పాల‌కొల్లు మ‌రో గ‌ర‌గ‌ప‌ర్రు అవుతోందా..!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని గ‌ర‌గ‌పర్రు ప్ర‌స్తుతం అట్టుడుకుతోంది. అక్క‌డ ద‌ళిత‌వ‌ర్గాల‌కు చెందిన వారిని వెలివేశార‌న్న వార్త‌ల‌తో ఆ గ్రామం పేరు ఇప్పుడు మీడియాలో మార్మోగుతోంది. గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితులంతా ఉద్య‌మిస్తుంటే ఇప్పుడు అదే జిల్లాలోని పాల‌కొల్లు కేంద్రంగా బీసీలంతా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడుకు యాంటీగా ఒక్క‌ట‌వుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాల నేప‌థ్యంలో జిల్లాలోని బీసీల‌తో పాటు కోన‌సీమ‌లో బ‌ల‌హీన‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన ఓ ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గం మొత్తం నిమ్మ‌ల‌కు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తుతోంది.

నిమ్మ‌ల పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలో బీసీల‌కు చెందిన వ్య‌క్తుల‌ను కొద్ది రోజులుగా ప‌దే ప‌దే టార్గెట్ చేసి, వారిపై కేసులు బ‌నాయించి అరెస్టు చేయిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై పెద్ద ఎత్తున వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాలో సైతం ఎమ్మెల్యే తీరుపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ముందుగా తుందుర్రు మెగా అక్వా ఫుడ్ పార్క్ ఉద్య‌మంలో ఫైట్ చేస్తోన్న విశ్వ‌మాన‌వ‌వేదిక అధ్య‌క్షుడు మ‌ల్లుల సురేష్‌పై 11 కేసులు బ‌నాయించ‌డంతో సురేష్ 38 రోజులు జైలుశిక్ష అనుభ‌వించారు. ఆ త‌ర్వాత ప‌లువురు బీసీ నేత‌ల‌పై కూడా ఇదే త‌ర‌హా కేసులు పెట్టారు. ఇప్పుడు అదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బీసీ నేత పెచ్చెట్టి కోటేశ్వ‌ర‌రావును పోలీసులు అరెస్టు చేయ‌డంతో జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాలు ఎమ్మెల్యే నిమ్మ‌ల‌పై భ‌గ్గుమంటున్నాయి.

రెండు రోజుల క్రితం జిల్లాలోని బీసీ సంఘాల నేత‌లంతా పాల‌కొల్లులో స‌మావేశ‌మై ఎమ్మెల్యే తీరు మార్చుకోక‌పోతే బీసీలంతా క‌లిసి పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు. వీరంతా రామానాయుడు దురాగ‌తాల‌పై పోరాడేందుకు పార్టీల‌కు అతీతంగా ఒక్క‌ట‌వుతున్నారు. అలాగే 29 బీసీ కులాల జేఏసీ ఆధ్వ‌ర్యంలో వీరు పాల‌కొల్లును ముట్ట‌డించే తీర్మానం కూడా చేప‌ట్టారు.

ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఇంటిలిజెన్స్ రిపోర్ట్ :

నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుపై ఇప్ప‌టికే ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు అధిష్టానానికి నివేదిక ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో సామాజిక సంస్థ‌ల నాయ‌కుల‌ను, బీసీల్లో టీడీపీకి సాంప్ర‌దాయ ఓటర్లుగా ఉంటోన్న ఓ వ‌ర్గాన్ని టార్గెట్ చేయ‌డంతో ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో బ‌లంగా ఉంటోన్న వారు టీడీపీకి దూర‌మ‌వుతున్నార‌న్న టాక్ కూడా జిల్లాలో వ‌చ్చేసింది. ఇక్క‌డ ఈ సామాజిక‌వ‌ర్గం ఏక‌మైతే రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఖ‌చ్చితంగా మార‌తాయి. ఆ ఎఫెక్ట్ ఒక్క రామానాయుడికే కాకుండా ప‌శ్చిమ డెల్టాతో పాటు కోన‌సీమ‌లోను అన్ని సీట్ల‌లో టీడీపీకి ఇబ్బంది త‌ప్ప‌దు.