చంద్ర‌బాబు – ప‌వ‌న్ – టీవీ9 సీక్రెట్ ఎజెండా..?

ఏపీలో అధికార టీడీపీ, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన మ‌ధ్య ఏదైనా సీక్రెట్ ఎజెండా ఉందా ? ఈ ఎజెండాకు సంబంధించి ఇంట‌ర్న‌ల్‌గా ఏదైనా వ‌ర్క్ జ‌రుగుతోందా ? తాజాగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు ఈ రెండు పార్టీల సీక్రెట్ ఎజెండాకు సంబంధించిన అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తున్నాయా ? అంటే అవున‌నే ఆన్స‌ర్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు టీవీ9 సీఈవో ర‌విప్ర‌కాశ్‌తో పాటు ఎన్టీవీ అధినేత తుమ్మ‌ల న‌రేంద్ర‌చౌద‌రి హాజ‌ర‌య్యారు.

ఈ స‌భ‌లో ర‌విప్ర‌కాశ్ మాట్లాడుతూ త‌న‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంటే చాలా ఇష్ట‌మ‌ని ఓపెన్‌గానే చెప్పారు. ఇక ఎన్టీవీ అధినేత న‌రేంద్ర‌చౌద‌రి సైతం ఇదే మాట వ‌ల్ల‌వేశారు. ఆ త‌ర్వాత ఎన్టీవీలో జ‌న‌సేన అనుకూల వార్త‌లు జోరందుకున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం చంద్ర‌బాబు నూత‌న గృహ‌ప్ర‌వేశానికి హైద‌రాబాద్ వ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు త‌న సొంత పార్టీకి చెందిన కీల‌క నేత‌ల‌నే ఆహ్వానించ‌లేదు. అంత బిజీ టైంలో కూడా చంద్ర‌బాబు గంటపాటు ర‌విప్ర‌కాశ్‌తో భేటీ అవ్వ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది.

ఇక మరో ఇంట‌ర్న‌ల్ మ్యాట‌ర్ ప్ర‌కారం టీవీ9 సిబ్బందితో భేటీ అయిన ర‌విప్ర‌కాశ్ జ‌న‌సేన‌తో పాటు ప‌వ‌న్‌కు అనుకూలంగా వార్త‌లు పెంచాల‌ని ఆదేశించిన‌ట్టు స‌మాచారం. ఇక అంత‌కు ముందు నుంచే ఎన్టీవీలో కూడా జ‌న‌సేన అనుకూల వార్త‌లు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ+బీజేపీతో జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తుంద‌ని, జ‌న‌సేన త‌మ మిత్ర‌ప‌క్ష‌మ‌ని ప్ర‌క‌టించారు. అయ్య‌న్న అభిప్రాయాన్నే టీడీపీ వ‌ర్గాలు ఇంట‌ర్న‌ల్‌గా కూడా చ‌ర్చించుకుంటున్నాయి.

ర‌విప్ర‌కాశ్ చంద్ర‌బాబుతో భేటీ కావ‌డం, టీవీ9లో జ‌న‌సేన వార్త‌ల‌కు క‌వ‌రేజ్ పెర‌గ‌డం, ఇక అయ్య‌న్న వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో పొత్తు ఉంటుంద‌ని చేసిన కామెంట్లు అన్ని కూడా టీడీపీ+జ‌న‌సేన మ‌ధ్య అండ‌ర్ క‌వ‌రింగ్ కార్య‌క్ర‌మం న‌డుస్తోందా ? అన్న సందేహాల‌కు తావిచ్చేలా ఉంది. ఇక ఇదే అంశం జ‌గ‌న్ వ‌ద్ద‌కు కూడా వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.