ఏపీలో మ‌రో ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ‌మా..!

తెలుగు మాట్లాడే ప్ర‌జ‌లంద‌రికి ఒకే రాష్ట్రం ఉండాల‌న్న ఉద్దేశంతో ఒకే భాష – ఒకే రాష్ట్రం నినాదంతో తెలుగు ప్ర‌జ‌లంతా మ‌ద్రాసోళ్ల‌పై ఫైటింగ్ చేసి, చివ‌ర‌కు పొట్టి శ్రీరాములు ప్రాణ‌త్యాగంతో మ‌నం ప్ర‌త్యేక ఆంధ్ర‌రాష్ట్రం సాధించుకున్నాం. తెలుగు భాష‌మాట్లాడే వాళ్ల‌కు ప్ర‌త్యేక రాష్ట్రం క‌ల ఏర్పాటు అయిన కొద్ది సంవ‌త్స‌రాల‌కే ప్ర‌త్యేక ఆంధ్ర‌, ప్ర‌త్యేక తెలంగాణ నినాదాలు, ఉద్య‌మాలు హీటెక్కాయి. అవి కాస్త చ‌ల్లారినా 2014లో రాష్ట్రం ఏపీ, తెలంగాణ‌గా విడిపోక త‌ప్ప‌లేదు.

వెన‌క‌బాటు త‌నమే తెలుగు ప్ర‌జ‌లు రెండు రాష్ట్రాలుగా ముక్క‌లు చెక్క‌లు కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్న‌ది తెలిసిందే. ఇందుకు రాజ‌కీయ‌, ఆర్థిక‌, ఇత‌ర‌త్రా కోణాలు ఎన్ని ఉన్నా వెన‌క‌బాటు త‌న‌మే అందుకు ప్ర‌ధాన‌మైంది. ఇక ఇప్పుడు ఏపీలోను వేర్పాటువాద ఉద్య‌మాలు వ‌చ్చే సూచ‌న‌లు ఉన్న‌ట్టు నాయ‌కుల ప్ర‌క‌ట‌న‌లు వెల‌వ‌డుతున్నాయి. అస‌లు ప్ర‌జ‌ల్లో ఇది లేక‌పోయినా నాయ‌కుల‌కు మాత్రం వారి రాజ‌కీయ అవ‌స‌రాలు వారికి ఉంటాయి.

ఏపీలో ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర‌తో పాటు సీమ జిల్లాలు వెన‌క‌బ‌డి ఉన్నాయి. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్ర‌త్యేక‌మైన దృష్టి సారించ‌క‌పోతే ఇక్క‌డ అయినా వేర్పాటువాద ఉద్య‌మాలు రావ‌న్న గ్యారెంటీ ఏంట‌ని ప్ర‌శ్నించేవాళ్లు ఉన్నారు. సీమ‌లో బైరెడ్డి లాంటి వాళ్లు ప్ర‌త్యేక సీమ రాష్ట్రం డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఇప్పుడు సీపీఐ ఇదే అంశంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. విశాఖ భూకుంభకోణంపై మాట్లాడిన‌ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాజధానిలో మరో 14వేల ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. గతంలో సేకరించిన భూమిలో ఇంకా నిర్మాణాలు చేపట్టకపోగా.. మళ్లీ భూసేకరణ ఎందుకని ప్రశ్నించారు.

ఈ క్ర‌మంలోనే అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృత‌మైతే మ‌రోసారి రాష్ట్రం విడిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌లు ఎలా ఉన్నా ప్ర‌స్తుం అమ‌రావ‌తి కేంద్రంగానే అభివృద్ధి జ‌రుగుతోంద‌న్న‌ది వాస్త‌వం. ఇప్ప‌టికే సీమ ప్ర‌జ‌లు దీనిపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు ఈ విష‌యంలో గ‌తంలో చేసిన పొర‌పాట్లు మరోసారి చేయ‌కుండా పున‌రాలోచించుకుంటే మంచిదేమో..!