ఏపీ మంత్రి గంటాకు నాన్ బెయిలబుల్ వారెంట్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. గంటా 2009 ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారనే కేసులో అనకాపల్లి రెండో అదనపు సివిల్‌ కోర్డు జడ్జి మంత్రికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేశారు. 2004 ఎన్నిక‌ల్లో చోడ‌వ‌రం నుంచి టీడీపీ త‌ర‌పున గెలిచిన ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీలోకి జంప్ చేసి అన‌కాప‌ల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

ఆ ఎన్నిక‌ల్లో గంటా కోడ్ ఉల్లంఘించిన నేప‌థ్యంలో ఆయ‌న‌పై అన‌కాప‌ల్లి పీఎస్‌లో కేసు న‌మోదు అయ్యింది. ఈ కేసులో ఎనిమిదేళ్ల త‌ర్వాత ఇప్పుడు మంత్రిగా ఉన్న గంటాకు నాన్‌బెయిల‌బుల్ వారెంట్ జారీ అయ్యింది. ఇక ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 11కు వాయిదా వేశారు.

మంత్రిగా ఉన్న గంటాపై ఈ వారెంట్ జారీ అవ్వ‌డం ఇప్పుడు ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రి దీనిపై మంత్రి గంటా ఎలా స్పందిస్తారో ? చూడాలి. ఇక గంటా ఇప్ప‌టికే విశాఖ భూకుంభ‌కోణం కేసులో కూడా ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌ల్లోనే విల‌విల్లాడుతోన్న ఆయ‌న ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా చిక్కుకున్నారు.