DJ – TJ రివ్యూ

సినిమా : డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌
రేటింగ్ : 3.25/5
పంచ్ లైన్ : AA Show

నటీనటులు : అల్లుఅర్జున్, పూజా హెగ్డే, రావు ర‌మేశ్, వెన్నెల కిశోరె, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు
ఫైట్స్‌ : రామ్‌-లక్ష్మణ్‌
సినిమాటోగ్రఫీ : ఐనాక బోస్‌
ఎడిటర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్,  ఆర్ట్‌: రవీందర్‌
స్క్రీన్‌ప్లే : రమేష్ రెడ్డి, దీపక్‌ రాజ్‌
సంగీతం : దేవిశ్రీప్రసాద్
నిర్మాతలు : దిల్‌రాజు-శిరీష్‌
కథ, మాటలు, దర్శకత్వం : హరీష్‌ శంకర్‌.ఎస్‌

 

అప్పుడెప్పుడో ఆర్య సినిమా తరువాత మళ్ళీ ఇన్నాళ్లకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన సినిమా DJ .ఇద్దరిలోను అప్పటికి ఇప్పటికి చాలా మార్పులొచ్చాయి .ఒకరు ఏస్ ప్రొడ్యూసర్ గా చలామణి అవుతుండగా ఇంకొకరు టాప్ హీరోలలో ఒకడిగా మారిపోయాడు.అంతేనా అల్లు అర్జున్ సినిమా అంటే దానికి ఓ ప్రత్యేక టీం ఎల్లప్పుడూ పహారా కాస్తూ దాని బాగోగులు పర్యవేక్షిస్తుంది.అది మొదలైన దగ్గిరనుండి ..ఆన్ లైన్ లో ఆఫ్ లైన్ లో దాని ప్రమోషన్ దగ్గరినుండి అన్ని దగ్గరుండి చూసుకుంటారు.ఇంకో వైపు దిల్ రాజు సినిమా అంటే ఓ లెక్కుంటుంది.రాజు గారి లెక్కలకు అల్లు వారి టచ్ తోడయితే సినిమా అయితే మినిమం గ్యారెంటీ అని తెలిసిందే కానీ వీరిద్దరి మధ్య దర్శకుడు కథని ఎలా హ్యాండిల్ చేస్తాడన్నదే  అసలు పాయింట్.

మీకు..లాజిక్ కావాలా సినీ మ్యాజిక్ కావాలా..మొదటిది కావాలంటే మాత్రం DJ అంతగా రుచించక పొచ్చు.సినీమ్యాజిక్ కావాలంటే మాత్రం DJ మంచి ఐ ఫీస్ట్.సింపుల్ గా చెప్పాలంటే అదే DJ .హరీష్ శంకర్ లో మంచి కమర్షియల్ దర్శకుడున్నాడని మళ్ళీ ప్రూవ్ చేసాడు.సరైన ప్లాట్ దొరికితే దానికి తన మార్క్ ని జోడించి రెగ్యులర్ కథా వస్తువుని కూడా అందంగా ఆహ్లాదంగా ప్రెజెంట్ చేయగల దర్శకుడు హరీష్.చాలా సినిమాల్ని పోలి వున్నా ఎక్కడా ప్రేక్షకుడు DJ నుండి డీవియేట్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా హ్యాండిల్  చేసాడు.

సమాజం లో జరిగే చెడుని సహించలేని తత్వం వుండే ఓ బ్రాహ్మణ కుర్రాడు, ఓ నిజాయితీ గల పోలీస్ అధికారి కలిసి సమాజం లోని చెడుని ఏరివేయడమే కధాంశం సింపుల్ గా చెప్పాలంటే.ఓ కుర్రాడు చిన్నప్పటినుండి చెడుకు ఎదురు తిరగడం వాడిని పోలీస్ చేరదీయడం అనే కాన్సెప్ట్ తో గత పదేళ్లలో పాతికకు పైగా సినిమాలొచ్చింటాయి .కాకపోతే ఆ లైన్ కి బ్రాహ్మణ బాక్గ్రౌండ్ అని..మధ్యతరగతి అని .కష్టాలని..సుఖాలని..కామెడీ అని..ఎమోషన్ అని..అన్ని రసాలు  జోడించి DJ అని చెప్పాడు హరీష్.ఇవన్నీ కూడా కలగలిపి ఆల్రెడీ సినిమాలొచ్చేశాయాయి అని అనుకుంటే చేసేదేం లేదు.అందుకే మొదట్లోనే చెప్పేశా లాజిక్ లు కావాలా సినీ మ్యాజిక్  కావాలా అని.

అల్లు అర్జున్ సినిమా అంటే స్టైలిష్ గా ఉంటుంది.డాన్స్ లు బాగుంటాయి.యాక్టింగ్ కూడా ప్రతి సినిమా లో కొత్త వేరియేషన్ చూపిస్తూ ఉంటాడు ఇవన్నీ కామన్.బ్రాహ్మణ కామెడీ అంటే ఎక్కడో చిన్న అనుమానం బన్నీ ఎంతవరకు సక్సెస్ అవుతాడో అని.సక్సెస్ అవ్వడం కాదు ఏకంగా ఎక్కి సవారి చేసేసాడు బన్నీ.దువ్వాడ జగన్నాధం పాత్ర కి DJ పాత్రకి మధ్య బన్నీ అద్భుతమైన వేరియేషన్స్ చూపించాడు.రెండు గెటప్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.ఎంత వేరియేషన్ అంటే ఒక్క సీన్ చెప్పొచ్చు.దువ్వాడ జగన్నాధం నుండి DJ గెటప్ వేసుకుని కంప్లీట్ స్టైలిష్ గా మెస్మరైజ్ చేస్తూ అంతలోనే గమ్మునుండవోయ్ అంటూ తెలంగాణ యాసలో విల్లన్ కి దంకి ఇవ్వడం హై లైట్.

కొసరు విల్లన్స్ తో నడిచిన కథంతా గ్రిప్పింగ్ గా సాగితే అసలు విల్లన్ రావు రమేష్ దగ్గరికొచ్చేసరికి హీరో ని విల్లన్ ని ఎక్కడ కనెక్ట్ చెయ్యాలో ఎక్కడ ఎండ్ చెయ్యాలో తెలియక స్క్రీన్ ప్లే పేలవంగా నడుస్తుంది.అదొక్కటే సినిమాని కాస్త వెనక్కి నెడుతుంది.దాన్ని ఓవర్ కం చేయడానికి రాసుకున్న క్లైమాక్స్ మాత్రం బాగా వర్క్ అవుట్ అయ్యింది.అల్లు అర్జున్ దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో క్లైమాక్స్ ఫైట్ పెట్టకుండా కామెడీ టచ్ ఇచ్చి ముగించడం సూపర్.అది పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది కూడా.

సినిమా మొత్తానికి ఓ అరడజను సీన్స్ హైలైట్ అనిపిస్తాయి.వాటిని చాలా జాగ్రత్తగా ప్రతి అరగంటకో 20 నిమిషాలకో ఒకటి వచ్చేలా చేసాడు హరీష్ చాలా తెలివిగా.స్క్రీన్ ప్లే డల్ అయినా ప్రతి సారి ఆ సీన్స్ సినిమాని నిలబెట్టేశాయి.దువ్వాడ జగన్నాధం చిన్నప్పుడు గన్ ఫైర్ చేస్తూ విల్లన్స్ ని చంపే సీన్ హై లైట్.అలాగే గమ్మునుండవోయ్ సీన్,మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ఎలివేట్ చేసే సీన్(శ్రీమంతుడు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తమ్ముడు పట్నం వెల్దామనుకునే ముందు సీన్ లాంటిది).పెదరాయుడు సినిమాలో ది రిలేషన్ షిప్ స్పూఫ్ సీన్,సీటీ మార్ సాంగ్,క్లైమాక్స్.ఇలా ఓ పదినిమిషాల అవేరేజ్ సినిమా తరువాత ఒక పీక్ సీన్ పడితే మొత్తం ఆ పదహైదు నిమిషాల సినిమా పీక్స్ కి వెళ్తుంది.అదే ఫార్ములా వాడేసాడు DJ .

పూజా హెగ్డే పర్ఫెక్ట్ ప్లాన్ తో DJ సినిమా ఒప్పుకుంది అనిపిస్తుంది.తన కం బ్యాక్ మూవీ తో తనేం చెప్పదల్చుకుందో క్లియర్ గా చెప్పేసింది.సెన్సార్ కట్ చేయడానికి వీల్లేనంత వరకు అందచందాల్ని ఆరబోసి టాలీవుడ్ నేను రెడీ అంటూ మెసేజ్ ఇచ్చేసింది.పాపం సెన్సార్ వాళ్ళు కూడా ఓ బికినీ సీన్ లో బ్లర్ వేసేంత ఆరబోసిందంటే అర్థం చేసుకోవచ్చు.పూజ స్క్రీన్ ప్రెజెన్స్ బ్రిలియంట్.కొంత కాలం టాలీవుడ్ లో వెలగడం ఖాయం.మిగిలిన అందరిలో రావు రమేష్ క్యారక్టరిజషన్ సరిగా లేదు.అతని బలమేంటో బలహీనత ఏంటో చూసే మనకూ,చేసే అతనికి,డైరెక్ట్ చేసిన హరీష్ కి కూడా క్లారిటీ లేదు పాపం.

సినిమాకి సెకండ్ హీరో ఎవరన్నా ఉంటే అది మాటలు రాసిన దర్శకుడు హరీష్ శంకర్ యే.హరీష్ మాటలు చాలా సాధారణ సన్నివేశాల్ని కూడా బాగా ఎలివేట్ చేశాయి.మచ్చుకు కొన్ని మీకోసం.

  • ఎప్పుడో సీతను ఎత్తుకెళ్లాడని రావణాసురుడిని ప్రతి సంవత్సరం కాలుస్తుంటాం అదే మన అక్కచెల్లెళ్లని ఏడిపిస్తూ ఎత్తుకెళ్తుంటే కాల్చడం తప్పేంటి సర్
  • బెజవాడ అంటే పైన అమ్మవారు కింద కమ్మవారు.
  • నెలకు ఐదు లక్షల జీతం తీసుకునే వాడు ఐదు రోజులు టెన్షన్ తీసుకోలేడా.
  • కావలసిన వాళ్ళ కళ్ళు చూస్తే కష్టం తెలిసిపోతుంది.
  • బాధలు రెండు రకాలు.ఒకటి ఏడ్చేలా చేస్తుంది,రెండు ఎదురించేలా చేస్తుంది.
  • నేను కాళ్లకు సాక్స్ యే వేసుకోను అలాంటిది పిల్లలు పుట్టకుండా అంటే…
  • ఒక్కడినే ఎంతకాలం సెల్ఫీలు కొట్టుకొను.

చివరి రెండూ అడల్ట్ పంచెస్.సిట్యుయేషన్ కి బాగా సింక్ అయ్యాయి.

దిల్ రాజు సినిమా అల్లు అర్జున్ తో అంటే సాంకేతికంగా ఏ లోపం ఉండదు అని ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు.అలాగే వుంది. సినిమాని అక్కడక్కడా స్క్రీన్ ప్లే కాస్త డౌన్ చేసినా హరీష్ శంకర్ మాటలు అల్లుఅర్జున్ వేరియేషన్ సినిమాని పీక్స్ లో నిలబెట్టాయి.