2019 నాటికి ప‌శ్చిమ‌లో టీ డీపీ అడ్ర‌స్ గ‌ల్లంతేనా?

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌రిస్థితి వేరు. 2014లో టీడీపీకి ఈ జిల్లా కంచు కోట‌గా ఆదుకుంది. జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సైకిల్ జోరు సాగింది. దీంతో ఈ జిల్లాలో వైసీపీ మ‌ట్టికొట్టుకు పోయింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకునే తీరిక‌లో తెలుగు త‌మ్ముళ్లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, త‌మ్ముళ్ల మ‌ధ్య కుమ్ములాట‌ల‌తోనే కాలం గ‌డిచిపోతోంది. మాజీ మంత్రి పీత‌ల సుజాత కేంద్రంగా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రొక‌రు వేలు పెట్ట‌డం, ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు గుప్పించుకోవ‌డం ష‌రా మామూలుగా మారింది. అంతేకాదు, పదవులు తమ వారికే దక్కేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. చివరకు హత్య చేయించేందుకు కూడా వెనకాడని పరిస్థితి నెల‌కొందంటే.. టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధ‌మ‌వుతుంది.

పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వ్యవసాయ కమిటీ ఛైర్మన్ నియామకంలో వీరి మద్య తలెత్తిన విభేదాలు ఇప్పుడు మండల కమిటీల నియామకంతో మరింత ఉథృతమయ్యాయి. చింతలపూడి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పీతల సుజాత తన నియోజకవర్గంలో మండల స్థాయి కమిటీలను నియమించారు. దీంతో పీతల వ్యతిరేకులు భగ్గుమంటున్నారు. పీతలకు వ్యతిరేకంగా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే పార్టీ పెద్దల జోక్యంతో బహిరంగ సభను విరమించుకున్నారు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో అస‌లు పీత‌ల వ‌ద్దు బాబోయ్ అంటున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

మరోవైపు ఎంపీ మాగంటి బాబుకు, పోలవరం ఎమ్మెల్యే శ్రీనివాసరావుల మధ్య కూడా విభేదాలు తలెత్తాయి. రెండు వర్గాలూ పరస్పరం దూషించుకునే పరిస్థితికి వచ్చాయి. పోలవరం నిర్వాసితుల నష్ట పరిహారం చెల్లింపు విషయంలోనే వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనేకసార్లు నేతల మధ్య రాజీకి యత్నించినా సాధ్యం కాలేదు. దీంతో చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి ఇప్పుడున్న‌ట్టుగానే 2019 వ‌ర‌కు ఉంటే వైసీపీ ప‌రిస్థితి ప‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి అధినేత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.