గుంటూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే సీటు య‌మ హాటు గురూ..!

ఏపీలో కీల‌క‌మైన గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే సీటు ఇప్పుడు య‌మ హాటుగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఆ ఎమ్మెల్యే సీటు నుంచి పోటీ చేసేందుకు అధికార టీడీపీలో పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతోంది. ఆ సీటు నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలో ఉండేందుకు టీడీపీలోనే ఏకంగా ఐదుగురు పోటీ ప‌డుతున్నారు. ఈ హాట్ న్యూస్ జిల్లా పాలిటిక్స్‌లో హాట్ హాట్‌గా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

జిల్లా కేంద్ర‌మైన గుంటూరు వెస్ట్ సీటు నుంచి పోటీ చేసేందుకు అధికార టీడీపీలో ట‌ఫ్ ఫైట్ న‌డుస్తోంది. ఇక్క‌డ ప్ర‌స్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు. మోదుగుల ఇటీవ‌ల చేసిన ప్ర‌క‌ట‌న గుంటూరు వెస్ట్ టీడీపీ రాజ‌కీయాల్లో క‌ల్లోలం రేపుతోంది. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌న‌ని, న‌ర‌సారావుపేట ఎంపీగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మోదుగుల గ‌తంలో న‌రసారావుపేట ఎంపీగా గెలిచిన సంగ‌తి తెలిసిందే. న‌గ‌ర‌ రాజ‌కీయాల్లో ఇమ‌డ లేక‌పోతోన్న ఆయ‌న తిరిగి ఎంపీగా వెళ్లిపోయేందుకే సుముఖంగా ఉన్నారు.

మోదుగుల ఆ ప్ర‌క‌ట‌న చేయ‌డం వెన‌క ఇక్క‌డ ఆయ‌న రాజ‌కీయంగా ప‌ట్టు సాధించ‌లేక‌పోవ‌డం ఓ కార‌ణ‌మైతే గుంటూరు వెస్ట్‌లో వ‌రుస‌గా రెండోసారి పోటీ చేసిన వారు ఎవ్వ‌రూ ఎమ్మెల్యేగా గెల‌వ‌క‌పోవ‌డం కూడా ఓ కార‌ణం. ఇక మోదుగుల ఇక్క‌డ నుంచి త‌ప్పుకుంటే టీడీపీలో ఏకంగా పంచ‌పాండవుల్లా ఐదుగురు పోటీప‌డుతున్నారు.

జిల్లాలో సీనియ‌ర్ అయిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇప్ప‌టికే అక్క‌డ ఐదుసార్లు గెల‌వ‌డంతో న‌రేంద్ర కూడా గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పొన్నూరులో ఇప్పుడిప్పుడే వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న ఆయ‌న ఇప్పుడు న‌గ‌ర రాజ‌కీయాల‌వైపు ఆస‌క్తితో ఉన్న‌ట్టు స‌మాచారం.

ఇక న‌ర‌సారావుపేట‌లో ఐదుసార్లు గెలిచి గ‌త ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లికి మారి అక్క‌డ ఆరోసారి గెలిచిన స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు ఇప్ప‌టికే చంద్ర‌బాబు వ‌ద్ద గుంటూరు వెస్ట్ సీటును వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఇవ్వాల‌ని కోరార‌ని టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక‌వేళ కోడెల న‌ర‌సారావుపేట లేదా స‌త్తెన‌ప‌ల్లి నుంచే పోటీచేస్తే కోడెల కుమారుడు కోడెల శివ‌రాం సైతం వెస్ట్ నుంచి పోటీ చేయాల‌ని ఆస‌క్తితో ఉన్నారు.

ఇక చంద్ర‌బాబు, లోకేశ్‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడైన గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని కుమారుడు య‌ర‌ప‌తినేని మ‌హేష్ కూడా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గ‌క‌పోతే వెస్ట్ సీటు కావాల‌ని ఇప్ప‌టికే బాబు / లోకేశ్‌ను కోరిన‌ట్టు స‌మాచారం. ఇక తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని చెపుతోన్న ఎంపీ రాయ‌పాటి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న త‌న‌యుడు రాయ‌పాటి రంగారావు కోసం వెస్ట్ సీటు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు వ‌ద్ద ఇప్ప‌టికే లాబీయింగ్ మొద‌లెట్టేశార‌ట‌.

మ‌రి ఈ పంచ‌పాండ‌వుల పోటీతో వెస్ట్ రాజ‌కీయాలు అప్పుడే హీటెక్కేశాయి. మ‌రి గుంటూరు వెస్ట్ టీడీపీ రాజ‌కీయం ఎటు మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.