టీడీపీలో ఎంపీ వ‌ర్సెస్ లేడీ ఎమ్మెల్యే నువ్వా… నేనా..!

ఏపీలో అధికార టీడీపీలో నాయ‌కుల మ‌ధ్య కుమ్ములాట‌లు పీక్స్‌కు చేరిపోయాయి. ఇటు చంద్ర‌బాబు నిత్యం ఇత‌ర‌త్రా ప‌నులు, స‌మీక్ష‌ల‌తో బిజీగా ఉంటే నాయ‌కుల, ప్ర‌జాప్ర‌తినిధులు మాత్రం నిత్య క‌ల‌హాల‌తో బిజీగా ఉంటున్నారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు సైతం వీరి మ‌ధ్య కుమ్మ‌లాట‌లు ప‌రిష్క‌రించేలేక చేతులు ఎత్తేసే ప‌రిస్థితి వ‌చ్చిందంటే ఈ అంత‌ర్గ‌త క‌ల‌హాలు ఎంత‌వ‌ర‌కు వెళ్లాయో అర్థ‌మ‌వుతోంది.

ఏపీలోని 13 జిల్లాల్లోను ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. కొన్ని చోట్ల వైసీపీ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కు నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. అద్దంకిలో క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్సెస్ గొట్టిపాటి, జ‌మ్ముల‌మ‌డుగులో ఆది నారాయ‌ణ‌రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి, పామ‌ర్రులో ఉప్పులేటి క‌ల్ప‌న వ‌ర్సెస్ వ‌ర్ల రామ‌య్య ఇలా చెప్పుకుంటూ పోతే నాయ‌కుల మ‌ధ్య ఫైటింగ్‌ల‌పై ఎన్ని పుస్త‌కాలు అయినా రాసేయొచ్చు.

ఇక ఇప్పుడు వీట‌న్నింటికంటే టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఎంపీ మాగంటి బాబు వ‌ర్సెస్ మాజీ మంత్రి పీత‌ల సుజాత మ‌ధ్య జ‌రుగుతోన్న వార్ టీడీపీ శ్రేణుల‌కు, పార్టీ అధిష్టానానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. అస‌లు ఈ గొడ‌వ పూర్వాప‌రాల్లోకి వెళితే చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ఎంపీ మాగంటి బాబు ప‌దేళ్లుగా బ‌తికిస్తున్నారు. ఇక్క‌డ ఎంతోమంది పార్టీలు మారినా ఆయ‌న మాత్రం త‌న వ‌ర్గంతో పార్టీని కాపాడుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో నాన్ లోక‌ల్ అయిన పీత‌ల సుజాత‌ను ఇక్క‌డ‌కు తీసుకు వ‌చ్చి గెలిపించుకున్నారు. ఆ త‌ర్వాత ఆమెకు మంత్రి ప‌ద‌వి కూడా రావ‌డంతో ఎంపీ వ‌ర్గాన్ని, పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో ఉన్న‌వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టేసి త‌న వ‌ర్గాన్ని ప్రోత్స‌హించారు. ఇక ఏఎంసీ చైర్మ‌న్ ఎంపిక విష‌యంలో కూడా ఆమె పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ల‌ను కాద‌ని ప‌లు పార్టీలు మారి వ‌చ్చిన వ్య‌క్తికి ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నాలు చేశారు. దీనికి బాబు వ‌ర్గం అడ్డుచెప్పి మ‌రో వ్యక్తి పేరును ప్ర‌తిపాదించారు. ఇలా ప్ర‌తి విష‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ నాయ‌కులు పీత‌ల, మాగంటి వ‌ర్గాలుగా చీలిపోయారు.

ఇక గ‌త వారం పోల‌వ‌రం ప‌ర్య‌ట‌నకు వ‌చ్చిన చంద్ర‌బాబు వీరి మ‌ధ్య సయోధ్య‌కోసం మంత్రులు పితాని, ప్ర‌త్తిపాటి పుల్లారావుతో క‌మిటీ వేశారు. శుక్ర‌వారం జిల్లా టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం జరిగింది. ఈ స‌మావేశానికి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత పని చేశారు. వీరి మ‌ధ్య అనుకూల‌, ప్ర‌తికూల నినాదాల‌తో స‌మావేశం ద‌ద్ద‌రిల్లింది. చివ‌ర‌కు మంత్రులు సైతం ఏం చేయ‌లేక మౌనం దాల్చారు.

మంత్రి పీత‌ల ఏక‌ప‌క్ష వైఖ‌రి, గ్రూపు రాజ‌కీయాల‌పై ఎంపీ వ‌ర్గం మండిప‌డుతుంటే, పీత‌ల మాత్రం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ జోక్యం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా వీరిద్ద‌రి మ‌ధ్య మూడున్న‌రేళ్లుగా జ‌రుగుతోన్న పోరాటంలో చంద్ర‌బాబు సైతం చోద్యం చూడ‌డం మినహా ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించలేక‌పోతున్నారు.