వైసీపీలో చేరే మాజీ మంత్రుల లెక్క పెరుగుతోందిగా….

ఏపీలో 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు ప‌లువురు నేత‌లు ఇప్ప‌టి నుంచే స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి ప‌నీపాటా లేకుండా ఖాళీగా ఉన్న కొంద‌రు మాజీ మంత్రులు, సీనియ‌ర్లు వ‌చ్చే ఎన్నిక‌ల వేళ వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. వైసీపీలోకి జంప్ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తోన్న వాళ్ల‌లో కేంద్ర మాజీ మంత్రులు అయిన కోట్ల సూర్య‌ప్ర‌కాష్‌రెడ్డి, కిల్లి కృపారాణితో పాటు ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి పేరు కూడా వినిపించింది.

ఇక మాజీ స్టేట్ మంత్రులు అయిన వ‌ట్టి వ‌సంత్‌కుమార్‌, మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరి పేర్ల‌కు తోడుగా మ‌రో మాజీ మంత్రి పేరు కూడా వైసీపీలోకి జంప్ చేసే లిస్టులో వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండ్రుమురళి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. యువకుడు, విద్యావంతుడు అయిన ముర‌ళి ఎచ్చెర్ల‌, రాజాం నియోజ‌క‌వ‌ర్గాల నుంచి 2004, 2009 ఎన్నిక‌ల్లో వైఎస్ ఆశీస్సుల‌తో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత ఎస్సీ కోటాలో ఆయ‌న మంత్రిగా కూడా ప‌నిచేశారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు సైలెంట్ అయిపోయిన ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో తిరిగి పొలిటిక‌ల్‌గా యాక్టివ్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప‌డిన దెబ్బ చూసిన ఆయ‌న ఇప్ప‌ట్లో ఏపీలో కాంగ్రెస్ కోలుకోలేద‌ని డిసైడ్ అయిపోయార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నార‌న్న టాక్ జిల్లాలో వినిపిస్తోంది.

పార్టీ మారేందుకు ముర‌ళి ఇప్ప‌టికే వైసీపీ అధిష్టానంతో చ‌ర్చ‌లు కూడా జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర సందర్భంగా శ్రీకాకుళం చేరుకున్నప్పుడు కొండ్రు మురళి పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద టీడీపీ బ‌లంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ముర‌ళి లాంటి యంగ్ లీడ‌ర్‌, మాజీ మంత్రి వైసీపీలో చేర‌డం ఆ పార్టీకి కొంత వ‌ర‌కు ప్ల‌స్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.