ఆ మూడిట్లో ప‌ట్టుంటేనే 2019 ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ద‌క్కే ఛాన్సులు!

జ‌న‌సేన పెట్టి మూడేళ్ల‌వుతున్నా ఆ పార్టీకి ఇప్ప‌ట‌కీ సంస్థాగ‌తంగా స‌రైన నిర్మాణం లేదు. ప‌వ‌న్ 2014 ఎన్నిక‌ల వేళ జ‌న‌సేన పార్టీ స్థాపించాడు. ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేయ‌కుండా టీడీపీ+బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. త‌ర్వాత ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు వివిధ అంశాల్లో ప‌వ‌న్ ఈ రెండు పార్టీల‌ను వ్య‌తిరేకించ‌డంతో పాటు 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుంద‌ని చెప్ప‌డంతో పాటు తాను సైతం ఏపీలోని అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌ని స్వ‌యంగా ప్ర‌క‌ట‌న చేశాడు.

ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న వ‌ర‌కు బాగానే ఉన్నా పార్టీ సంస్థాగ‌త నిర్మాణం ఇప్ప‌టి వ‌ర‌కు పునాది కూడా వేసుకోలేదు. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజులుగా జ‌న‌సేన‌లో ఎంపిక‌లు జ‌రుగుతున్నాయి. అనంత‌పురం నుంచి ప్రారంభ‌మైన ఈ ఎంపిక‌లు ఉత్త‌రాంధ్ర‌కు పాకాయి. ఈ ఎంపిక‌ల్లో భాగంగా పార్టీ కోసం పని చేసే వారి కోసం అప్లికేషన్లు పెట్టుకోవాలని..వారికి ప‌రీక్ష‌లు ఉంటాయ‌ని చెప్ప‌డం తెలిసిందే. పార్టీ కోసం పనిచేసే వారిని ఎంపిక చేస్తోన్న తీరే ఇప్పుడు చాలా ఆస‌క్తిక‌రంగా మారింది.

పార్టీల ప‌నిచేసే వారి ద‌ర‌ఖాస్తుల‌ను భారీగా వ‌డ‌పోస్తున్నారు. జ‌న‌సేన‌లో ప‌నిచేయాలంటే వారికి సామాజిక స్పృహ మెండుగా ఉండాల‌ట‌. ఇక ఇందుకోసం మూడు అంశాల్లో ప‌ట్టున్న వారిని మాత్ర‌మే ఎంపిక చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఎదుట‌వారిని ఆక‌ట్టుకునేలా మాట్లాడ‌డం – ఓ విష‌యాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా రాయ‌డం – స‌మ‌స్య ప‌రిష్కారానికి స‌రైన విష‌యం చెప్ప‌డం ఈ మూడు అంశాల్లో అభ్య‌ర్థుల‌కు ఉన్న సామ‌ర్థ్యం ఆధారంగా ఎంపిక‌లు ఉంటున్నాయ‌ట‌.

ఇక అభ్య‌ర్థుల‌కు జిల్లాల్లో స‌మ‌స్య‌ల‌పై ఉన్న ప‌ట్టు, స్థానిక అంశాల‌పై అవ‌గాహ‌న ఎంత‌వ‌ర‌కు ఉంటుంద‌న్న‌ది కూడా చూస్తున్నార‌ట‌. ఇక కంటెంట్ రైట‌ర్లు, ఎన‌లిస్టులు మాత్రం వారికి ఇచ్చిన ప్ర‌శ్నల‌కు ఆన్స‌ర్లు రాయాల్సి ఉంటుంది. ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల‌కు క‌లిపి 7 వేల మంది ద‌ర‌ఖాస్తులు చేసుకుంటే కేవ‌లం ఒక్కో జిల్లాకు 25 మందిని మాత్ర‌మే ఎంపిక చేశారు. ఇలా ఎంపిక చేసిన వారిలో కొంత‌మందికి 2019 ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ద‌క్కే ఛాన్సులు ఉన్నాయంటున్నారు.