టీడీపీకి మ‌రోసారి షాక్ ఇచ్చిన మోదీ

మిత్ర‌ప‌క్షం మాట‌లు గాలిలో క‌లుస్తున్నాయి. మిత్ర ధ‌ర్మానికి బీట‌లు వారేలా ఉన్నాయంటూ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది. అటు ఢిల్లీలోని బీజేపీకి ఇటు ఏపీలోకి వైసీపీకి మ‌ధ్య బంధం బ‌లోపేతం అవుతోంది. క‌మ‌లం చెంత‌కు ఫ్యాన్ క్ర‌మ‌క్రమంగా ద‌గ్గ‌ర‌వుతోంది. ప్ర‌ధాని మోదీ, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ క‌ల‌యిత‌తో బీజం ప‌డిన స్నేహ బంధం.. రాష్ట్రప‌తి ఎన్నిక నేప‌థ్యంలో మ‌రింత చిగురించింది. రాష్ట్రప‌తి అభ్య‌ర్థుల నామినేష‌న్ ప్ర‌క్రియ‌కు వైసీపీకి కూడా ఆహ్మానం అంద‌డం.. ఏపీలో మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇదే అంశం ఇప్ప‌డు టీడీపీ నేత‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌టంతో.. కొత్త మిత్రుల వేట‌లో పార్టీలు ప‌డ్డాయి. ముందుగా అధికార పక్షమైన‌ టీడీపీతో దోస్తీ క‌లిగిన బీజేపీతో జ‌త‌క‌ట్టేందుకు వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, ప్ర‌ధాని మోడీతో భేటీ అవ్వ‌డం.. రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి భేష‌ర‌తుగా మ‌ద్దతు ఇవ్వ‌డం.. త‌ద‌నంత‌ర ప‌రిణామాలు టీడీపీకి మింగుడుప‌డ‌టం లేదు. మూడేళ్ల‌లో ఎన్న‌డూ బీజేపీగానీ, ప్ర‌ధానినిగానీ విమ‌ర్శించ‌ని టీడీపీ నేత‌లు.. నేరుగా ఆయ‌న్నే టార్గెట్ చేయ‌డం క‌ల‌కలం సృష్టించిన విష‌యం తెలిసిందే!

ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరు ప్ర‌తిపాదించిన అనంత‌రం.. వైసీపీ ఎంపీ విజ‌య్ సాయిరెడ్డి ఆయ‌న్ను క‌లిసి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం కూడా చ‌ర్చ‌నీయ‌మైంది. అంటే, కోవింద్ అభ్య‌ర్థిత్వం ఖరారు అవుతుంద‌ని ముందుగానే జ‌గ‌న్ తెలుసా అనే అభిప్రాయాలూ వినిపించాయి. అయితే ఇప్పుడు రామ‌నాథ్ కోవింద్‌ నాలుగో సెట్ నామినేష‌న్ ప‌త్రాల దాఖ‌లు కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల్సిందిగా భాజ‌పా నుంచి ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీకి ఆహ్వానం అందడం రాజ‌కీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబుతో రెండో సెట్ నామినేష‌న్ పై సంత‌కం తీసుకున్నారు. ఇప్పుడు నాలుగో సెట్ నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి వైకాపా ఎంపీల‌కు ఆహ్వానం అంద‌డం విశేషం!

నిజానికి, ఆంధ్రాలో భాజ‌పా, టీడీపీలు భాగ‌స్వామ్యంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. టెక్నిక‌ల్ గా ఆంధ్రాలో భాజ‌పాకి కూడా వైకాపా ప్ర‌తిప‌క్షం అవుతుంది. అలాంట‌ప్పుడు వైకాపాని ఎలా ఆహ్వానిస్తార‌నే చ‌ర్చ టీడీపీ వ‌ర్గాల్లో మొద‌లైన‌ట్టు స‌మాచారం. భాజ‌పా చ‌ర్య దేనికి సంకేతం అనే విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. వైసీపీకి బీజేపీ ప్రాధాన్య‌త ఎందుకు పెంచుతోంద‌నే గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీకి ఆహ్వానం ప‌లుకుతూ.. టీడీపీకి ఏవో సంకేతాలు ఇవ్వాల‌ని భాజ‌పా ప్ర‌య‌త్నిస్తోంద‌ని విశ్లేష‌కులు అంచ‌నావేస్తున్నారు. మ‌రి దీనిని బ‌ట్టి వైసీపీ-బీజేపీ దోస్తీ బ‌ల‌ప‌డింద‌నే భావించ‌వ‌చ్చు!!