మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ రాజకీయాల్లో జేజ‌మ్మ కాక రేపుతోందిగా..

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి రోజు రోజుకు వీక్ అవుతోంది. వాస్త‌వంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మీద ఇప్పుడిప్పుడే వ్య‌తిరేక‌త స్టార్ట్ అవుతోంది. అయితే దీనిని క్యాష్ చేసుకోవ‌డంలో టీ కాంగ్రెస్ నాయ‌కులు ఘోరంగా ఫెయిల్ అవుతున్నార‌న్న‌ది రాజ‌కీయవ‌ర్గాల్లో విన‌ప‌డుతోన్న చ‌ర్చ‌. టీ కాంగ్రెస్‌లో ఉద్దండులైన నాయ‌కులు చాలా మందే ఉన్నారు. అయితే వీరంతా ప్ర‌జ‌ల ప‌క్షాన‌, ప్ర‌భుత్వంపై పోరాటం చేయాల్సింది పోయి, ఆలూ లేదు చూలు లేదు…కొడుకు పేరు సోమ‌లింగం అన్న చందంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌కుండానే తామే సీఎం…తామే సీఎం అని ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేసుకుంటున్నారు. ఇదే టీ కాంగ్రెస్‌కు ప్ర‌ధాన‌మైన మైన‌స్‌.

సీనియ‌ర్ల కుమ్ములాట‌ల‌తో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్‌కు స‌రైన అభ్య‌ర్థులే లేకుండా పోతున్నారు. ఇదిలా ఉంటే పాల‌మూరు జిల్లాలోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ సీటుపై ఇప్పుడు మాజీ మంత్రి, గ‌ద్వాల్ ఎమ్మెల్యే డీకే.అరుణ క‌న్నుప‌డిన‌ట్టు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ హాట్‌గా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. డీకే అరుణ 1996లో ఇదే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ స్థానం నుంచి టీడీపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ నేత మ‌ల్లిఖార్జున్‌పై కేవ‌లం 5 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆమె కాంగ్రెస్‌లోకి మారి ఆ పార్టీ త‌రపున గద్వాల్ నుంచి వ‌రుస‌గా 1999 – 2004 -2009 -2014లో నాలుగుసార్లు విజ‌యం సాధించి.. మంత్రి అవ్వ‌డంతో పాటు తెలంగాణ రాజ‌కీయాల్లో తిరుగులేని ఫైర్‌బ్రాండ్ లేడీల్లో ఒక‌రు అయ్యారు.

గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున ఇక్క‌డ నుంచి పోటీ చేసిన జైపాల్‌రెడ్డికి, అరుణ‌కు మ‌ధ్య అంత స‌ఖ్య‌త లేదు. ఇక జైపాల్‌ను జిల్లా నుంచి బ‌య‌ట‌కు పంపే వ్యూహం ర‌చిస్తోన్న అరుణ ఇక్క‌డ నుంచి త‌న భ‌ర్త డీకే.భ‌ర‌త‌సింహారెడ్డికి ఎంపీ సీటు ఇవ్వాల‌ని టీ కాంగ్రెస్‌తో పాటు అధిష్టానాన్ని కోరుతున్నార‌ని టాక్‌. ఆమెకు ఏ మాత్రం కోపం వ‌చ్చినా ఆమె పార్టీ మారుతుందేమోన‌న్న ఆందోళ‌న టీ కాంగ్రెస్ నాయ‌కుల్లో ఉంది. దీంతో అరుణ కోరిన కోరిక కాద‌న‌డం వాళ్ల‌కు క‌త్తిమీద సాములాంటిదే.

ఈ క్రమంలోనే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ కాంగ్రెస్ ఎంపీ సీటును అరుణ భ‌ర్త‌కు ఇస్తే గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసిన జైపాల్‌రెడ్డి చేవేళ్ల‌కు వెళ్లిపోక త‌ప్ప‌దు. జైపాల్ 2009లో చేవెళ్ల నుంచే ఎంపీగా గెలిచారు. జైపాల్ చేవెళ్ల‌కు మారితే అక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మాజీ హోం మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డిని ప‌క్క‌న పెట్టాలి. ఏదేమైనా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ రాజకీయాల్లో జేజ‌మ్మ కాక రేపుతోంది.