ఆంధ్ర‌జ్యోతి మాట‌ల్లో నీతులు.. రాతల్లో పైత్యాలు

టీడీపీని, ఆ పార్టీ అధినేత‌ను ఆకాశానికి ఎత్తేస్తూ.. భుజాల‌పై మోస్తోంది ఆంధ్ర‌జ్యోతి! టీడీపీకి అనుకూలంగా వార్త‌లు రాయ‌డంలో ఈనాడును కూడా మించిపోయింది. అయితే దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఎవ‌రి సొంత ప్ర‌యోజ‌నాలు వారివి! బాధ్య‌తాయుత‌మైన ప‌త్రిక‌గా ఉంటూ విలువ‌లు పాటించాల్సిన అవ‌స‌రం కూడా చాలా ముఖ్యం! ఇటీవ‌ల ఆ ప‌త్రిక‌లో వ‌స్తున్న వార్త‌లను ప‌రిశీలిస్తే.. విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చినట్టేన‌ని అర్థ‌మ‌వు తుంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఎవ‌రో క‌ల్పించి రాసిన వాటి ఆధారంగా వార్త‌లు సృష్టించి.. పాఠ‌కుల‌కు వండి వ‌డ్డిస్తోంది. ఇలాంటి పాత్రికేయన్ని వ‌ద‌ల‌క‌పోతే పత్రికకున్న న‌మ్మ‌కం స‌న్న‌గిల్లే ప్ర‌మాదముంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఊహాగానాలు వార్త‌లు కావు. జ‌ర్న‌లిజంలో ఇదే ప్రాథ‌మిక సూత్రం! కానీ వీటినే వార్త‌లుగా వండి వారుస్తూ విలువ‌ల‌న్నీ వ‌దిలేసింది ఆంధ్ర‌జ్యోతి!! ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను వైసీపీ ఎమ్మెల్యేలు క‌ల‌వ‌డం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం తెలిసిందే! ఈ సమ‌యంలో వైసీపీలోని ద‌ళిత ఎమ్మెల్యేలంతా కోవింద్‌తో ఫొటో దిగేందుకు ప్ర‌య‌త్నిం చార‌ని, కానీ కుద‌ర‌లేద‌ట. ఇది తెలిసిన వెంక‌య్య‌.. కోవింద్ వెళ్లిపోయార‌ని.. త‌న‌తో ఫొటో దిగాల‌ని కోర‌డంతో.. ఎమ్మెల్యేలంతా ఆయ‌న‌తో ఫొటో దిగార‌ట‌. ఈ విష‌యం తెలిసిన జ‌గ‌న్‌.. ఎమ్మెల్యేల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశార‌ని,, వాళ్ల‌తో త‌న కాళ్లు కూడా ప‌ట్టించుకుని సారీ చెప్పించుకున్నార‌ట‌. ఇదంతా సోష‌ల్ మీడియాలో వ‌చ్చింద‌ట‌.

ఈనాడు త‌ర్వాత‌.. కొంత క్రెబిబులిటీ ఉన్న పేప‌ర్‌గా ఆంధ్ర‌జ్యోతిపై ప్ర‌జ‌ల్లో ఒక న‌మ్మ‌క‌ముంది. వైఎస్ హ‌యాంలో ఆయ‌నతో ఢీ కొట్టింది. ఆ స‌మ‌యంలో జ‌రిగిన అక్ర‌మాల‌ను వెలికితీసింది. క‌నుక ప్రజ‌లు ప‌త్రిక‌ను చ‌దివేదిందుకు ఆస‌క్తి చూపుతారు. అయితే ఇటీవ‌ల కాలంలో ప‌త్రిక తీరు పూర్తి ఏక‌ప‌క్షంగా మారిపోయింద‌ని ప్ర‌జ‌ల్లో అభిప్రాయం ఏర్ప‌డింది. ముఖ్యంగా వైఎస్ త‌న‌యుడు, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ను ఉద్దేశిస్తూ.. ప్ర‌చురిత‌మ‌వుతున్న వార్త‌ల్లో ఊహాక‌ల్ప‌న ఎక్కువ‌గా ఉంటోంద‌ని భావిస్తున్నారు. రోజురోజుకూ దిగజారుడు పాత్రికేయం చేస్తూ.. చుల‌క‌న అవుతోంది. ఢిల్లీలో జ‌గ‌న్‌.. ప్ర‌ధాని మోదీని క‌లిసిన నాటి నుంచి రాష్ట్రప‌తి అభ్య‌ర్థిని క‌ల‌వ‌డంపై పైత్యాన్నంతా చూపిస్తోంది.

సోష‌ల్ మీడియా ఆధారంగా ఒక క‌థ‌నాన్ని రాసేసింది ఆంధ్ర‌జ్యోతి! ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉండి.. ప్ర‌తిప‌క్షాన్ని దుమ్మెత్తిపోయడాన్ని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ.. మ‌రీ సోష‌ల్ మీడియాలో వచ్చిందంటూ.. రాసి క్రెడెబులిటీని దెబ్బ‌తీసుకునేలా చేసుకుంటోంద‌ని కొందరు అభిప్రాయ‌ప‌డుతున్నారు. క్రెడిబులిటీ, ద‌మ్మున్న ప‌త్రిక, నిస్ప‌క్ష పాత జ‌ర్న‌లిజం అంటూ పెద్ద‌పెద్ద ప‌దాలు వ‌ల్లిస్తూ.. ఇలా రోజురోజుకీ దిగ‌జారుతోందనేది వాస్త‌వం!! మ‌రి ఇప్ప‌టికైనా ఇలాంటి ఊహా క‌థ‌నాల‌ను ప్ర‌జ‌ల‌పై రుద్ద‌డం మానుకుంటుందో లేక‌.. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అనుకుంటూ.. ఇలా ముందుకు వెళుతుందేమో!!