2019 నుండి రాజధాని దొన‌కొండ‌కు తరలిపోనుందా!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి! ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. ఆయ‌న ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి నిర్మిస్తున్న ప్రపంచ ప్ర‌ఖ్యాత న‌గరం ఇది! దీని కోసం ఆయ‌న చూడ‌ని మోడ‌ల్ లేదు. తిర‌గ‌ని దేశం లేదు. అన్న‌ట్టుగా చంద్ర‌బాబు అండ్ మంత్రి వ‌ర్గం కాలికి బ‌ల‌పం ప‌ట్టుకుని మ‌రీ ప‌లు దేశాలు తిరిగి చివ‌రికి ఈ మోడ‌ల్ అమ‌రావ‌తిని తీర్చిదిద్దారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. అధికారం ఎవ‌రికి మాత్రం శాశ్వ‌తం! ప్ర‌జ‌ల మ‌నోభీష్టం ప్ర‌కారం ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి అధికారం మార్చుకునే దేశం మ‌న‌ది!

ఇక్క‌డ ఏపీ కూడా దీనికి వ్య‌తిరేకంకాదు. అయితే, చంద్ర‌బాబు మాత్రం త‌న‌కు శాశ్వ‌తంగా అధికారం క‌ట్ట‌బెట్టాల‌ని కోరుతున్నారు. ఈ విష‌యం ఒకింత ప‌క్క‌న పెడితే. ఆయ‌న క‌డుతున్న రాజ‌ధాని పూర్తికావ‌డానికి క‌నీసం ఇర‌వై ఏళ్లు ప‌డుతుంది. కానీ, మ‌రో రెండేళ్ల‌లోనే అధికారం కోసం పోరుకు ఏపీలో ఎన్నిక‌లు రానున్నాయి. ఈ నేప‌థ్యంలో బాబు బ‌దులు సీఎం పీఠంపై జ‌గ‌న్ ఎక్కితే ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న మొద‌టి నుంచి అమ‌రావ‌తిలో రాజ‌ధానిని వ్య‌తిరేకిస్తున్నాడు. అంతేకాదు, రాజ‌ధాని శంకుస్థాప‌న‌కు రాకుండా కూడా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు.

మ‌రి ఈ నేప‌థ్యంలో ఒక‌వేళ 2019లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే ఉంటుందా? లేక శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ చెప్పిన‌ట్టు.. దొన‌కొండ‌కు త‌ర‌లిపోతుందా? ఇప్పుడు ఇదే విష‌యంపై వైసీపీ స‌హా ఇత‌ర పార్టీల్లోనూ పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికి కార‌ణంగా బాబుపై ప్ర‌జ‌ల్లో ఇటీవ‌ల వ్య‌తిరేక‌త పెరుగుతుండ‌డమే. ఇదెలా ఉన్నా.. ఒక‌వేళ జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. రాజ‌ధాని అక్క‌డే ఉండాల్సిన అస‌వ‌రం ఏమిట‌ని ఇటీవ‌ల సాక్షి చ‌ర్చా కార్య‌క్ర‌మంలో మంగ‌ళ‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి లేవ‌నెత్తిన ప్ర‌శ్న అంద‌రినీ ఆలోచ‌న‌లోకి నెట్టింది.

మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తాడో చూడాలి. చంద్ర‌బాబుకి త‌న‌కు ప‌డ‌దు క‌నుక రాజ‌ధానిని మారుస్తారా? లేక శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ చెప్పింద‌ని మారుస్తారా? లేక దీనినే కొన‌సాగిస్తారా? అనేది తెలియాలంటే 2019 వ‌ర‌కు ఎదురు చూడాల్సిందే?!!