గుంటూరు వైసీపీ అభ్య‌ర్థుల్లో ఇన్ – అవుట్ లిస్టు

2019 ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం వైసీపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌క‌పోతే పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ క‌ష్ట‌మ‌ని డిసైడ్ అయిన జ‌గ‌న్ ఆ ఎన్నిక‌ల్లో గెలుపుకోసం ఇప్ప‌టి నుంచే ర‌క‌ర‌కాల ప్ర‌ణాళిక‌ల‌తో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 17 ఎమ్మెల్యే స్థానాల‌కు గాను ఐదుగురు వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. మిగిలిన 12 స్థానాల్లో టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత చాలా మంది సిట్టింగ్ ఇన్‌చార్జుల‌కు షాకులు ఇచ్చి వారి ప్లేస్‌లో కొత్త‌వారికి టిక్కెట్లు ఇస్తార‌న్న వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే కొంత‌మంది ఇన్‌చార్జ్‌ల‌ను త‌ప్పించి వారి ప్లేస్‌ను కొత్త‌వారితో రీ ప్లేస్ చేశారు. గుర‌జాల‌లో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన జంగా కృష్ణ‌మూర్తి స్థానంలో కాసు మ‌హేష్‌రెడ్డిని నియ‌మించారు. పెద‌కూర‌పాడుకు ఇన్‌చార్జ్‌గా ఉన్న బొల్లా బ్ర‌హ్మ‌నాయుడును వినుకొండ‌కు పంపి అక్క‌డ కావ‌టి మ‌నోహ‌ర్‌నాయుడుకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. వినుకొండ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన న‌న్న‌ప‌నేని సుధ‌ను త‌ప్పించి అక్క‌డ బొల్లా బ్ర‌హ్మ‌నాయుడును రంగంలో ఉంచారు.

మిగిలిన స్థానాల్లో ఐదుగురు సిట్టింగ్‌లు అయిన కోన ర‌ఘుప‌తి (బాప‌ట్ల‌), గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి (న‌ర‌సారావుపేట‌), ముస్త‌ఫా (గుంటూరు తూర్పు), రామ‌కృష్ణారెడ్డి (మాచ‌ర్ల‌), ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి (మంగ‌ళ‌గిరి)ల‌కు టిక్కెట్లు మ‌రోసారి ఖాయంగా క‌నిపిస్తున్నాయి. మిగిలిన స్థానాల్లో గుంటూరు వెస్ట్ నుంచి లేళ్ల అప్పిరెడ్డికి, తాడికొండ నుంచి క్రిస్టినా, తెనాలి నుంచి అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌ల‌కు మ‌రోసారి సీటు రాదంటున్నారు.

వేమూరు ఇన్‌చార్జ్ మేరుగ నాగార్జున‌ను కూడా త‌ప్పిస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. మిగిలిన వాళ్ల‌లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి అంబ‌టి రాంబాబు, పొన్నూరు నుంచి రావి వెంక‌ట‌ర‌మ‌ణ‌, రేప‌ల్లె నుంచి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, చిల‌క‌లూరిపేట నుంచి మ‌ర్రి రాజశేఖ‌ర్‌ల‌కు మ‌రోసారి టిక్కెట్టు గ్యారెంటీ కానున్నాయి. ఏదేమైనా జ‌గ‌న్ గుంటూరు జిల్లాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాలా మంది సిట్టింగ్ ఇన్‌చార్జ్‌ల‌కు షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది.