త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాటీడీపీ నేత‌లు…ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

నంద్యాల ఉప ఎన్నిక ఆది నుంచి అంతం వ‌ర‌కు అనేక ట్విస్టులు, ఉత్కంఠ‌లు, కేసుల న‌మోదు వంటి అనేక అంశాల చుట్టూ తిరిగి.. ఆ నియోజ‌క‌వ‌ర్గాన్నే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎల్లుండే ఈ ఎన్నిక ఫ‌లితం వెల్ల‌డి కానుండ‌డంతో మొత్తం ప్ర‌క్రియ‌కు ఆరోజుతో ఫుల్ స్టాప్ ప‌డుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఇక‌, సోమ‌వారం నాటి లెక్క‌ల‌పై పోలింగ్ ముగిసిన మ‌రుక్ష‌ణం నుంచే బెట్టింగులు మొద‌ల‌య్యాయి. మా అభ్య‌ర్థి గెలుస్తాడంటే.. మా వాడే గెలుస్తాడంటూ.. పెద్ద ఎత్తున కోట్ల‌లో బెట్టింగులు క‌ట్టారు. అదే స‌మ‌యంలో, స‌ర్వేలు కూడా త‌మ త‌మ ఫ‌లితాలు వెల్ల‌డించేశాయి. మొత్తంగా నంద్యాల టీడీపీ ప‌క్షం అయిపోతుంద‌ని, సైకిల్ స‌వారీ ఖాయ‌మ‌ని, బ్ర‌హ్మానంద రెడ్డికి భారీ మెజారిటీ అని పెద్ద ఎత్తున క‌థ‌నాలు కూడా ప్ర‌సారం అయిపోయాయి. 

అయితే, ఇంత‌లో ఉరుములు లేని మెరుపులా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం పిడుగులాంటి వార్త వినిపించింది.  టీడీపీ అభ్య‌ర్థిగా గెలుపు గుర్రం ఎక్కుతాడ‌ని భారీ అంచ‌నాలున్న బ్ర‌హ్మానంద రెడ్డికి చెమ‌ట‌లు ప‌ట్టించేలా ఉన్న ఆ వార్త‌.. ఇప్పుడు అంద‌రినీ నివ్వెర ప‌రుస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ఉప ఎన్నిక‌లో అభ్య‌ర్థుల ఖ‌ర్చుకు సంబంధించిన వివ‌రాల‌ను రెండు మూడు రోజుల‌కు ఒక‌సారి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఆయా అభ్య‌ర్థులు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెల‌బ్రిటీలు, ప్ర‌జ‌ల్లోమం చి ఫాలోయింగ్ ఉన్న వారు ప‌ర్య‌ట‌న జ‌రిపి,  ప్ర‌చారం చేస్తే.. వారికి అయ్యే ఖ‌ర్చు భారీగా ఉంటుంది. 

అయితే, ఎన్నిక‌ల్లో ప్ర‌చారం  కోసం ఎమ్మెల్యేల‌కు 28 ల‌క్ష‌ల వ‌ర‌కు అనుమ‌తి ఉంటుంది. కానీ, ఈ సెల‌బ్రిటీల‌వల్ల ఎక్కువ ఖ‌ర్చు అయితే, దీనిని ఆ ఖ‌ర్చు నుంచి మిన‌హాయించేందుకు అవ‌కాశం ఉంది. అయితే, దీనికి నిర్ణీత స‌మ‌యంలోగా ఎన్నిక‌ల సంఘానికి ముందుగా తెలియ‌జేయాలి. ఇప్పుడు ఇదే విష‌యంలో బ్ర‌హ్మానంద‌రెడ్డి ఇరుకున ప‌డ్డట్టు స‌మాచారం. నంద‌మూరి బాల‌కృష్ణ‌, సీఎం చంద్ర‌బాబు ప్ర‌చార ఖ‌ర్చు విష‌యంలో ముంద‌స్తుగా ఎన్నిక‌ల సంఘానికి స‌మాచారం అందించి ఉంటే ఆ ఖ‌ర్చును మిన‌హాయించేవారు. అయితే, బ్ర‌హ్మానంద‌రెడ్డి స‌మ‌యం మించిపోయాక ఆయా వివ‌రాల‌ను ఇచ్చిన‌ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గుర్తించింది. 

దీంతో   బ్రహ్మానందరెడ్డి ఉప ఎన్నికలో విజయం సాధించినా…ఆయన ఖర్చు పరిమితి కంటే ఎక్కువ అయితే దీన్ని ఛాలెంజ్ చేయవచ్చని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. అప్పుడు కోర్టు కూడా ఈ గెలుపును పక్క పెట్టాల్సిందిగా ఆదేశించినా ఆశ్చర్యం లేదంటున్నారు. నిబంధనల ప్రకారం గడువులోగా  స్టార్ క్యాంపెయినర్ల వివరాలు ఇవ్వనందున వారి ఖర్చును కూడా అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఖాతాలోకి వేయాలని ఆదేశించింది.  దీంతో  ఇప్పుడు టీడీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.