జనసేనలోకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బద్ద శత్రువు!

కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ స్టైలే వేరు. ఆయ‌న ముక్కుసూటిత‌నంతో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్న‌ప్పుడు ఏపీ, తెలంగాణ‌లో ఆయ‌న‌కు ఎదురు చెప్పేందుకే చాలామంది నాయ‌కులు భ‌య‌ప‌డేవారు. అలాంటిది హ‌ర్ష‌కుమార్ వైఎస్‌తో తీవ్రంగా విబేధించారు. 2009 ఎన్నిక‌ల్లో హ‌ర్ష‌కుమార్‌కు టిక్కెట్ రాకుండా ఉండేందుకు వైఎస్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నాలు చేసినా హ‌ర్ష‌కుమార్ సోనియాగాంధీ ద‌గ్గ‌రే చ‌క్రం తిప్పుకుని సీటు ద‌క్కించుకున్నారు.

ఆంధ్రా యూనివ‌ర్సిటీ రాజ‌కీయాల్లో యూత్ కాంగ్రెస్ నేత‌గా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న అతి చిన్న వయస్సులో 1985లో పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత రాజ‌మండ్రి కార్పొరేష‌న్‌కు జ‌రిగిన డైరెక్ట్ ఎల‌క్ష‌న్స్‌లో అప్ప‌టి టీడీపీ మేయ‌ర్ అభ్య‌ర్థి చ‌క్ర‌వ‌ర్తి చేతిలో వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్ని ప‌రాజ‌యాలు ఎదురైనా ఆయ‌న మాత్రం నిరాశ చెంద‌లేదు.

ఎట్ట‌కేల‌కు గురువు వి.హ‌నుమంత‌రావు అండ‌తో 2004లో అమ‌లాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన హ‌ర్ష‌కుమార్ త‌ర్వాత కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్ అయిపోయారు. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ గాలి కోన‌సీమ‌లో బ‌లంగా వీచినా దానిని కూడా ఎదుర్కొని ఆయ‌న గెలిచారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆయ‌న సొంత పార్టీ కాంగ్రెస్‌పైనే ఎదురు తిరిగారు. త‌ర్వాత కిర‌ణ్‌కుమార్‌రెడ్డి జై స‌మైక్యాంధ్ర పార్టీలో చేరిన ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయారు.

పొలిటిక‌ల్ రీ ఎంట్రీ..!

హ‌ర్ష‌కుమార్ కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఇస్తున్నార‌న్న వార్త‌లు వస్తున్నాయి. హ‌ర్ష‌కుమార్ బీజేపీకి బ‌ద్ధ వ్య‌తిరేకి. వైఎస్‌.జ‌గ‌న్ అంటే అస్స‌లు ప‌డ‌దు. జ‌గ‌న్ తండ్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డితోనే ఆయ‌న తీవ్రంగా విబేధించేవారు. ఇక టీడీపీపై ఆయ‌న ఎప్పుడూ సానుకూలంగా ఉండేవారు కాదు. ఇప్పుడు టీడీపీలో చేరినా ఆయ‌న‌కు అమ‌లాపురం టిక్కెట్ ఖ‌చ్చితంగా రాద‌నే చెప్పొచ్చు.

ఇక హర్ష‌కుమార్ పొలిటిక‌ల్ రీ ఎంట్రీ జ‌న‌సేన‌తో ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న జ‌న‌సేన‌లో చేరి ఆ పార్టీ త‌ర‌పున అమ‌లాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని వార్త‌లు వస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లు ఎలా ఉన్నా, హ‌ర్ష‌కుమార్ రూటు ఎలా ఉంటుందో ? చూడాలి.