క‌డ‌ప‌లో ఆయ‌న‌ టీడీపీలోకి…ఈయ‌న‌ వైసీపీలోకి..?

క‌డ‌ప జిల్లా రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. విప‌క్ష వైసీపీలో ఉంటే క‌ష్ట‌మే అని భావిస్తోన్న వారు అధికార టీడీపీ వైపు చూస్తుంటే…టీడీపీలో ప‌రిస్థితి బాగోలేద‌ని భావిస్తోన్న మ‌రో కీల‌క నేత వైసీపీ వైపు చూస్తున్నార‌ట‌. ఇప్పుడు జిల్లాలో వీరిద్ద‌రి వ్య‌వ‌హార‌మే హాట్ టాపిక్‌గా మారింది. జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆదినారాయ‌ణ‌రెడ్డి హ‌వా ముందు మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి తేలిపోతున్నారు.

తాజాగా విశాఖ‌లో జ‌రుగుతోన్న మ‌హానాడుకు సైతం ఆయ‌న డుమ్మా కొట్టారు. ఆయ‌న మ‌హానాడుకు రాక‌పోవ‌డం ఒక ఎత్తు అయితే ఇదే టైంలో త‌న అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌తో జ‌మ్మ‌ల‌మ‌డులులో స‌మావేశం పెట్టారు. పార్టీలో ప్ర‌యారిటీ లేద‌ని భావిస్తోన్న ఆయ‌న త‌దుప‌రి ఏం చేయాలా ? అన్న‌దానిపై త‌న అనుచ‌రుల‌తో చ‌ర్చించారు.

తాను వ‌ద్ద‌ని చెప్పినా ఆదినారాయ‌ణ‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్న చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఏకంగా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో రామ‌సుబ్బారెడ్డి జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆయ‌న‌కు గ‌వర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామ‌ని చెప్పినా ఇప్పుడు ఆ ఊసే ఎత్త‌డం లేదు. దీంతో రామ‌సుబ్బారెడ్డి పార్టీ మారి వైసీపీలోకి వెళ‌తార‌న్న వార్త‌లు తాజా ప‌రిణామాల ద్వారా జిల్లాలో ట్రెండ్ అవుతున్నాయి.

రామ‌సుబ్బారెడ్డి స్టోరీ ఇలా ఉంటే ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి వైసీపీ ఫ్యూచర్‌, ఆర్థిక ప‌రిస్థితుల దృష్ట్యా టీడీపీలోకి వెళ్లే అంశంపై త‌న స‌న్నిహితుల‌తో చ‌ర్చ‌లు చేస్తున్నార‌ట‌. ఆయ‌న పార్టీ మార్పు వార్త‌లు మీడియాలో రావ‌డంతో ఆయ‌న పార్టీ మార‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చినా …రేపో మాపో ఆయ‌న పార్టీ మార్పుపై స‌డెన్‌గా ఏ నిర్ణ‌యం తీసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని జిల్లాలో వినిపిస్తోన్న రాజ‌కీయ క‌థ‌నం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో శివ‌ప్ర‌సాద్‌రెడ్డికే టీడీపీ టిక్కెట్టు ఇస్తామ‌న్న హామీతో పాటు మ‌రికొన్ని హామీలు వ‌స్తే ఆయ‌న పార్టీ మార‌తార‌ని జిల్లాలో విన‌వ‌స్తోన్న పొలిటిక‌ల్ టాక్‌. ఏదేమైనా క‌డ‌ప జిల్లాలో ఈ ఇద్దరు నాయ‌కులు ఒక‌రు టీడీపీలోకి, మ‌రొక‌రు వైసీపీలోకి వెళ‌తార‌న్న న్యూస్ జిల్లా పాలిటిక్స్‌ను హీటెక్కిస్తోంది.