ఐవైఆర్ ఈ కుప్పిగంతులేంటి…!

ఐవైఆర్ కృష్ణారావు. విభ‌జ‌న త‌ర్వాత ఏపీ ప్ర‌భుత్వానికి తొలి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. దాదాపు రెండున్న‌రేళ్ల‌పాటు ఆయ‌న ఏపీకి సేవ‌లందించారు. ఆయ‌నంటే అటు ప్ర‌భుత్వంలోనూ, ఇటు మంత్రుల్లోనూ గౌర‌వం ఉంది. చాలా సీనియ‌ర్ అధికారిగా, విచ‌క్ష‌ణ ఉన్న అధికారిగా కూడా ఆయ‌న‌కు మంచి మార్కులు ఉన్నాయి. అందుకే చంద్ర‌బాబు ఆయ‌న‌ను రిటైర్ అయిన త‌ర్వాత కూడా వినియోగించుకోవాల‌ని భావించారు. అంతేకాదు, ఆయ‌న సూచ‌నల మేర‌కు బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేసి దేశ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు లేని కొత్త అధ్యాయానికి బాబు శ్రీకారం చుట్టారు. ఇంత‌టి విలువ ఇచ్చిన బాబుపై ఇప్పుడు ఐవైఆర్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

విమ‌ర్శ‌లు చేయ‌రాద‌ని ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఎవ‌రూ అన‌రు. అంతేకాదు, ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌ను తప్పుగా ఎత్తి చూప‌నివాడు బానిస‌కిందే లెక్క‌. అయితే, ఇప్పుడు ఐవైఆర్ చేస్తున్న విమ‌ర్శ‌లు స‌ద్విమ‌ర్శ‌లేనా? నిర్మాణాత్మ‌కంగా ఉంటున్నాయా? లేక బాబును ఏదో డిఫేమ్ చేయాల‌నే ఉద్దేశంతో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారా? ఆయ‌న వెనుక వైసీపీ త‌దిత‌ర ఏదైనా పార్టీల ప్ర‌భావం ఉందా? నిజానికి ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌లు.. తీసుకుంటున్న విష‌యాలు.. పూర్తిగా ఆయ‌న సీఎస్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన స‌మ‌యంలో బాబు నెత్తిన ఎత్తుకున్న‌వే. అలాంట‌ప్పుడు అప్పుడే ఆయ‌న వాటిని వ్య‌తిరేకించి ఉండాల్సింది క‌దా? మ‌రి ఎందుకు చేయ‌లేక‌పోయారు.

తాజాగా ఐవైఆర్ రాజ‌ధాని విష‌యాన్ని లేవ‌నెత్తారు. న‌దుల ప‌క్క‌న పెద్ద పెద్ద న‌గ‌రాల‌ను నిర్మించిన దేశాలు ఏవీ లేవ‌ని, వాటి వ‌ల్ల న‌ష్ట‌మే త‌ప్ప లాభం లేద‌ని బాబు ను విమ‌ర్శించారు. నిజ‌మే అనుకుందాం. ఏపీ రాజ‌ధాని కోసం కేంద్రం నియ‌మించిన శివ రామ‌కృష్ణ క‌మిటీ నివేదిక‌ను బాబు ప‌క్క‌న పెట్టేసిన స‌మ‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రించింది మీరు కాదా? ఆ త‌ర్వాత కృష్ణా న‌ది ఒడ్డున ఏడాదికి మూడు పంట‌లు పండే భూముల‌ను రైతుల నుంచి తీసుకునేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించినప్పుడు సీఎస్‌గా ఉన్న‌ది మీరుకాదా? అప్పుడు మీకు కృష్నా ఒడ్డున రాజ‌ధాని క‌డుతున్న విష‌యం తెలియ‌దా?

మ‌రి అన్నీ తెలిసి ఆనాడు కేంద్రానికి రాజ‌ధానిపై బాబు ప్ర‌భుత్వం పంపిన అధికారిక నోట్‌పై సీఎస్ హోదాలో సంత‌కం చేసి కూడా ఇప్పుడు మీరు ఇలా ప్లేట్ ఫిరాయించి రాజ‌ధాని నిర్మాణాల‌పై ఎందుకు దుమ్మెత్తి పోయాల‌ను కుంటున్నారు? ప‌్ర‌భుత్వం త‌ప్పు చేస్తున్న‌ప్పుడు అడ్డుకునే అధికారం మీకు లేక‌పోవ‌చ్చు.. కానీ ఉత్త‌మ స‌ల‌హా ఇచ్చి.. ప్రోత్స‌హించే అవ‌కాశం ఉంది క‌దా? మీక‌న్నా జూనియ‌ర్‌.. నాగులాప‌ల్లి శ్రీకాంత్‌.. స్విస్ చాలెంజ్ విధానాలన్నీ చట్టవిరుద్దంగా ఉన్నాయంటూ ప్ర‌శ్నించ‌లేదా?

ఎక్క‌డైనా రాజీ ప‌డ్డారా? ప‌ద‌వి పోతుంద‌ని, సీఆర్ డీఏ క‌మిష‌న‌ర్ ప‌ద‌వి కోసం ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదే! మ‌రి మీరు ఏం చేశారు? ఎక్క‌డ బాబును ప్ర‌శ్నిస్తే.. సీఎస్ ప‌ద‌వికి ఎస‌రు వ‌స్తుందోన‌ని ఆనాడు మౌనంగా సంత‌కాలు చేసి.. కృష్ణా ఒడ్డున రాజ‌ధానిని నిర్మిస్తున్నామ‌ని కేంద్రానికి నోట్ పంపి.. ఈ రోజు ఇలా బెడ్డ‌లు విస‌ర‌డం ఎంత మేర‌కు స‌మంజ‌సం? బాబు చేస్తున్న ప‌నుల్లో లోపాలున్నాయో లేవో అవి ప‌క్క‌న పెట్టండి మీరెంత వ‌ర‌కు నిజాయితీగా వ్య‌వ‌హ‌రించారు? ప‌్ర‌శ్నించుకోండి సార్‌!!