జీఎస్టీ దెబ్బ‌కు తెలంగాణ విల‌విల‌

జీఎస్టీ దెబ్బకు సామాన్యుడే కాదు.. సర్కారు కూడా హడలిపోతోంది. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ కారణంగా రాష్ట్ర బడ్జెట్ ఫిగర్స్ కూడా మారిపోతున్నాయన్న ఆందోళనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్ర‌శంసించారు. ఇప్పుడు లోక్‌స‌భ‌లో ఆ పార్టీ ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత జితేందర్ రెడ్డి… రాష్ట్రంపై జీఎస్టీ ఎఫెక్ట్‌ను వివ‌రించారు. దీనివ‌ల్ల తెలంగాణ న‌ష్ట‌పోతోంద‌ని వాపోయారు. ప్రభుత్వ పథకాలను జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలన్నారు. జీఎస్టీ మీద ఇచ్చిన వాయిదా తీర్మానానికి నో చెప్పిన లోక్ సభ స్పీకర్.. ఈ అంశాన్ని జీరో అవర్ లో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు.

ప్ర‌ధాని మోదీ ఏది ప్ర‌వేశ‌పెట్టినా, ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. అది దేశ ప్ర‌జ‌ల సంక్షేమాన్ని, దేశ ఆర్థిక ప్ర‌గ‌తిని మార్చే స్తుంద‌నేంత‌గా విప‌రీత‌మైన ప్ర‌చారం చేసేస్తున్నారు. మొద‌ట్లో ఇబ్బందిప‌డినా.. అంతిమంగా అభివృద్ధి ఫ‌లాలు అందుకునేది మాత్రం సామాన్యులేన‌ని ఊద‌రగొట్టేస్తున్నారు. మొన్న‌టి నోట్ల ర‌ద్దు నుంచి నిన్న అమ‌లులోకి తెచ్చిన జీఎస్టీ వ‌ర‌కూ ఇదే ప్ర‌చారం! దేశ ఆర్థిక ప్ర‌గ‌తిని మార్చేస్తుంద‌ని.. ప‌న్నుల బాదుడును స‌రికొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన జీఎస్టీ వ‌ల్ల సామాన్యుడి నెత్తిన భార‌మే ప‌డ‌నుంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. రోజులు గ‌డుస్తున్న కొద్దీ.. జీఎస్టీ ఎఫెక్ట్ తెలుస్తోంది. దీనివ‌ల్ల రాష్ట్రాల ఆర్థిక స్థితి అత‌లాకుత‌లం అవుతోంద‌ని నాయ‌కులు వాపోతున్నారు.

ఇక రాష్ట్రాల సంగ‌తే ఇలా ఉంటే సామాన్యుడి జేబు చిల్లులు ప‌డ‌టం ఖాయ‌మ‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైనా పన్నుబాదుడుకి తెర తీస్తే.. దాని మీద ధర్నాలు.. నిరసనలు.. ఆందోళనల బాట పట్ట‌డ‌మే చూశాం! కానీ ప‌న్నువేస్తామంటే సంబ‌రాలు చేసుకుంటున్నారు! కేకులు క‌ట్ చేస్తున్నారు. స్పెష‌ల్ పార్టీలు చేసుకుంటున్నారు!! అర్ధ‌రాత్రి దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన‌ట్లు.. అర్ధ‌రాత్రి ప‌న్నుల బాదుడుకు శ్రీ‌కారం చుట్టింది మోదీ స‌ర్కారు! ఇప్పటికే ఉన్న పన్నులతో పోలిస్తే.. జీఎస్టీ భారం తక్కువన్న ట్లుగా మోడీ సర్కారు చేసిన ప్రచారానికి ప్రజలు ఫిదా అయిపోయారు. ఇప్పుడిప్పుడే దాని మోత ఎంత ఎక్కువన్న విషయం తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జీఎస్టీ ఎఫెక్ట్ గురించి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సుమారు రూ.2.30 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నడుస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ.. భగీరథ.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇలా అభివృద్ధి ప్రాజెక్టులు భారీగా నడుస్తున్నాయని.. ఆయా పనులకు ఇప్పటివరకూ 5 శాతం వ్యాట్ తో టెండర్లు పిలవగా.. జీఎస్టీ పుణ్యమా అని ఇప్పుడు పన్నుశాతం 18 శాతానికి చేరిందన్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా నడుస్తున్న ప్రాజెక్టులకు తాజా జీఎస్టీ ఎఫెక్ట్ తో రాష్ట్రంపై అదనంగా రూ.19,200 కోట్ల భారం పడనున్నట్లుగా చెప్పారు. ఈ కారణంతో జీఎస్టీని రాష్ట్ర పథకాలకు మినహాయింపులు ఇవ్వాలని కోరారు. మ‌రి ఇక సామాన్యుల ప‌రిస్థితి ఏంటి!!