హిందూపురంపై బాబు ఆసక్తి అందుకేనా..

గ‌త వారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌హాట్‌గా నిలిచిన హిందూపురం రాజ‌కీయాలు ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డిపోయాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వద్ద‌కు పంచాయితీ చేర‌డంతో అంతా స‌ద్దుమ‌ణిగింది. హిందూపురం ఎమ్మెల్యే, త‌న బావ‌మ‌రిది బాల‌కృష్ణ పీఏ శేఖ‌ర్‌పై వేటు వేయ‌డంతో ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితి సాధార‌ణ స్థితికి చేరింది. అయితే ఇది శేఖ‌ర్‌పై వేటు వేయ‌డంతో మొద‌లైన ఈ ప్ర‌యాణంలో ఇంకా చాలామంది బాల‌య్య స‌న్నిహితులు బ‌య‌టికొచ్చే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం! ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు.. బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించిన‌ట్లు స‌మాచారం.

ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ సొంత నియోజ‌కవ‌ర్గంలో పార్టీ నేత‌లే బాల‌య్య‌ పీఏకి వ్యతిరేకంగా ఉద్య‌మించారు. ఎట్ట‌కేల‌కు పీఏ శేఖ‌ర్‌ను తొల‌గించడంతో హీట్ చ‌ల్లారిపోయింది… అనుకుంటే పొర‌పాటే అవుతుంద‌ట‌! బాల‌య్య నియోజ‌కవ‌ర్గంపై చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్టారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అనంత‌పురంలో బాల‌య్య పేరుతో చాలామంది దందాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు దృష్టికి వ‌చ్చింద‌ట‌! బెంగ‌ళూరు కేంద్రంగా బాల‌య్య సొంత మ‌నుషులే చాలా వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ విష‌యంలో వెంట‌నే చర్య‌లు తీసుకుంటే.. పార్టీలో విభేదాలు రావొచ్చ‌ని బాబు భావిస్తున్నార‌ట‌.

బాల‌య్య స‌న్నిహితులు, బంధువుల‌పై బాబు నియంత్ర‌ణ అనేది సున్నిత‌మైన అంశం క‌నుక పార్టీకి ఇది ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశ‌ముంది. క‌ర్ర విర‌గ‌కుండా పామును చంపాల‌ని బాబు ప్లాన్ వేశార‌ట‌. అందుకే, ముందుగా పీఏ వ్య‌వ‌హారాన్ని ఆయ‌నే రాజేసి ఉంటార‌ని కొంత‌మంది భావిస్తున్నారు. పార్టీ నేత‌ల నుంచే పెద్ద ఎత్తున నిర‌స‌న రావ‌డంతో శేఖ‌ర్‌ను తొల‌గించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. బాల‌య్య కూడా కాద‌న‌లేని ప‌రిస్థితి కూడా ఏర్పడింది! దీంతో బాల‌య్య స‌న్నిహితుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించేందుకు ఓ ర‌కంగా మార్గం సుగ‌మ‌మైంద‌ట‌.

అయితే, ఈ తాజా వ‌ల్ల సొంత వారైనా స‌రే, త‌ప్పు చేసిన‌ట్టు త‌న దృష్టికి వ‌స్తే చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో చంద్ర‌బాబు ఏమాత్రం వెన‌కాడ‌రూ అని సంకేతాలు ఇచ్చేశారు! ఇప్ప‌టికే, కొంత‌మంది ప్ర‌ముఖ నేత‌ల తీరుపై అసంతృప్తి ఉన్నా వారిని కాద‌న‌లేకా, అవున‌న‌లేక చంద్ర‌బాబు మీన మేషాలు లెక్కిస్తున్న ప‌రిస్థితి పార్టీ ఉంది. దీంతో అనంత‌పురం వ్య‌వ‌హారాన్ని ఈ విధంగా మ‌లుచుకుని పేరు తెచ్చుకునేందుకు బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు.