డ్ర‌గ్స్ ఇష్యూ: 12 మందిలో ఇద్ద‌రు బుక్‌

టాలీవుడ్‌ను `సిట్` వ‌ద‌ల‌డం లేదు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే సుమారు 12 మందిని విచారించిన ఈ బృందం.. రెండో విడ‌త కార్యాచ‌ర‌ణ‌ను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కొంత‌మంది అరెస్టుల‌కు కూడా రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డ్ర‌గ్స్ కేసుతో సంబంధం ఉన్న ఇద్ద‌రు సినీ ప్ర‌ముఖులు సిట్ వ‌ల‌లో చిక్కిన‌ట్టేననే స‌మ‌చారం.. టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఆ ఇద్ద‌రు ఎవ‌రా? అనే చ‌ర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరిని అతి త్వ‌ర‌లోనే త‌మ అదుపులోకి తీసుకునేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నార‌ట సిట్ అధికారులు!

డ్ర‌గ్స్ కుంభకోణం టాలీవుడ్‌ను అత‌లాకుతలం చేస్తోంది. ఇందులో టాలీవుడ్ ద‌ర్శ‌కులు, న‌టులు కూడా ఉన్నార‌నే న్యూస్ బ‌య‌ట‌కు రావ‌డం.. వారికి సిట్ బృందం నోటీసులు పంపించ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోయారు! సుమారు 12 మంది సినీ ప్ర‌ముఖుల‌తో పాటు పలువురు అనుమానితులపైనా సిట్ అధికారులు దృష్టి సారించి విచారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొంద‌రి గోళ్లు, వెంట్రుక‌లు, ఇత‌ర న‌మూనాలు తీసుకున్నారు. అయితే తొలి విడ‌త‌లో సేక‌రించిన స‌మాచారం, వీడియో ఫుటేజ్‌ల‌ను ప‌రిశీలించిన అధికారులు తదుప‌రి చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. దీనికి సంబంధించి ఒక కొత్త అంశం తెర మీదకు వచ్చింది.

డ్ర‌గ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న 12 మంది సినీ ప్రముఖుల్లో ఇద్దరు దాదాపుగా దొరికినట్లేనన్న వాదన వినిపిస్తోంది. ఈ ఇద్దరికి డ్రగ్స్ తో ఉన్న సంబంధాలపై పక్కా ఆధారాలు వెల్లడైనట్లుగా చెబుతున్నారు. సినీ ప్రముఖులతో పాటు.. పలువురి అనుమానితుల్ని విచారించిన సిట్ అధికారులు.. తమ విచారణ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఇద్దరి పేర్లను కామన్ గా చెప్పినట్లుగా తెలుస్తోంది. తమ విచారణలో భాగంగా పలువురు సినీ ప్రముఖులు చాలానే పేర్లు చెప్పినా..అందరి మాటల్లోనూ ఇద్దరి ప్రస్తావన మాత్రం ఒకేలా వచ్చిందన్నట్లుగా సమాచారం.

సినీ ప్రముఖులంతా కామన్ గా చెప్పిన ఇద్దరు ప్రముఖులపైన పట్టుబిగించేలా చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మత్తుమందులు రవాణా చేయటం.. వాడటం రెండూ నేరమేనని.. వాడుతున్న నిరూపణ అయితే అరెస్ట్ చేయటానికి అవకాశం ఉందన్న విషయాన్ని అధికారులు స్ప‌ష్టంచేస్తున్నారు. ఈ ఇద్దరి మీద తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని.. వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. అవసరమైతే కేసులు నమోదు చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక.. విచారణ సందర్భంగా కొందరు తమ గోళ్లు.. రక్త నమూనాలు.. వెంట్రుకలు ఇవ్వని నేపథ్యంలో.. కోర్టును ఆశ్రయించి.. శాంపిల్స్ సేకరించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.