జ‌గ‌న్ హామీలు స‌రే.. లెక్క‌లు చూస్తే టెన్ష‌నే!! 

ప్లీన‌రీ వేదిక‌గా వైసీపీ అధినేత జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌భేరి మోగించారు. అన్ని వ‌ర్గాల‌కు చేరువయ్యేలామొత్తం తొమ్మిది ప‌థ‌కాలు ప్ర‌క‌టించేశారు. దీనిపై హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే వీటి అమ‌లు ఎంత వ‌ర‌కూ సాధ్య‌మ‌నే దానిపైనే ఇప్పుడుచ‌ర్చ మొద‌లైంది. అల‌వికాని హామీలిచ్చి.. వాటిని నెర‌వేర్చేందుకు సీఎం చంద్ర‌బాబు ఎన్ని క‌ప్ప‌గంతులు వేస్తున్నారో తెలిసిందే! ఇప్పుడు జ‌గ‌న్ ఇచ్చిన హామీల అమ‌లు సాధ్య‌మ‌య్యేనా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌థ‌కాలకు ఎంత ఖర్చు అవుతుంది. అంతంత‌మాత్రంగా ఉన్న‌ రాష్ట్ర ఆదాయ ప‌రిస్థితి. వెక్కిరిస్తున్న ఆర్థిక‌లోటు.. ఈనేప‌థ్యంలో ప‌థ‌కాల వారీగా వాటి అమ‌లుపై ఒక లుక్కేద్దాం!!

వైఎస్సార్ భ‌రోసాలో భాగంగా 5 ఎకరాల లోపు భూములున్న రైతులందరికీ ఒక్కొక్క‌రికీ 50వేలు ఇస్తామని చెప్పారు. దీనివ‌ల్ల రూ.66 లక్షల మందికి ప్రయోజనమ‌ని అంచనా వేస్తున్నారు. అంటే దీని ప్ర‌కారం ఆయ‌న ద‌గ్గ‌ర రూ.33వేల కోట్లు ఉండాలి. ఇక వృద్ధుల పింఛ‌న్లు రెట్టింపు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు జ‌గ‌న్‌. దీని వ‌ల్ల 60 ల‌క్ష‌ల మంది ల‌బ్ధి పొందుతార‌ని అంచ‌నా. వీరికి రెండు వేలు చేయాలి అంటే . అద‌నంగా 5400 కోట్లు అదనంగా ఖర్చు అవుతాయి. కొత్తగా మరో 15 లక్షల మందికి ఇస్తే అదొక 3600 కోట్లు. మొత్తం 8 వేల కోట్లు. ఇక `అమ్మ ఒడి` పేరుతో 5వ తరగతి లోపు పిల్లలకి నెలకి 500 చొప్పున, 10 లోపు వారికి 750 చొప్పున, ఇంటర్ వారికి వెయ్యి చొప్పున కుటుంబానికి ఇద్దరికి మించకుండా ప్రతినెలా ఇస్తామంటున్నారు. దీని అమ‌లుకు ఏడాదికి 2400 కోట్లు ఖర్చు అవుతాయి.

ఇక ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కి అదనంగా ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.20 వేల సహాయం. దీనికి అయ్యే ఖర్చు..3 వేల కోట్లు! ఇక పేదలకి 25లక్షల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇస్తున్నారు. ఒక్కో ఇంటికి లక్షన్నర ఖర్చు పెడతామంటున్నారు. దీనికి ఐదేళ్ల‌లో 37,500 కోట్లు అవసరం. ఆరోగ్య శ్రీని మెరుగుపరచడం తో బాటు, సర్జరీ అయిన వ్యక్తి కోలుకునే వరకు కుటుంబానికి ఆర్ధిక సాయం. దీనికి కనీసం 2వేల కోట్లు కావాలి. ఇక డ్వాక్రా రుణాల‌కు వ‌డ్డీ రాయితీ, జ‌ల‌యజ్ఞం, ద‌శ‌ల వారీగా మ‌ద్య నిషేధం.. వ‌ల్ల సుమారు ఏడాదికి రూ.8వేల కోట్లు న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. ఇలా జగన్ సీఎం అయ్యాక తొలి ఏడాది 54 వేల కోట్ల అదనపు ఆదాయం కావాలి. జలయజ్ఞానికి అదనం. ఆపై ప్రతి ఏడాది 35 వేల కోట్లు అదనం.

ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ 1.57 ల‌క్ష‌ల కోట్లు! ఏటా 20% బడ్జెట్ పెరుగుతోంది. అంటే 2019- 20 నాటికి రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల 20 వేల కోట్లు కావచ్చు. ఈ పరిస్థితుల్లో తోలి ఏడాది 54 వేల కోట్లు, ఆపై ప్రతి ఏడాది 35వేల కోట్లు ఈ పథకాల కోసం కేటాయించడం దాదాపు అసాధ్యం. వీటితో పాటు రాజ‌ధాని నిర్మాణం కూడా ఒక య‌జ్ఞ‌మే! రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మాత్రం నానాటికీ దిగ‌జారుతోంది. ఆదుకుంటుంద‌నుకున్న కేంద్రంకూడా చేతులెత్తేసింది. మ‌రి ఈ ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ ఎలా ఈ ప‌థ‌కాలు అమ‌లు చేస్తార‌నేది కొంత ఆలోచించాల్సిన విష‌య‌మే!!