కాంగ్రెస్ అక్కకు…టీఆర్ఎస్ త‌మ్ముడి చిచ్చు ఎందుకు..!

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు కామ‌న్‌. అస‌లు ప్ర‌త్య‌ర్థులు లేక‌పోతే, ఒక‌ళ్ల‌నొక‌ళ్లు విమ‌ర్శించుకోక‌పోతే, తిట్ట దండ‌కం చ‌దివించుకోక‌పోతే.. అది రాజ‌కీయ‌మేకాదు. అయితే, తెలంగాణ‌లోని పాల‌మూరులో పాలిటిక్సే ఇప్పుడు అంద‌రినీ తీవ్రంగా బాధ‌పెడుతున్నాయి. ఇక్క‌డి రాజ‌కీయాలు ఆ కుటుంబాన్ని శాసిస్తున్నాయి. అక్కా త‌మ్ముళ్ల మ‌ధ్య ఉన్న ర‌క్త సంబంధానికి సైతం స‌వాల్ విసురుతున్నాయి. ఒక‌ళ్ల నొక‌ళ్లు ముఖం కూడా చూసుకునే ప‌రిస్థితి లేకుండా చేస్తున్నాయి. అదికూడా గ‌తంలో మంత్రిగా చేసిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత కేంద్రంగా జ‌ర‌గ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీసింది. విష‌యంలోకి వెళ్తే..

పొలిటిక‌ల్ లీడ‌ర్ డీకే అరుణ గురించి దాదాపు తెలియ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రు. అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టికీ.. ఆమె త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా అనేక వేదిక‌లు సృష్టించుకున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు డిఫ‌రెంట్ స్ట్రాట‌జీతో పాలిటిక్స్‌లో త‌న‌కంటూ గుర్తింపు పొందిన ఆమెకు పుట్టింటి నుంచి మాత్రం గౌర‌వం ద‌క్క‌డం లేదు. అంతేకాదు, త‌న‌కు లేనిపోని అవ‌మానాలు సైతం ఎదురవుతున్నాయ‌ని అంటున్నారు ఆమె స‌న్నిహితులు. ఆమె త‌న స్వ‌హ‌స్తాల‌తో రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చి, ఓన‌మాలు నేర్పించిన త‌న తోడ‌బుట్టిన త‌మ్ముడే ఆమెకు శాపంగా మారాడ‌ని అనుకుంటున్నారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కి చెందిన చిట్టెం న‌ర్సిరెడ్డి రాజ‌కీయంగా ఎంతో ప‌రిణితి చెందిన నేత‌. ఆయ‌న కూతురే డీకే అరుణ‌. ఈమెకు ఇద్ద‌రు త‌మ్ముళ్లు ఉన్నారు. వారిలో ఒక‌రు చిట్టెం వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి గ‌తంలోనే మ‌ర‌ణించారు. మ‌రో త‌మ్ముడు రామ్మోహ‌న్‌రెడ్డిని అరుణ ఎంతో ప్రేమ‌గా చూసుకున్నారు. ఈ క్ర‌మంలోనే అత‌నిని పాలిటిక్స్‌లోకి తీసుకువ‌చ్చి.. ఓన‌మాలు నేర్పించి మ‌రీ ఎదిగేలా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సోదరుడికి టిక్కెట్ ఇప్పించుకున్నారు . మక్తల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రామ్మోహన్ రెడ్డి. డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు వీరి మధ్య సయోధ్య బాగానే ఉండేది. అక్కా తమ్ముళ్లు తరచూ సమావేశమై రాజకీయ, కుటుంబ పరిస్థితులు చర్చించుకునే వారు.

అయితే, రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో కాంగ్రెస్ దారుణంగా దెబ్బ‌తినింది. దీంతో ఇక‌, కాంగ్రెస్‌లో ఉండ‌డం ఎందుక‌నుకున్న రామ్మోహ‌న్‌రెడ్డి.. ఓ శుభ‌ముహూర్తాన కేసీఆర్ కారెక్కేశారు. ఈ ప‌రిణామ‌మే ఈఅక్కా త‌మ్ముళ్ల మ‌ధ్య చిచ్చు పెట్టింది. ఇద్దరూ రాజకీయంగా ప్రత్యర్థులయ్యారు. మక్తల్, నారాయణ పేటలో పార్టీ కార్యక్రమాలకు వేర్వేరుగా ఇద్దరూ హాజరయ్యేవారు. రామ్మోహన్ రెడ్డి అక్కపైనే ఆరోపణలు కూడా చేసేవారు. రాజ‌కీయంగా ఇవి స‌హ‌జం క‌దా అనుకునే వారు అంద‌రూ అయితే, కుటుంబ పరంగా కూడా వీరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు త‌లెత్తాయి. రెండు రోజుల కింద‌ట ఆగస్టు 15వ తేదీన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి, సోద‌రుడు వెంకటేశ్వరెడ్డి 12 వ వర్ధంతి జరిగింది.

సహజంగానే డీకే అరుణ తన తండ్రి సమాధి వద్దకు నివాళులర్పించడానికి వెళితే అక్కడే ఉన్న రామ్మోహన్ రెడ్డి ఆమె వచ్చిన కార్లను పగలకొట్టమని అనుచరులను ఆదేశించారట‌. అంతటితో ఆగకుండా అరుణపై తిట్ల దండకాన్ని అందుకున్నారు. తండ్రి సమాధి వద్ద మౌనంగా ఉన్న అరుణ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్లారు. అయితే అక్కడకీ వచ్చిన రామ్మోహన్ రెడ్డి అరుణను దూషించార‌ట‌. ఇంటి నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించాడ‌ట‌. ఒక‌ప‌క్క‌ కుటుంబ సభ్యులు వారిస్తున్నా రామ్మోహన్ రెడ్డి వినకపోవడంతో భోజనం చేయకుండానే డీకే అరుణ ఇంటి ముఖం ప‌ట్టారు. దీంతో ఇప్పుడు ఈ ఘ‌ట‌న‌లే పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీశాయి.