మ‌హానాడులో లోకేశ్ భ‌జ‌న ఎక్కువైందా…

ఏపీలో అధికార టీడీపీకి మ‌హానాడు పెద్ద పండుగ లాంటిది. టీడీపీ నాయ‌కులంద‌రూ ఒకే చోట మూడు రోజుల పాటు స‌మావేశ‌మై పార్టీ విధివిధానాలు, ఇత‌ర‌త్రా అంశాల‌పై చ‌ర్చించుకుంటారు. టీడీపీ పండుగగా మ‌హానాడును పిలుస్తారు. తాజాగా ఏపీలో అధికారంలో ఉండి, తెలంగాణ‌లో అస్తిత్వం కోసం పోరాడుతోన్న టీడీపీ మ‌హానాడు రెండు రాష్ట్రాల్లోను వేర్వేరుగా నిర్వ‌హించారు. తెలంగాణ‌లో తొలి మ‌హానాడు హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే జ‌ర‌గ‌గా ఏపీలో మ‌హానాడు విశాఖ కేంద్రంగా ఈ రోజు స్టార్ట్ అవుతోంది.

దాదాపు పదిహేనేళ్ల తర్వాత మహానాడును విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. పార్టీని ఎన్టీఆర్ 1982లో ప్రారంభించారు. ఆ మ‌రుస‌టి యేడాదే 1983లో విశాఖ‌లో మ‌హానాడు నిర్వ‌హించారు. త‌ర్వాత చంద్ర‌బాబు రెండోసారి సీఎం అయ్యాక 2002లో మ‌రోసారి మ‌హానాడును విశాఖ‌లో నిర్వ‌హించారు. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి విశాఖ‌ప‌ట్ట‌ణం వేదిక‌గా మ‌హానాడు నిర్వ‌హిస్తున్నారు.

తాజా మ‌హానాడులో ఇప్పుడు సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేశ్ సెంట‌ర్ ఆఫ్ ది ఎట్రాక్ష‌న్ అయిపోయారు. అయితే తాజా మ‌హానాడులో సాధార‌ణ కార్య‌క‌ర్త‌ల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వ‌ర‌కు అంద‌రూ లోకేశ్ భ‌జ‌న చేయ‌డం ఖాయమైపోయింది. మంత్రి హోదాలో ఉంటూ మ‌హానాడుకు వస్తోన్న లోకేశ్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే మ‌హానాడు ప్రాంగ‌ణం మొత్తం లోకేశ్ ఫ్లెక్సీల‌తోనే నిండిపోయింది. లోకేశ్ ఫ్లెక్సీలు క‌ట్ట‌డంతో తెలుగు త‌మ్మ‌ళ్లు పోటీలు ప‌డ్డారంటే ఇక్క‌డ లోకేశ్ భ‌జ‌న‌కు ఎంత హంగామా చేస్తున్నారో తెలుస్తోంది. ఇప్ప‌టికే ఏపీలో తెలుగు త‌మ్మ‌ళ్ల నుంచి మంత్రుల వ‌ర‌కు అంద‌రికి లోకేశ్ భ‌జ‌న కామ‌న్ అయిపోయింద‌న్న టాక్ న‌డుస్తోంది. మ‌రి ఈ టైంలో టీడీపీకి పెద్ద పండుగ లాంటి మ‌హానాడులో సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టి లోకేశ్ భ‌జ‌న మ‌రీ ఇంత ఓవ‌ర్‌గా చేయాలా ?