ఓ బ‌ల‌మైన రాజ‌కీయ పార్టీ పెట్టాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు ..అడ్డుకుందెవ‌రు?

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు తెలుగు పాలిటిక్స్‌లో ఓ సంచ‌ల‌నం. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ద‌ర్శ‌కుడికి ఓ ఇమేజ్ తెచ్చిన ఘ‌న‌త దాస‌రిదే. ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లో ఓ ద‌ర్శ‌కుడు 100 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఘ‌న‌త ముందుగా దాస‌రికే ద‌క్కింది. అలాగే 150 సినిమాలు చేసిన ఏకైక ద‌ర్శ‌కుడు కూడా దాస‌రే. దాస‌రి కెరీర్‌లో మొత్తం 151 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇక సినిమా రంగంలో గురువుగా శాసించిన దాస‌రి ఎంతోమందిని వెండితెర‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త కూడా ద‌క్కించుకున్నారు. ఇక కాపు సామాజిక‌వ‌ర్గంలో మంచి గ్రిప్ ఉన్న దాస‌రి ఆ సామాజిక‌వ‌ర్గాన్ని బేస్ చేసుకుని ఓ బ‌ల‌మైన రాజ‌కీయ పార్టీ పెట్టాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. 1996 కాపు సామాజిక‌వ‌ర్గం అండతో తెలుగుతల్లి పేరుతో ఓ రాజకీయ పార్టీ స్థాపించాలనుకున్నారు.

అయితే అప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ ప్ర‌య‌త్నాన్ని విజ‌య‌వంతంగా అడ్డుకుంది. దాస‌రికి పార్టీ ప‌రంగా స‌ముచిత‌మైన గౌర‌వం ఇస్తామ‌ని…సొంత పార్టీ వ‌ద్ద‌ని వేడుకుంది. దీంతో దాస‌రి 1996, 1998, 1999 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున నాటి స‌మైక్యాంధ్ర‌లో విస్తృత ప్ర‌చారం చేశారు. దాసరి సేవ‌ల‌కు ప్ర‌తిప‌లంగానే కాంగ్రెస్ పార్టీ 2000 సంవ‌త్స‌రంలో ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేసింది.

త‌ర్వాత 2004లో యూపీఏ అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న్ను  కేంద్రంలో బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రిగా నియ‌మించింది. ఇక 2006లో దాసరి రెండోసారి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. అయితే 2008లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా ఆయన కేంద్ర మంత్రిగా తప్పుకున్నారు. 2012 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా  కొనసాగారు.