బీజేపీకి మోగిన‌ ప్ర‌మాద ఘంటిక‌లు..

June 13, 2018 at 4:18 pm

దేశంలో బీజేపీకి కష్టకాలం మొదలైనట్లే కన్పిస్తోంది. ఈ మధ్య కాలంలో అన్నీ ప్రతికూల ఫలితాలే. 2014 ఎన్నికల తర్వాత ఇటీవల వరకూ అప్రతిహతంగా ముందుకు సాగిన విజ‌య‌యాత్ర‌కు క్ర‌మంగా బ్రేకులు ప‌డుతున్నాయి. గత కొన్ని రోజులుగా పార్టీకి ఎదురుదెబ్బలు తగలటం ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణంగా తయారైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే స‌మ‌యంలో ప్రతిపక్షాల ఐక్యత కూడా క‌మ‌ల‌ద‌ళానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా.. కర్ణాటకలో ఆ పార్టీకి బుధవారం నాడు మరో షాక్ తగిలింది. జయనగర అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో బిజెపి అభ్యర్థి బీఎన్‌ ప్రహ్లాద్‌పై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సౌమ్యరెడ్డి విజయం సాధించారు.

ఈ స్థానానికి జూన్‌ 11న( సోమవారం) ఎన్నికలు నిర్వహించగా 55శాతం పోలింగ్‌ నమోదైంది. కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యాకు జేడీఎస్‌ మద్దతు ప్రకటించింది. దీంతో క‌ర్ణాట‌క‌లోని 28పార్ల‌మెంటు స్థానాల్లోనూ బీజేపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎదురుదెబ్బ‌త‌ప్ప‌ద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇటీవ‌ల ప‌లు రాష్ట్రాల్లోని నాలుగు పార్ల‌మెంటు స్థానాలు, ప‌ది అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ బీజేపీ చావుదెబ్బ‌తింది. కేవ‌లం ఒక పార్ల‌మెంటు, ఒక అసెంబ్లీ స్థానంలో మాత్ర‌మే విజ‌యం సాధించింది. ప్ర‌ధానంగా ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని కైరానా లోక్‌స‌భ స్థానాన్ని కూడా ఆ ఆపార్టీ కోల్పోయింది.

అంతకుమందు గోర‌ఖ‌పూర్‌, పుల్పూర్ లోక్‌స‌భ స్థానాల్లోనూ క‌మ‌లం పార్టీ చిత్తుగా ఓడిపోయింది ఈ మూడు స్థానాలు కూడా సిట్టింగ్ స్థానాలే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ బీఎస్పీ, ఎస్పీలు, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. గోర‌ఖ‌పూర్‌, పుల్పూర్‌లో మాత్రం బీఎస్పీ, ఎస్పీలు మాత్ర‌మే క‌లిసి బ‌రిలోకి దిగ‌గా కాంగ్రెస్ సొంత అభ్య‌ర్థిని నిల‌బెట్టింది. నిజానికి కాంగ్రెస్ కావాల‌ని దూరంగా ఉండ‌డం వ‌ల్లే ఎస్పీ, బీఎస్పీ కూట‌మికి క‌లిసొచ్చింద‌ని ప‌లువురు అంటున్నారు. ఇక కైరానాలో మాత్రం ఆర్ఎల్‌డీ అభ్య‌ర్థికి ఈ మూడు పార్టీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి, బీజేపీని మ‌ట్టిక‌రిపించాయి.

ఈ ఫ‌లితాల‌న్నీ కూడా కాంగ్రెస్ నేత‌`త్వంలో విప‌క్షాలు ఏక‌మ‌య్యేలా చేస్తున్నాయి. కైరానా ఫ‌లితంలో ప్ర‌ధాని మోడీని కూడా ఓడించ‌గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కాన్ని విప‌క్షాలు పొందాయి. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో దాదాపుగా 400స్థానాల్లో విప‌క్షాలు ఉమ్మ‌డి అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల ఎన్‌సీపీ నేత ఒకరు ధ్ర‌వీక‌రించ‌డం గ‌మ‌నార్హం. విప‌క్ష కూట‌మిలో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత‌, ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో విప‌క్షాల బ‌లాబ‌లాల ఆధారంగా సీట్ల కేటాయింపులు ఉంటాయ‌ని అంటున్నారు.

ఇక్క‌డ విప‌క్షాలు ఎక్క‌డ కూడా బింకాల‌కు పోకుండా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇందుకు క‌ర్ణాట‌క‌లో 78 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ 38సీట్లు గెలిచిన జేడీఎస్ నేత కుమారస్వామిని ముఖ్య‌మంత్రిని చేయ‌డ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో ఎస్పీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీని ఓడించేందుకు, విప‌క్షాల కూట‌మి ఐక్యంగా ఉండేందుకు కొన్ని సీట్లు త్యాగం చేయ‌డానికైనా సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. దీనినిబ‌ట్టి తెలిసిపోతోంది.. నేత‌లు ఐక్యంగా క‌లిసి బ‌రిలోకి దిగేందుకు ఎంత ప్రాధాన్య‌త ఇస్తున్నారో. మ‌రోవైపు ప్ర‌ధానిగా మోడీ నాలుగేళ్ల పాల‌న పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప‌లు సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేల్లోనూ ప్ర‌తికూల ఫ‌లితాలే వ‌చ్చాయి. మోడీ ప్ర‌భ త‌గ్గిపోతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇక, బీజేపీ అంత‌ర్గ‌తం నిర్వ‌హించిన స‌ర్వేలోనూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ 130సీట్ల‌కు ప‌రిమితం అవుతుంద‌ని తేలింది. గ‌త ఎన్నిక‌ల్లో సొంతంగా 282స్థానాల్లో విజ‌యం సాధించిన క‌మలం ఈసారి అతిత‌క్కువ సీట్ల‌కు ప‌రిమితం అవుతుంద‌న్న సంకేతాల‌తో నేత‌లు ఉక్కిరిబిక్కిరి ర‌వుతున్నారు. మ‌రోవైపు ఎన్డీయే మిత్ర‌ప‌క్షాలు కూడా గుర్రుగా ఉన్నాయి. ఇప్ప‌టికే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డంతో ఎన్డీయే నుంచి టీడీపీ అధినేత‌,ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వచ్చారు. శివ‌సేన అధినేత ఉద్ద‌వ్‌ఠాక్రే మాత్రం ఎన్డీయే కొన‌సాగుతూనే తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు చేస్తున్నారు. బిహార్‌లో ఉన్న 40 స్థానాల్లో త‌మ‌కు 25, బీజేపీ 15సీట్లు అంటూ జేడీయూ నేత నితీశ్‌కుమార్ మెలిక‌పెట్టి కూర్చున్నారు.

అంతేగాకుండా బిహార్‌లో ఎన్డీయే ప‌క్షాల మ‌ధ్య ముస‌లం మొద‌లైంది. ఆర్ఎల్‌డీపీ నేత , కుంద్ర‌మంత్రి ఉపేంద్ర‌కుష్వానా కూడా ఇటీవ‌ల నిర్వ‌హించిన ఎన్డీయే ముఖ్య‌నేతల భేటీకి హాజ‌రుకాలేదు. గ‌త ఆదివారం కుష్వానా ఇచ్చిన ఇఫ్తార్ విందుకు నితీశ్, లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీ నుంచి కూడా ఎవ‌రూ రాకపోవ‌డం గ‌మ‌నార్హం. నితీశ్‌కుమార్‌తో విభేదించిన కుష్వానా ఆర్ఎల్‌డీపీని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ గెల్చుకున్న 282 సీట్ల‌లో అత్య‌ధికంగా సీట్లు సాధించించింది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, గుజ‌రాత్‌, రాజ‌స్తాన్ మ‌రికొన్ని ఉత్త‌ర‌భార‌దేశం రాష్ట్రాల్లోనే. ఇక ప‌శ్చిమ‌బెంగాల్‌, తెలంగాణ‌, ఆంద్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల్లో ఉన్న 120పైగా స్థానాల‌కుగాను బీజేపీ కేవ‌లం ఆరేడు సీట్ల‌కే ప‌రిమితం అయింది.

గ‌త ఎన్నిక‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని 80 పార్ల‌మెంటు స్థానాల్లో బీజేపీ మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి 73 గెలుచుకుంది. ఈ సారి ప‌రిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గుజ‌రాత్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. వ‌చ్చే న‌వంబ‌ర్‌లో రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈమూడు రాష్ట్రాల్లోనూ ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా ఉన్నాయ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఏదేమైనా.. బీజేపీకి ప్ర‌మాద ఘంటిక‌లు మోగిన‌ట్టేన‌ని చెబుతున్నారు.

బీజేపీకి మోగిన‌ ప్ర‌మాద ఘంటిక‌లు..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share