అప్ప‌ట్లో ప‌ర‌కాల‌, ఇప్పుడు ఐవైఆర్ సేమ్ టు సేమ్‌

రాజకీయ పార్టీలు, ప్ర‌భుత్వాల‌కు మేధావుల అవ‌స‌రం ముఖ్యం! ఇది గ‌మ‌నించే కొంత‌మందిని కీల‌క ప‌ద‌వుల్లో నియ‌మిస్తూ ఉంటారు! అయితే వారు ఆ రాజ‌కీయ పార్టీకి, ప్ర‌భుత్వానికి రివ‌ర్స్ అవుతార‌ని ఎవరూ ఊహించి ఉండ‌రు. ప్ర‌స్తుతం ఇలాంటి ప‌రిణామ‌మే ఏపీ రాజ‌కీయాల్లో ఎదురైంది. సీఎం చంద్ర‌బాబు.. ఏరికోరి నియ‌మించుకున్న ఐవైఆర్ కృష్ణారావు.. ప్ర‌భుత్వంపై ఎద‌రుదాడికి దిగ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అంతేగాక ఆయ‌న‌పై వేటు వేసే వ‌ర‌కూ వ్య‌వ‌హారం వెళ్లింది. అయితే ఇలాంటి సంఘ‌ట‌నే ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో జ‌రిగింది. ఇప్పుడు ఐవైఆర్ స్థానంలో.. అప్పుడు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ఉన్నారు. ప్ర‌స్త‌తం కొంత‌మంది ఆ సంఘ‌ట‌న‌ల‌ను గుర్తుచేసుకుంటున్నారు.

2008లో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించిన విష‌యం తెలిసిందే! పార్టీ మేధావి వ‌ర్గంలో ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌కు చోటుకల్పించారు. ఆ స‌మ‌యంలో ప‌ర‌కాల సూచ‌న‌లు, స‌ల‌హాలు ప్ర‌జారాజ్యం మ‌నుగ‌డ‌కు ఎంతో ఉపయోగ‌ప‌డ‌తాయ‌ని న‌మ్మి.. కీల‌క బాధ్య‌తలు అప్ప‌జెప్పారు చిరు. కానీ అన‌తి కాలంలోనే.. చిరుకు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు ప్ర‌భాక‌ర్‌! ప్ర‌జారాజ్యం ఒక విష వృక్ష‌మ‌ని, టికెట్లు అమ్ముకుంటున్నారంటూ.. తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. పార్టీ విధానాల‌ను దుమ్మెత్తిపోశారు. న‌మ్మి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన చిరంజీవికి ఒక‌ర‌కంగా వెన్న‌పోటు పొడిచార‌నేదే చెప్పుకోవాలి.

ఐవైఆర్‌ కృష్ణారావు… ఏపీ చీఫ్ సెక్ర‌ట‌రీగా బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించారు. ఆయ‌న‌ ప‌ని త‌నం మెచ్చిన చంద్ర‌బాబు.. రిటైర్ అయిన త‌ర్వాత బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఐవైఆర్‌ను ఏరికోరి మ‌రీ నియ‌మించారు. ఇప్పుడు చంద్ర‌బాబుకు.. ఐవైఆర్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. మొన్న‌టికి మొన్న పొటిలిక‌ల్ పంచ్ నిర్వాహ‌కుడు ఇంటూరి ర‌వికిరణ్‌ను అరెస్టుచేస్తే.. `సోషల్‌ మీడియాలో ఏవైనా విమర్శలు చేస్తే సరదాగా తీసుకోవాలి కానీ కేసులు పెట్టడం నియంతృత్వ వైఖరికి దారితీస్తుంది` అని త‌న ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు, బాహుబలి-2 సినిమా అదనపు షోలకు అనుమతులు ఇవ్వడాన్నీ, టీటీడీ ఈవోగా అనిల్‌ సింఘాల్‌ను నియమించడాన్నికూడా ఐవైఆర్‌ ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదంటూ గళ‌మెత్తారు.

ఇప్పుడు ఐవైఆర్ తీరు నాటి ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను గుర్తుకుతెస్తోంద‌ని చెబుతున్నారు. వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పదవి నిర్వహిస్తూనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ను దూషించిన పోస్ట్‌లను హ్యాపీగా షేర్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత స్వయంగా చంద్రబాబు ఏరికోరి ఐవైఆర్‌ను ఎంపిక చేసుకున్నందుకు త‌గిన ఫ‌లితం అనుభ‌విస్తున్నారని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వీటిపై చంద్ర‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఆయ‌న్ను తొల‌గించారు. ప్రస్తుతం ఆయ‌న స్థాన‌లో వేమూరు ఆనందసూర్యను నియమిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.