టీవీ-9 రేటింగ్ ఇలా పెరిగిందా!

December 14, 2017 at 12:34 pm
TV9, news channel, bidet, roja, bandla ganesh, pawan kalyan, ys jagan

ప‌త్రిక‌లైతే సెర్క్యులేష‌న్‌, టీవీ ఛానెళ్లు అయితే రేటింగ్‌! ఇవిలేకుండా వాటి మ‌నుగ‌డను ఊహించ‌లేం. ప‌త్రిక ప‌రిస్థితి ఒకింత గౌర‌వ‌ప్ర‌దంగానే ఉన్నా.. టీవీ ఛానెళ్లు మాత్రం త‌మ టీఆర్‌పీ రేటింగ్ కోసం నానా విధాలుగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అవి ద‌గుల్బాజీ వ్య‌వ‌హారాల‌కు తెర‌దీస్తున్నాయ‌ని అంటున్నారు విమ‌ర్శ‌కులు. చ‌ర్చా వేదిక‌లు ర‌చ్చ‌కు వేదిక‌లుగా మారిపోతున్నాయి. ఆయా వేదిక‌ల్లో పాల్గొనే వారు ఎంత రెచ్చిపోతే అంత రేటింగ్ అన్న‌ట్టుగా ఛానెళ్లు కూడా వారిని రెచ్చ‌గొడుతున్నాయి. రాజ‌కీయ వేదిక‌లంటే.. స‌మ‌న్వ‌య ప‌రిస్థితిలో ఓ స‌మ‌స్య‌పై సానుకూల ప‌రిష్కారాన్ని చూపేవి. అయితే, ఇటీవ‌ల కాలంలో ఒక‌టి రెండు ఛానెళ్లు మ‌రీ ప‌రిధులు దాటిపోయి చ‌ర్చ‌ల‌ను ర‌చ్చ చేసేస్తున్నాయి. 

తాజాగా సినీ న‌టి, న‌గ‌రి వైసీపీ ఎమ్మెల్యే రోజా, సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్‌ల విష‌యం తీవ్ర వివాదానికి కార‌ణ‌మైంది. అస‌లు వీరిద్ద‌రినీ రెచ్చ‌గొట్టి.. ర‌చ్చ‌చేసి.. రేటింగ్ పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించిన టీవీ-9పై సర్వ‌త్రా విమ‌ర్శ‌ల బాణాలు ప‌డుతున్నాయి. నిజానికి ఓ రాజ‌కీయ విష‌యంపై చ‌ర్చ పెట్టాల‌నుకున్న‌ప్పుడు ఆ రంగానికి సంబంధించిన వ్య‌క్తిని లేదా నేత‌ను చ‌ర్చ‌కు కూర్చోబెట్టాలి. కానీ, నిన్న‌టికి నిన్న జ‌రిగిన టీవీ-9 చ‌ర్చ‌లో రాజ‌కీయాల‌తో సంబంధం లేని బండ్ల గ‌ణేష్‌ను తీసుకువ‌చ్చి కూర్చోబెట్టారు. ఇక‌, ఫోన్‌లో వైసీపీ ఎమ్మెల్యే రోజాను చ‌ర్చ‌కు ఆహ్వానించారు. స‌హ‌జంగానే వైసీపీలో ఉన్నందున రోజా మిగిలిన రాజ‌కీయ ప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని ఎవ్వ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన ప‌నిలేదు. 

కానీ, బండ్ల గ‌ణేష్‌ను ఎలా స‌మ‌ర్ధిస్తారు? ఆయ‌న ఏరాజ‌కీయ పార్టీ త‌ర‌ఫున మాట్లాడే అర్హ‌త ఉంది. ఒక‌వేళ మాట్లాడాలి అంటే నిర్మాణాత్మ‌క సూచ‌న‌లు, స‌ల‌హాలు, విమ‌ర్శ‌లు చేయాలే త‌ప్ప రెచ్చిపోవ‌డం ఏంటి?  అందునా ఓ మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధి ని `ప‌డుకోబెడ‌తా రా!` అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంటి. మ‌రి స‌మాజం గురించి, నేటి రాజ‌కీయాల గురించి, నేత‌ల బాగోతాల గురించి క‌న్నీరు కార్చే టీవీ-9 స‌దరు వ్యాఖ్య‌ల‌ను య‌ధాత‌థంగా ప్ర‌సారం చేయ‌డం, వాటిని రెచ్చ‌గొట్టి ప‌దేప‌దే చూపించ‌డం వంటివి నిజానికి సమ‌కాలీన బాధ్య‌తాయుత జ‌ర్న‌లిజానికి అద్దం ప‌ట్టేవేనా?  అంటే ఎంత‌మాత్ర‌మూ హ‌ర్షించే ప‌రిణామం కాదు. అస‌లు రాజ‌కీయాల‌తో సంబంధం లేని వ్య‌క్తిని చ‌ర్చ‌కు ఆహ్వానించ‌డమే పెద్ద త‌ప్పు. పైగా ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తే.. చూస్తూ నిమ్మ‌ళంగా ఉంటూ రెచ్చ‌గొట్ట‌డం మ‌రింత త‌ప్పు! 

కేవ‌లం టీఆర్ పీ రేటింగ్ కోస‌మే ఇలాంటి చేయ‌డం ఆ ఛానెల్‌కు స‌రైన ప‌రిణామం కాద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌, ప్ర‌జాప్ర‌తినిధిగా ఉన్న రోజా కూడా అవ‌త‌లి వారి స్థాయి ఏమిటో తెలుసుకుని వ్యాఖ్యానించాల్సిన అవ‌స‌రం కూడా క‌నిపిస్తోంది. రాజ‌కీయాల్లో ఆద‌ర్శాల‌ను ఆమె పాటించ‌డం ద్వారా పోయేది ఏమీ లేదు. అయితే, ఆమె కూడా వ్య‌క్తిగ‌త గుర్తిపు కోసం త‌హ‌త‌హ లాడుతుండడం కూడా ఇలాంటి వ్య‌వ‌హారాల‌కు కార‌ణం అవుతోంది. ప్ర‌జ‌ల్లో గుర్తింపు ఎలానూ ఆమె సంపాయించుకుంది. ఇక‌, టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొనాలంటే.. ఇలానే మాట్లాడాలి.. అని ఆమె అనుకున్నారా? అంటే ఏమో? ఇక‌, ఇలా మాట్లాడే ట‌ట్ట‌యితేనే చ‌ర్చ‌ల‌కు పిలుస్తారంటే.. ప్ర‌తి ఒక్క‌రూ ఇలానే మాట్లాడాల్సి ఉంటుంది.

ఇక‌, అప్పుడు చ‌ర్చ‌లు ఎందుకు ? ఇక‌, బండ్ల గ‌ణేష్ కూడా త‌న‌కు సంబంధం లేని రాజ‌కీయాల గురించి మాట్లాడ‌డం త‌న‌ను తాను చిన్న‌బ‌రుచుకోవ‌డ‌మే. సినిమాల్లో ఉంటూ రాజ‌కీయాల గురించి మాట్లాడే త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ లాంటి వారు ఒక‌రిద్ద‌రు ఉన్నారు. వారిని చూసైనా బండ్ల బుద్ది తెచ్చుకోవాలి. త‌న‌కు ప‌వ‌న్ అన్నాజ‌న‌సేన అన్నా అభిమానం ఉండొచ్చు. అయితే, పార్టీ స‌భ్య‌త్వం తీసుకుని, ఏ పార్టీ ప‌ద‌విలోనూ ఉంటూ ఇలా వ్యాఖ్యానిస్తే.. అప్పుడు తెలుస్తుంది. అంతేకానీ ఇలా టీవీ చ‌ర్చ‌ల్లో నోరు పారేసుకోవ‌డం, దీనిని టీవీ-9 త‌న రేటింగ్‌కోసం వాడుకోవ‌డం దిగ‌జారుతున్న జ‌ర్న‌లిజం ప్ర‌మాణాల‌కు హెచ్చ‌రిక‌గానే చెప్ప‌డంలో ఎంత మాత్రం అనుమానం లేదు. మ‌రి ఇలాంటి స‌మాజాన్నే.. టీవీ-9 కోరుకుంటోందా?! 

 

టీవీ-9 రేటింగ్ ఇలా పెరిగిందా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share