నంద్యాల టీడీపీలో అప్పుడే ముస‌లం… ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్సెస్ అఖిల‌ప్రియ‌

నంద్యాల ఉప ఎన్నిక దేశ రాజ‌కీయాల‌ను ఎలా త‌న వైపున‌కు తిప్పుకుందో అంద‌రం చూశాం. ఈ ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోసం టీడీపీ ఏకంగా ఏపీ స‌చివాల‌యంలో ఉన్న మంత్రుల‌తో పాటు త‌మ పార్టీ ఎమ్మెల్యేలు స‌రిపోక వైసీపీ నుంచి త‌మ పార్టీలోకి లాక్కున్న ఎమ్మెల్యేల‌ను కూడా అక్క‌డ దింపేసింది. నంద్యాల‌లో టీడీపీ భారీ మెజార్టీతో గెలిచి స‌త్తా చాటింది. టీడీపీ ఇక్క‌డ గెలిచి వారం రోజులు కూడా కాక‌ముందే అప్పుడే నంద్యాల‌లో ముస‌లం మొద‌లైపోయింది.

అస‌లు విష‌యంలోకి వెళితే నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం అధికార పార్టీకి చెందిన ఇద్ద‌రు మంత్రులు త‌మ పంతం నెగ్గించుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక్క‌డ ఉప ఎన్నిక ముగిసి వారం రోజులు కూడా కాక‌ముందే నిన్న‌టి వ‌ర‌కు టీడీపీ గెలుపుకోసం క‌లిసిమెలిసి ప‌నిచేసిన మంత్రులు ఇప్పుడు పంతం కోసం ఫైటింగ్‌కు దిగుతున్నారు.

నంద్యాల‌ మార్కెట్ యార్డ్ చైర్మ‌న్ ప‌ద‌వి కొంత కాలంగా ఖాళీగా ఉంది. ఈ ప‌ద‌వి భూమా అనుచ‌రులు అయిన శీలం భాస్కరరెడ్డి, మునగాల లక్ష్మీకాంతరెడ్డిలలో ఎవ‌రో ఒక‌రికి ఇవ్వాల‌ని మంత్రి అఖిల ప‌ట్టుబ‌డుతోంది. దీనిపై ఆమె అధిష్టానానికి సిఫార్సులు కూడా చేశారు. అయితే మార్కెటింగ్ శాఖా మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి వెర్ష‌న్ మ‌రోలా ఉంది. తాను నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యంలో కానాల గురునాథరెడ్డి, సాయినాథరెడ్డిలకు చైర్మన్‌ పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చాన‌ని..వీరిలో ఒక‌రికి చైర్మ‌న్ ఇవ్వాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు.

వీరిద్ద‌రి మ‌ధ్య వార్ ఇలా జ‌రుగుతుంటే చంద్ర‌బాబు త‌న‌కు మార్కెట్ యార్డ్ చైర్మ‌న్ ప‌ద‌విపై హామీ ఇచ్చార‌ని మాజీ కౌన్సెల‌ర్ చింత‌ల సుబ్బ‌నాయుడు చెపుతున్నారు. మ‌రో ప‌క్క‌, బ‌లిజ కుల‌స్తులు కూడా ఈ ప‌ద‌వికి పోటీ ప‌డుతున్నారు. దీంతో ఈ చైర్మ‌న్ ప‌ద‌వి నాలుగుస్తంభాలాట‌గా మారింది. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి.