కేటీఆర్‌పై విపక్షాల దాడికి స‌బ్జెక్ట్‌ రెడీ!

తెలంగాణ‌లోని విప‌క్షాల‌కు మంచి స‌బ్జెక్ట్ దొరికింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్‌నే టార్గెట్ చేస్తూ వ‌చ్చిన విప‌క్షాల‌కు ప్ర‌స్తుతం కేటీఆర్ కూడా అడ్డంగా దొరికిపోయాడు. దీనికి హైద‌రాబాదే సాక్ష్యం! నిజానికి భాగ్య‌న‌గ‌రం అన్న పేరే కానీ.. ఇక్క‌డంతా అభాగ్య‌మే రాజ్య‌మేలుతోంది. చిన్న‌పాటి వ‌ర్షానికే సెక్ర‌టేరియ‌ట్ స‌హా న‌గ‌రానికి న‌డిబొడ్డున ఉన్న అమీర్ పేట సైతం మోకాలు లోతు నీళ్ల‌లో పైకితేలుతూ ఉంటుంది. అలాంటి దుస్తితి వ‌ల్ల ఇక్క‌డి ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.

లోత‌ట్టు ప్రాంతాల్లో ప‌రిస్తితి అయితే చెప్ప‌నే అక్క‌ర్లేదు. ఎలాంటి వర్షానికైనా ఇళ్ల‌లోకి నీరు చేరిపోతుంటుంది. ఇక‌, నాలాల ప‌రిస్తితి మ‌రీ దారుణం. ఈ నేప‌థ్యంలో భాగ్య‌న‌గ‌రం హైద‌రాబాద్‌ని విశ్వ‌న‌గ‌రంగా మారుస్తామ‌ని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్ర‌భుత్వం.. ముందు హైద‌రాబాద్‌ను వ‌ర‌ద‌లు, వ‌ర్షాల తాకిడి నుంచి ర‌క్షించాల‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు విజ్ఞ‌ప్తి చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్ గ‌త ఏడాది జూన్‌, జులై మాసాల్లోనే హైద‌రాబాద్ అంత‌టా ముఖ్యంగా అమీర్‌పేట‌, ఖైర‌తాబాద్, ఉస్మాన్‌గంజ్ ప్రాంతాల్లో క‌లియ‌దిరిగి.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప్ర‌త్య‌క్షంగా చూశారు.

ఈ సంద‌ర్భంగానే హైద‌రాబాద్ రూపు రేఖ‌లు మారుస్తాన‌ని, దీనికి ఏడాది స‌మ‌యం చాల‌ని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏడాది గ‌డిచి పోయింది. మ‌ళ్లీ చిత్రం మామూలే. నిన్న మొన్న హైద‌రాబాద్‌లో కుండ‌పోత కురిసింది. దీంతో మ‌ళ్లీ భాగ్య‌న‌గ‌రం నీట మునిగింది. ఇప్పుడు దీనినే విప‌క్షాలు త‌మ‌కు ఆయుధంగా వాడుకుంటున్నాయి. కేటీఆర్‌పై యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. హైద‌రాబాద్‌లో ఏపీ వాళ్లు ఎక్కువ‌గా ఉంటారు కాబ‌ట్టి.. వాళ్ల‌ని ఉద్దేశ పూర్వ‌కంగా ఇబ్బందులు పెడుతున్నార‌ని, అందుకే హైద‌రాబాద్‌ను అభివృద్ది చేయ‌డం లేద‌ని విమ‌ర్శించ‌డం ప్రారంభించారు.

అదేస‌మ‌యంలో మంత్రి కేటీఆర్ పైనా బాణాలు ఎక్కు పెట్టారు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ చెప్పిందేంటి.? ఇప్పుడు జరుగుతున్నదేంటి.? గత ఏడాది వర్షాలతో వరదలు ముంచెత్తి, నానా బీభత్సం అయిపోయింది హైద్రాబాద్‌లో. మళ్ళీ మరోమారు ఆ దుస్థితి రాదన్న గ్యారంటీ ఏంటి.? అప్పట్లో ‘నాలాల కబ్జా’ అంటూ నానా హడావిడీ చేసి, అప్పటికప్పుడు ఆకస్మిక కూల్చివేతలకు దిగింది సర్కార్‌. అయినా, వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. అని కాంగ్రెస్ , టీడీపీ నేత‌లు కేటీఆర్‌పై విరుచుకుప‌డుతున్నారు. మ‌రి దీనికి ప్ర‌భుత్వం , కేటీఆర్ ఎలాంటి కౌంట‌ర్ ఇస్తారో చూడాలి.