ప‌క్క‌లో బ‌ల్లెంపై చంద్ర‌బాబు వేటు

ఈ రోజు ఉద‌యాన్నే చంద్ర‌బాబు ఓ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌పై వేటు వేశారు. ఐవైఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వార్త‌లు గ‌త రెండు రోజులుగా మీడియాలో ప్ర‌ముఖంగా వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ‌స్తోన్న వార్త‌ల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో పాటు చంద్ర‌బాబు, టీడీపీనే టార్గెట్ చేసే పోస్టుల‌ను ఆయ‌న పెడుతూ పెద్ద సీత‌య్య‌గా మారారు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు ఉద‌యాన్నే ఆయ‌న‌పై వేటు వేసిన చంద్ర‌బాబు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా వేమూరు ఆనందసూర్యను నియమించారు.

సీఎం చంద్ర‌బాబు అంత త్వ‌ర‌గా ఎవ‌రినీ న‌మ్మ‌రు.. న‌మ్మితే వారిని అంద‌ల‌మెక్కిస్తారు! ముఖ్యంగా స‌మ‌ర్థులైన ఉద్యోగుల‌ను వెతికి ప‌ట్టుకుని మ‌రీ కీల‌క ప‌దవుల్లో కూర్చోపెడ‌తారు! అలా కూర్చో పెట్టిన కృష్ణారావు చంద్ర‌బాబుకు ప‌క్క‌లో బ‌ల్లెంలా మారారు. ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సిన కీల‌క బాధ్య‌త‌లో ఉన్న ఆ వ్య‌క్తి.. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను, ప‌లు వ్య‌వ‌హారాల్లో సీఎం చంద్ర‌బాబు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎండ‌గ‌డుతూ ప్ర‌భుత్వ వ‌ర్గాల‌కు, టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. ఆయ‌న‌ వ్య‌వ‌హారం అటు చంద్ర‌బాబుకు ఇటు టీడీపీ నేత‌ల‌కు, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కొద్ది రోజులుగా అంతుచిక్క‌డం లేదు.

ఐవైఆర్‌ కృష్ణారావు… ఏపీ చీఫ్ సెక్ర‌ట‌రీగా బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించి చంద్ర‌బాబు దృష్టిలో ప‌డ్డారు. తెలంగాణ ప్ర‌భుత్వంతో నిరంత‌రం చ‌ర్చ‌లు జ‌రిపి.. వివాదాల‌ను సామ‌రస్య‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించారు. ఆయన ప‌ని త‌నం మెచ్చిన చంద్ర‌బాబు.. రిటైర్ అయిన త‌ర్వాత బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఐవైఆర్‌ను ఏరికోరి మ‌రీ నియ‌మించారు. క్యాబినేట్ ర్యాంకు హోదా క‌ట్ట‌బెట్టారు. అందుకు అనుగుణంగానే.. అడిగిన దాని కంటే ఎక్కువ‌గానే బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌కు నిధులు కూడా కేటాయిస్తున్నారు. త‌న కోసం ఇంత చేసిన చంద్ర‌బాబుకు.. ఐవైఆర్ షాకుల మీద షాకులు ఇచ్చారు.

మొన్న‌టికి మొన్న పొటిలిక‌ల్ పంచ్ నిర్వాహ‌కుడు ఇంటూరి ర‌వికిరణ్‌ను అరెస్టుచేస్తే.. `సోషల్‌ మీడియాలో ఏవైనా విమర్శలు చేస్తే సరదాగా తీసుకోవాలి కానీ కేసులు పెట్టడం నియంతృత్వ వైఖరికి దారితీస్తుంది` అని త‌న ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు, బాహుబలి-2 సినిమా అదనపు షోలకు అనుమతులు ఇవ్వడాన్నీ, టీటీడీ ఈవోగా అనిల్‌ సింఘాల్‌ను నియమించడాన్నికూడా ఐవైఆర్‌ ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదంటూ గళ‌మెత్తారు. సీఎం చంద్ర‌బాబును తప్పు పడుతున్న కామెంట్స్‌, ఫొటోలను షేర్ చేస్తున్నారు. ప్రభుత్వానికి కులపిచ్చి అంటగట్టే పోస్టులనూ వాల్‌పై పోస్ట్ చేస్తూ అంద‌రూ విస్తుపోయేలా చేస్తున్నారు.

ఐవైఆర్‌ వ్యవహార శైలిపై చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. ఐవైఆర్‌ తన అభిప్రాయాలు, సూచనలను నేరుగా ప్రభుత్వానికి చెప్పే అవకాశమున్నా… ఫేస్‌బుక్‌ వేదికగా విమర్శలు గుప్పించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయ‌న చివ‌ర‌కు ఆయ‌న‌పై వేటు వేశారు.