అన్నాడీఎంకే పార్టీ ప‌గ్గాలు ఇక‌.. అజిత్‌వేనా?!

త‌మిళ‌నాడులో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించి, రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుని అనారోగ్యంతో మృతి చెందిన సీఎం జ‌య‌ల‌లిత ఉర‌ఫ్ పురిచ్చిత‌లైవి..పార్టీ అన్నాడీఎంకే ప్ర‌స్తుతం నాయ‌క‌త్వ లేమితో స‌త‌మ‌త‌మ‌వుతోంది. జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ అనూహ్య ప‌రిస్థితుల్లో జైలు పాలు కావ‌డం, న‌మ్మిన‌బంటు ప‌న్నీర్ సెల్వం పూర్తిగా పార్టీ నుంచి విడిపోయి.. అన్నాడీఎంకే(అమ్మ‌) పేరుతో సొంత కుంప‌టి పెట్టుకోవ‌డంతో ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీలో నాయ‌క‌త్వ సంక్షోభం తార‌స్థాయికి చేరుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో అనూహ్యంగా హీరో అజిత్ పేరు మ‌రోసారి తెర‌మీద‌కి వ‌చ్చింది. అదేస‌మ‌యంలో అజిత్ అభిమానులు సైతం త‌మ హీరో పాలిటిక్స్‌లోకి రావాల‌ని కోరుతున్నారు. ఈ క్ర‌మంలోనే అజిత్‌ రాజకీయ ప్రవేశానికి అనుకూలంగా చెన్నైలో పోస్టర్లు వెలిశాయి. పుట్టినరోజు(మే 1) నాడు తన నిర్ణయం వెలువరించాలని కోరుతూ అభిమానులు పోస్టర్లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తన రాజకీయ ప్రవేశంపై అజిత్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

జయలలిత మానసపుత్రుడిగా, రాజకీయ వారసుడిగా అజిత్‌ పై మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఆయనను తన వారసుడిగా ప్రకటిస్తూ జయలలిత విలునామా కూడా రాశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. జయలలిత తనను కొడుకులా చూసుకునేవారని గతంలో చెప్పిన అజిత్‌… ‘అమ్మ’ మృతి తర్వాత రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరినా స్పందించలేదు.

రాజకీయాల జోలికిపోకుండా సినిమాలకే పరిమితమయ్యారు. తాజాగా అన్నాడీఎంకే పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అజిత్‌ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. జయలలితకు నిజమైన వారసుడు అజిత్‌ అంటూ అభిమానులు పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి!!