌ల్ రేంజ్‌లో ఆద‌ర‌ణ ద‌క్క‌డం క‌ష్ట‌మే అంటున్నారు.