ఇద్ద‌రు చంద్రుల ఏక‌ప‌క్ష‌ ధోర‌ణులు.. అల్లాడుతున్న నేత‌లు, అధికారులు

ఏపీ, తెలంగాణ సీఎంల ఏక‌ప‌క్ష ధోర‌ణుల‌తో ఇరు రాష్ట్రాల్లోనూ అధికారులు, నేత‌లు అల్లాడి ఆకులు మేస్తున్నార‌ట‌! థ‌ర్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండస్ట్రీ.. టెన్ ఇయర్స్ సీఎం ఎక్స్‌పీరియ‌న్స్ అని చెప్పుకొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ ఉద్య‌మ సార‌ధిగా రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన సీఎం కేసీఆర్ వ్య‌వ‌హార శైలిల‌తో ఇరు రాష్ట్రాల్లోనూ చాపకింద నీరులా అసంతృప్తి ర‌గులుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటో చూద్దాం..

తెలంగాణ‌లో కేసీఆర్ హ‌వాతో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి అధికార పార్టీ తీర్థం పుచుకున్నారు అనేక మంది నేత‌లు. అలా కారెక్కే స‌మ‌యంలో వారికి కేసీఆర్ నేరుగా అనేక హామీలు, వాగ్దానాలు ఇచ్చారు. దీంతో త‌మ అనుచ‌రుల‌తో నేత‌లు క్యూక‌ట్టి మ‌రీ టీఆర్ ఎస్ గూటికి చేరారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. పార్టీలో చేరిన త‌ర్వాత సీఎం కేసీఆర్ ద‌ర్శ‌న‌మే త‌మ‌కు ద‌క్క‌డం లేద‌ని నేత‌లు వాపోతున్నారు. తాము ఎన్నో తిప్ప‌లు ప‌డి.. పార్టీలోకి వ‌స్తే.. ఇప్ప‌డు క‌నీసం మా మొర కూడా విన‌రా అని అక్క‌డి నేత‌లు వాపోతున్నారు.

ఒక వేళ కేసీఆర్ ద‌ర్శ‌నం దొరికినా.. ఆయ‌న చెప్పేది విన‌డ‌మే త‌ప్ప ఆయ‌న ఎవ‌రిమాటా వినిపించుకోవ‌డం లేద‌ని కూడా నేత‌లు ల‌బోదిబో మంటున్నారు. 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయ‌ని.. ఇప్ప‌టికైనా త‌మ మొర‌విని త‌మకు స‌మ‌స్య‌లు చెప్పుకొనే అవ‌కాశం ఇవ్వాల‌ని తెలంగాణ నేత‌లు కేసీఆర్‌ను కోరుతున్నారు. ఆయ‌నే కాకుండా క‌నీసం ఆయ‌న కొడుకు, మంత్రి కేటీఆర్ కూడా త‌మను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు. మ‌రి ఎప్ప‌టికి వీరి స‌మ‌స్య తీరుతుందో చూడాలి.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. సీనియ‌ర్ సీఎం అయిన చంద్ర‌బాబు.. నేత‌లతో బాగానే ఉంటున్నా.. ఐఏఎస్‌ల‌ను మాత్రం ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదైనా స‌ద‌స్సు జ‌రిగినా, మీటింగ్ పెట్టినా.. ఏక‌బిగిని గంట‌ల‌కు గంట‌లు ఉప‌న్యాసాల‌తో బ్రెయిన్ వాష్ చేస్తుంటార‌ని సీనియ‌ర్ ఐఏఎస్‌లు సైతం వాపోతున్నారు.

పోనీ అదే స‌మ‌యంలో త‌మ‌కు మాట్లాడే అవ‌కాశం కూడా ఇవ్వ‌డం లేద‌ని, ముఖ్యంగా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు అంటేనే భ‌యం వేస్తోంద‌ని చెబుతున్నారు. అంతేనా.. ప‌దోన్న‌తిపై ఏదైనా శాఖ‌కు చీఫ్‌గా వెళ్లాలంటే కూడా జంకాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంద‌ని క‌లెక్ట‌ర్లు వాపోతున్నారు. మ‌రి ఈ ఇద్ద‌రు చంద్రులు ఎప్పుడు మార‌తారో చూడాలి!!