మంత్రి పితానిపై వైసీపీ క్యాండెట్ రెడీ!

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో క్యాండెట్ల ఎంపిక గజిబిజి గంద‌ర‌గోళంగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా రోజుల టైం ఉన్నా ఎవ‌రు ఎక్క‌డ పోటీ చేస్తారు ? ఏ నియోజ‌క‌వ‌ర్గం ఎవ‌రికి సేఫ్‌గా ఉంటుంది ? అన్న‌దానిపై ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా టీడీపీకి కంచుకోట‌గా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ అన్ని స్థానాల్లోను క్వీన్‌స్వీప్ చేసేసింది. ఈ ఎన్నిక‌ల‌కు ముందు తీవ్ర వ్య‌తిరేక‌త‌తో కొట్టుమిట్టాడుతోన్న మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ చివ‌రి క్ష‌ణంలో టీడీపీలోకి జంప్ చేసి 3 వేల స్వ‌ల్ప మెజార్టీతో గ‌ట్టెక్కారు.

ఇక కొద్ది రోజుల క్రితం జ‌రిగిన ప్ర‌క్షాళ‌న‌లో సైతం పితానికి ల‌క్‌గా మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఇదిలా ఉంటే పితానిపై వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థిగా ప్ర‌స్తుత న‌ర‌సాపురం ఇన్‌చార్జ్ ముదునూరి ప్ర‌సాద‌రాజు పోటీ చేశారు. ఇప్పుడు ప్ర‌సాద‌రాజు న‌ర‌సాపురం వెళ్లిపోవ‌డంతో వైసీపీ నుంచి తాత్కాలిక ఇన్‌చార్జ్‌గా వీర‌వాస‌రం ఎంపీపీ కౌరు శ్రీనివాస‌రావును నియ‌మించారు.

కౌరు, పితాని ఒకే సామాజిక‌వ‌ర్గానికే చెందిన వారు అయినా, కౌరు పితానికి పోటీ ఇచ్చే స్థాయి వ్య‌క్తి కాదు. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఇక్క‌డ ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త వంక ర‌వీంద్ర‌నాథ్‌ను రంగంలోకి దింపుతున్న‌ట్టు తెలుస్తోంది. పాత‌త‌రం క‌మ్యూనిస్టు నాయ‌కుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే అయిన వంక స‌త్యనారాయ‌ణ త‌న‌యుడు అయిన వంక ర‌వీంద్ర‌నాథ్ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ర‌వీంద్ర స‌తీమ‌ణి రాజ‌కుమారి త‌ణుకు మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ప‌నిచేశారు.

ర‌వీంద్ర బీజేపీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు చేతిలో ఓడిపోయినా పెనుగొండ సెగ్మెంట్ వ‌ర‌కు మాత్రం ఆయ‌న‌కు 12 వేల పైచిలుకు మెజార్టీ వ‌చ్చింది. ఇక్క‌డ వంకా ఫ్యామిలీకి క్రేజ్ ఉంది. ఇక జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ర‌వీంద్ర‌కు ఎంపీ టిక్కెట్ ఇవ్వ‌న‌ని చెప్పేసిన‌ట్టు తెలుస్తోంది. న‌ర‌సాపురం ఎంపీ సీటును రాజుల‌కు ఇవ్వాల‌ని డిసైడ్ అయిన జ‌గ‌న్ ర‌వీంద్ర లేదా ఆయ‌న భార్య రాజ‌కుమారిల‌లో ఎవ‌రో ఒక‌రు పెనుగొండ నుంచి పోటీ చేయాల‌ని ఆప్ష‌న్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

వంకా దంపతుల్లో ఎవ‌రో ఒక‌రు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెనుగొండ నుంచి పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి. వంకా కాపు వ‌ర్గానికి చెందిన వారు. ఆచంట‌లో శెట్టి బ‌లిజ క‌మ్యూనిటీ ఎక్కువుగా ఉన్నారు. పితాని ఎప్పుడూ ఆ క‌మ్యూనిటీ ఓట్ల‌తోనే గెలుస్తున్నారు. అయితే కాపుల‌కు తోడు వైసీపీకి ఎస్సీ ఓట్లు కూడా క‌లిస్తే సులువుగా గెల‌వ‌వ‌చ్చ‌న్న ప్లాన్‌తోనే జ‌గ‌న్ వంకా దంప‌తుల‌కు ఆచంట ఆప్ష‌న్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.