మంత్రి ఉమాకు ముందు నుయ్యి…వెన‌క గొయ్యి

కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో అప‌ర రాజ‌కీయ చాణుక్యుడిగా పేరున్న మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు పొలిటిక‌ల్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ముందునుయ్యి…వెన‌క‌గొయ్యి అన్న చందంగా మారింది. జిల్లా టీడీపీలోను, జిల్లా అధికార యంత్రాంగంలోను ఉమా అంటేనే తిరుగులేదు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో అయితే ఉమాకు ఎదురే ఉండేది కాదు. అలాంటి ఉమ ప‌రిస్థితి పైన ప‌టారం…లోన లొటారం అన్నట్టుగా ఉంది. ఆయ‌న ప్రాథినిత్యం వ‌హిస్తోన్న మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌పై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ విష‌యం జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మారింది.

1999, 2004లో సొంత నియోజ‌క‌వ‌ర్గం నందిగామ నుంచి పోటీ చేసిన ఉమ 2009లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగి నందిగామ ఎస్సీల‌కు రిజ‌ర్వ్ కావ‌డంతో ఆయ‌న ప‌క్క‌నే ఉన్న మైల‌వ‌రంకు మారారు. 2009, 2014లో మైల‌వ‌రం నుంచి పోటీ చేసి ఇక్క‌డ వ‌రుస‌గా రెండోసారి…మొత్తంగా నాలుగోసారి గెలుపొందారు. అలాంటి ఉమ‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం తీవ్ర‌మైన గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. ఉమా మ‌రోసారి మైల‌వ‌రంలో గెలుస్తాడా ? అని ప్ర‌శ్నిస్తే సొంత పార్టీ నేత‌లే క‌ష్టం అన్న అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

వ‌రుస‌గా రెండుసార్లు గెల‌వ‌డంతో పాటు నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉండ‌డం, అన్ని వ్య‌వ‌హారాలు పీఏకే వ‌దిలేయ‌డం ఆయ‌న‌కు చాలా మైన‌స్‌గా మారాయి. ఇక మంత్రిగా ఎక్కువుగా స్టేట్‌తో పాటు, జిల్లా వ్య‌వ‌హారాల‌పై దృష్టి కేంద్రీక‌రించి, నియోజ‌క‌వ‌ర్గంపై శీత‌క‌న్ను వేయ‌డంతో ఆయ‌న‌పై భారీ వ్య‌తిరేక‌త పెర‌గ‌డానికి మెయిన్ రీజ‌న్‌గా క‌నిపిస్తోంది. త‌న‌పై వ్య‌తిరేక‌త‌ను అంచ‌నా వేసుకున్న ఉమ సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ఇబ్ర‌హీంప‌ట్నం లేదా విజ‌య‌వాడ రూర‌ల్ లేదా కంచిక‌చ‌ర్ల కేంద్రంగా ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డితే అక్క‌డి నుంచి పోటీ చేసేందుకే ఆయ‌న సుముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఉమా ప్ర‌స్తుతం ఆ ప్రాంతాల్లోనే త‌ర‌చూ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గ‌క‌పోయినా ఆయ‌న పెన‌మ‌లూరు నుంచి పోటీ చేయాల‌ని బ‌లంగా కోరుకుంటున్న‌ట్టు జిల్లా టీడీపీలో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఏదేమైనా జిల్లా పాలిటిక్స్‌లో కింగ్‌గా ఉన్న ఉమకు ప్ర‌స్తుతం గ‌డ్డు ప‌రిస్థితులు గ‌ట్టిగా ఉన్నాయ‌న‌డంలో సందేహం లేదు.