ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా హ‌రిబాబు అవుట్‌… కొత్త అధ్య‌క్షుడు ఫిక్స్‌..!

ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ బీజేపీలో చీమ చిటుక్కుమ‌న్నా వెంక‌య్య‌నాయుడుకు తెలియ‌కుండా జ‌ర‌గ‌దు. గ‌త మూడు ద‌శాబ్దాలుగా బీజేపీలో వెంక‌య్య హ‌వా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. నెల్లూరు నుంచి ప్రారంభ‌మైన ఆయ‌న ప్ర‌స్థానం చివ‌ర‌కు బీజేపీకి జాతీయ అధ్య‌క్షుడిగా ఉండే వ‌ర‌కు వెళ్లింది. ఆ త‌ర్వాత కేంద్ర‌మంత్రిగాను, ప్ర‌స్తుతం ఉప రాష్ట్ర‌ప‌తి అయ్యేవ‌ర‌కు అప్ర‌తిహ‌తంగా ఆయ‌న దూసుకెళ్లారు.

ఈ క్ర‌మంలోనే ఏపీ బీజేపీని ఆయ‌న ఒంటి చేత్తో పెద్ద క‌ష్ట‌ప‌డ‌కుండానే శాసిస్తూ వ‌చ్చారు. ఇక మోడీ ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక మాత్రం ఏపీ బీజేపీ నుంచి వెంక‌య్య‌ను త‌ప్పించాల‌న్న థ్రెడ్ మాత్రం గ‌ట్టిగానే వ‌చ్చింది. వెంక‌య్య‌కు చంద్ర‌బాబుతో ఉన్న సాన్నిహిత్యం వ‌ల్ల ఏపీలో బీజేపీ అస్స‌లు ఎద‌గ‌డం లేద‌ని వెంక‌య్య యాంటీ వ‌ర్గం అమిత్ షా అండ్ కోకు భారీగానే నూరిపోసింది.

ఈ క్ర‌మంలోనే త‌న వ్య‌తిరేకుల‌ను, సీనియ‌ర్ల‌ను వ్యూహాత్మ‌కంగా త‌ప్పిస్తూ వ‌స్తోన్న మోడీ వెంక‌య్య‌పై కూడా ఓ క‌న్నేశారు. వాస్త‌వానికి గ‌త యేడాది రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ముగిసిన‌ప్పుడే ఆయ‌న్ను ఏదో ఒక రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్‌గా పంపుతార‌న్న టాక్ వ‌చ్చింది. అయితే వెంక‌య్య ప‌ట్టుబ‌ట్ట‌డంతో మోడీ చేసేదేమి లేక ఆయ‌న్ను రాజ‌స్థాన్ నుంచి రాజ్య‌స‌భ‌కు పంపారు.

ఇక ఇప్పుడు వెంక‌య్య‌ను కాస్త బ‌ల‌వంతంగానే ఉప రాష్ట్ర‌ప‌తి పోస్టుకు పంపుతున్న‌ట్టు తేలిపోయింది. త‌న‌కు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలంటేనే ఇష్ట‌మ‌ని చెపుతున్నా మోడీ ఆయ‌న్ను ప్రెజ‌ర్ చేసి ఈ పోస్టుకు పంపేస్తున్నారు. దీంతో ఏపీ బీజేపీలో భారీ ప్ర‌క్షాళ‌న‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇక ఇక్క‌డ వెంక‌య్య అండ్ గ్యాంగ్ పప్పులు ఉడికేలా లేవు.

ప్ర‌స్తుతం ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న విశాఖ ఎంపీ కంభంపాటి హ‌రిబాబును మార్చేసి న‌ర‌సాపురం ఎంపీ గోక‌రాజు గంగ‌రాజుకు ఈ బాధ్య‌త‌లు క‌ట్ట‌బెడ‌తార‌ని తెలుస్తోంది. గంగ‌రాజు ఆర్ఎస్ఎస్‌, వీహెచ్‌పీల‌కు అత్యంత స‌న్నిహితుడు. ఇక అమిత్ షాతో కూడా ఆయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక ఏపీ బీజేపీలో వెంక‌య్య‌తో పాటు ఆయ‌న గ్యాంగ్ శ‌కం దాదాపు ముగిసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. అలాగే ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చే ఏపీ బీజేపీ టీం టీడీపీతో క‌య్యానికి కాలు దువ్వేందుకే రెడీ అవుతోన్న‌ట్టు ఇంట‌ర్న‌ల్ టాక్‌.