ఆ పెద్ద పేప‌ర్‌లో జీతాల‌కే దిక్కులేదా..!

తెలుగు రాష్ట్రాల్లో అగ్ర శ్రేణి ప‌త్రిక తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంటూ.. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వ‌లేని దుస్థితిలో మునిగిపోయింది. దీంతో సిబ్బంది తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ప‌త్రిక‌కు మంచి బ్రాండింగ్ ఉన్నా.. ఎవ‌రికైనా అప్ప‌గించాల‌న్నా.. కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. దీంతో అటు యాజ‌మాన్యం, ఇటు సిబ్బంది గంద‌ర‌గోళ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇంగ్లీష్ ప‌త్రికల్లో మేటిగా ఉన్న డెక్క‌న్ క్రానిక‌ల్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక న‌ష్టాల్లో కూరుకుపోయింది.

తెలుగు రాష్ట్రాల్లోని అగ్రశేణి ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింద‌ని ప‌త్రికా వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఎప్పుడో ఈ సంస్థ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినా కూడా ఇటీవల వరకూ పత్రిక కార్యకలాపాలకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వచ్చింది. వేతనాలు మొదలుకుని ఏ విషయంలోనూ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. మామూలుగా డీసీలో వేతనాలు ప్రతి నెలా ఏడవ తేదీనే ఠంచనుగా బ్యాంకుల్లో వేస్తారు. కానీ జూన్ నెలకు సంబంధించిన వేతనం ఇంతవరకూ రాలేదు. దీంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నార‌ట‌.

ఆస్తులకు మించి అప్పులు తెచ్చుకోవటం.. ఒకే డాక్యుమెంట్లను పలు బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకోవటం వంటి ఎన్నో కేసులు డీసీ యాజమాన్యం ఎదుర్కొంటోంది. కొద్ది రోజుల క్రితం శ్రే ఇన్ ఫ్రా తనకు రావాల్సిన అప్పులకుగాను డెక్కన్ క్రానికల్ యాజమాన్య హక్కులను దక్కించుకునే ప్రయత్నం చేసింది. బోర్డులో తన సభ్యులను నియమించింది. ప్రస్తుతం పత్రిక బాగానే నడుస్తున్నా…ప్రకటనలు కూడా బాగానే వస్తున్నా జీతాలు ఇవ్వలేని పరిస్థితికి సంస్థ రావటంతో తమ భవిష్యత్ ఏమిటో అన్న ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు. గతంలో కూడా ఓ సారి 17వ తారీఖు వరకూ వేతనాలు వేయని పరిస్థితిని ఉద్యోగులు చూశారు.

ప్రస్తుతం మాత్రం ఎప్పుడు తమ ఖాతాలో వేతనాలు పడతాయో తెలియని గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. డెక్కన్ క్రానికల్ కు బ్రాండ్ నేమ్ బాగున్నంత‌ మాత్రాన ఇప్పుడు దాన్ని ఎవరైనా కొనుగోలు చేయాలన్నా జరిగే పనికాదు. ఎందుకంటే అన్ని సంక్లిష్టతలు అందులో ఉన్నాయి. ప‌త్రికా నిర్వ‌హ‌ణ రోజురోజుకూ భారమ‌వుతోంద‌నే వాద‌న వినిపిస్తున్న త‌రుణంలో డీసీ ఎంత‌వ‌రకూ ఈ ఆర్థిక న‌ష్టాల‌ను త‌ట్టుకుంటుందో వేచిచూడాల్సిందే!!