దాసరి జీవితంలో ప‌ద్మనే టర్నింగ్ పాయింట్

ప్రేమాభిషేకం! తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో ఓ మైలు రాయి! దీనిని చెక్కిన శిల్పి దాస‌రి నారాయ‌ణ‌రావు. వెండితెర‌పై అద్భుత‌మైన ప్రేమ కావ్యాన్ని మ‌లిచిన దాస‌రి.. త‌న జీవితాన్ని కూడా ప్ర‌మే మ‌యం చేసుకున్నారు. త‌న అర్ధాంగి ప‌ద్మ‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనుక్ష‌ణం ఆమెతోనే త‌న జీవితాన్ని మ‌లుచుకున్నారు. ఇలా దాస‌రి-ప‌ద్మ‌ల ప్రేమాభిషేకానికి వేదిక హైద‌రాబాద్‌లోని సుల్తాన్ బ‌జార్ అంటే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు!! మ‌రి వీరిద్ద‌రి ప్రేమాభిషేకం ఎలా జ‌రిగిందో తెలుసుకుందామా?!

ఉద్యోగం కోసం పాల‌కొల్లు నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేసిన దాస‌రి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న చార్మినార్‌ (వీఎస్‌టీ) సిగరెట్ కంపెనీలో మొదట చిన్న ఉద్యోగం చేశారు. ఆ తరువాత హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లోనూ పనిచేశారు. సమాంతరంగా నాటకరంగంపైనా దృష్టిసారించారు. రవీంద్రభారతి, గాంధీభవన్‌, త్యాగరాయగానసభల్లో వందలాది నాటకాలు ప్రదర్శించారు. ఓసారి సొంత ఊరు(పాలకొల్లు)కు బయలుదేరిన ఆయన.. తన చెల్లెలకి గాజులు కొందామని పాతబస్తీలోని సుల్తాన్ బజార్ వెళ్లారు.

‘షాపు వాడు ఏ సైజు కావాలి?’ అని ప్రశ్నించడంతో దాసరికి ఏం చెప్పాలో పాలుపోలేదు. అప్పుడు పక్కనే నిల్చుని గాజులు కొంటున్న ఓ అమ్మాయి చెయ్యిని చూపించి ‘ఈ సైజువి కావాలి’ అని చెప్పారు. ఆ అమ్మాయి ఎవరో కాదు పద్మ! నాటకాలపట్ల ఆసక్తికలిగిన ఆమె.. నారాయణరావును చూడగానే ‘మీరు నాటకాలు వేస్తారుకదా. గాంధీభవన్‌లో మీ ప్లే చూశా’నని అన్నారట. అలా మొదలైనవారి పరిచయం.. అటుపై గాఢమైన ప్రేమగా మారింది. కొద్ది రోజులకే పెళ్లిచేసుకోవాలని డిసైడ్‌ అయ్యారు.

దీనికి ప‌ద్మ ఫ్యామిలీ స‌రే అన్నా .. నారాయణరావు కుటుంబం మాత్రం అభ్యంతరం తెలిపింది. అయినాసరే ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆ త‌ర్వాతే.. దాస‌రి జీవితం మూడు స్క్రిప్టులు, ఆరు మూవీలు లెక్క‌న సాగిపోయింది. అందుకే ప‌ద్మ అంటే దాస‌రికి ఎన‌లేని ప్రేమ‌.. ఆమె మృతి చెందిన త‌ర్వాత‌.. రెండేళ్ల‌పాటు మ‌నిషి కాలేక‌పోయాడంటే.. దాస‌రికి ప‌ద్మ‌పై ఉన్న ల‌వ్ ఏపాటిదో చెప్ప‌క‌నే చొప్పొచ్చు! సో.. ఇదీ దాస‌రి ల‌వ్ స్టోరీ!!