నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మ‌తిరిగే షాక్

నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరారు. బుధ‌వారం ఆయ‌న త‌న కుమారులు, సోద‌రుల‌తో పాటు స‌చివాల‌యానికి వ‌చ్చి సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. క‌ర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి ఆయ‌న్ను చంద్ర‌బాబు వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. ఆ వెంట‌నే వాళ్లు చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే టీడీపీలో చేరారు.

నంద్యాల ఉప ఎన్నిక మ‌రో వారం రోజుల్లో జ‌రుగుతోంది. రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ టైంలో గంగుల పార్టీ మార‌డం నిజంగానే వైసీపీకి పెద్ద షాక్ లాంటిదే. గంగుల ఫ్యామిలీకి ఆళ్ల‌గ‌డ్డ‌లో మంచి ప‌ట్టు ఉంది. వాళ్లు న‌లుగురు సోద‌రులు. గంగుల ప్ర‌తాప‌రెడ్డి గ‌తంలో నంద్యాల ఎంపీగాను, ఆళ్ల‌గడ్డ ఎమ్మెల్యేగాను ప‌నిచేశారు. వాళ్ల‌కు భూమా ఫ్యామిలీకి అస్స‌లు ప‌డేది కాదు.

పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాక ఆయన ఎన్నిక కోసం తన ఎంపీ పదవిని త్యాగం చేయడం ద్వారా అప్పట్లో వార్తల్లోకి వచ్చారు. ఇక గంగుల ప్రతాపరెడ్డి సోదరుడు గంగుల ప్రభాక రరెడ్డి ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఆయనకు ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. 

జ‌గ‌న్‌పై అసంతృప్తే కార‌ణ‌మా..!

ఇక ప్ర‌తాప్‌రెడ్డి పార్టీ మార‌డం వెన‌క వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఉన్న తీవ్ర అసంతృప్తే కార‌ణంగా క‌నిపిస్తోంది. శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలో చేరకముందు గంగుల ప్రతాపరెడ్డినే నంద్యాల అభ్యర్థిగా నిలపాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ భావించారు. శిల్పా వైసీపీలో చేరాక ప్ర‌తాప్‌రెడ్డిని ప‌ట్టించుకోలేదు. దీంతో షాక్ అయిన ఆయ‌న టీడీపీ నేత‌ల స‌ల‌హా మేర‌కు ఆ పార్టీలోకి జంప్ చేసేశారు. 

ఆ సీటుపై హామీ వ‌చ్చిందా..!

టీడీపీలో చేరిన ప్ర‌తాప్‌రెడ్డి తాను  బేషరతుగా టీడీపీలో చేరాలనుకుంటున్నానని, తనకు పదవులేమీ అవసరం లేదని అన్నార‌ట‌. ఇక ప్రతాపరెడ్డి వంటివారు తమతో కలిసి ప్రయాణించాలనుకోవడం మంచి పరిణామమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఇంట‌ర్న‌ల్ టాక్ ప్ర‌కారం గంగుల ప్ర‌తాప్‌రెడ్డికి చంద్ర‌బాబు 2019 ఎన్నికల్లో నంద్యాల ఎంపీ సీటుపై హామీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఎస్పీవైరెడ్డి త‌న కుమార్తెకు ఆ సీటు ఇప్పించుకోవాల‌ని చేస్తోన్న ప్ర‌య‌త్నాలు గంగుల టీడీపీ ఎంట్రీతో ఫలించ‌వ‌నే అనుకోవాలి.