టీడీపీలో రాబోయే త‌రానికి కాబోయే నేత‌లు హ‌ల్ చ‌ల్

వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు టీడీపీ కూడా అనుకూల‌మే. దీనికి సీఎం త‌న‌యుడు, మంత్రి లోకేశ్ పెద్ద ఉదాహ‌ర‌ణ‌. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు వార‌సుల‌ను పార్టీకి దూరంగా ఉంచిన నేత‌లు ఇప్ప‌డు త‌మ వార‌సుల‌ను ప‌ని గ‌ట్టుకుని ప్రోత్స‌హించి, పాలిటిక్స్‌లో దింపుతున్నారు. దీనికి నిన్న ముగిసిన విశాఖ టీడీపీ మ‌హానాడు వేదిక అయింది. ఈ మ‌హానాడులో టీడీపీ సీనియ‌ర్ నేత‌ల పుత్ర‌ర‌త్నాలు.. అంటే రాబోయే త‌రానికి కాబోయే నేత‌లు హ‌ల్ చ‌ల్ చేశారు. వీరికి లోకేశ్ మార్గ‌ద‌ర్శి, కార్య‌ద‌ర్శి.. క‌ళా ద‌ర్శి కావ‌డం విశేషం.

సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడిగా పొలిటికల్ అరంగేట్రం చేసిన లోకేశ్ మాదిరిగానే శ్రీకాకుళం నేత దివంగ‌త ఎర్ర‌న్నాయుడు కుమారుడు రామ్మోహ‌న్‌నాయుడు, అనంత‌పురం నుంచి దివంగ‌త ప‌రిటాల ర‌వి కుమారుడు శ్రీరామ్, జేసి దివాకరరెడ్డి కుమారుడు పవన్‌, ఉమా మాధవరెడ్డి కుమారుడు సందీప్‌, గాలి ముద్దుకృష్ణమ కుమారుడు భాను, కళా వెంకట్రావు కుమారుడు మల్లిక్‌, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి కుమారుడు ప్రసన్న, అయ్యన్న పాత్రుడి తనయుడు విజయ్, శిల్పా మోహనరెడ్డి కుమారుడు రవి, కేఈ కుమారుడు శ్యాంబాబు, గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ, దేవినేని ఉమా కుమారుడు నిహార్ తదితరులు మ‌హానాడులో సంద‌డి చేశారు.

నిజానికి వీరంద‌రూ 2019లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో రంగంలోకి దిగేందుకు ఇప్ప‌టికే స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. ఈ విష‌యాన్ని జేసీ ఇప్ప‌టికే బ‌య‌ట పెట్టాడు. తాను విర‌మించుకుని త‌న ప్లేస్‌ను త‌న కుమారుడికి ఇస్తున్న‌ట్టు చెప్పాడు. అదేవిధంగా ప‌రిటాల సునీత కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడి అరంగేట్రం కోసం నియోజ‌క‌వ‌ర్గాన్ని వెతుకుతున్నారు. కేఈ కుమారుడు శ్యాంబాబు ప‌రిస్థితీ అంతే. ఈ నేప‌థ్యంలో వీరంద‌రికీ నారా లోకేశ్ సార‌థ్యం వ‌హించ‌డం గ‌మ‌నార్హం. సో.. టీడీపీలో వార‌సుల హ‌వా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింద‌న్న మాట‌.