జ‌న‌సేన మూడేళ్ల ప్ర‌స్థానం.. సాధించింది ఏమిటి?

ఏదైనా ఒక పార్టీ.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో చురుగ్గా వ్య‌వ‌హ‌రించాల‌ని అనుకున్న‌ప్ప‌డు అనుస‌రించాల్సిన వ్యూహాలు స‌ప‌రేట్‌గా ఉంటాయి. అదేవిధంగా కొత్త‌గా మొగ్గ‌తొడిగిన పార్టీ అయితే, విచ్చుకుని సుగంధాలు విర‌జిమ్మేందుకు ప్ర‌య‌త్నాలు సాగాలి. కానీ, మూడేళ్ల కింద‌ట 2014 ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్రంలో మొగ్గ‌విచ్చిన జ‌న‌సేన ప‌రిస్థితి చూస్తే.. ఇంకా పుంజుకోలేదేమోన‌ని అనిపిస్తోంది. నిన్న‌టికి నిన్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. పార్టీని స్థాపించిన ప్పుడు తాను ఒక్క‌డినేని, ఇప్పుడు మాత్రం 20 ల‌క్ష‌ల మంది ఉన్నార‌ని అన్నారు. వాస్త‌వానికి ఏపీ వంటి నాలుగున్న కోట్ల మంది జ‌నాభా మూడు కోట్ల 75 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు ఉన్న రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల మంది మ‌ద్ద‌తు ఏమూల‌కు?

ఇక్క‌డే మ‌రో ప్ర‌ధాన విష‌యం స్పష్ట‌మ‌వుతోంది. ప‌వ‌న్ పేర్కొన్న‌ది ప్ర‌త్య‌క్ష బ‌లం కాదు. ట్విట్ట‌ర్ బ‌లం! ట్విట్ట‌ర్‌లో త‌నను ఫాలో అవుతున్న వాళ్ల‌ను, త‌న‌కు లైకులు కొడుతున్న‌వాళ్ల‌ను ఆయ‌న లెక్కేసుకున్నారు. కానీ, ఇది రాజ‌కీయంగా బ‌లం ఎలా అవుతుంది. ట్విట్ట‌ర్‌లో ఫాలో అయ్యేవారు ఏపీకే చెందిన వార‌ని ఎలా చెప్ప‌గ‌లుగుతాం. అయితే, వారు ఎక్క‌డి వారైనా సానుభూతి ఉంటుంది. కానీ, సానుభూతి ఓట్లు కురిపిస్తుందా? అంటే 2014లో జ‌గ‌న్‌కు ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. కాబ‌ట్టి.. సంస్థాగ‌తంగా జ‌న‌సేన త‌న బ‌లాన్ని ఇప్ప‌టికీ పెంచుకోలేద‌ని స్ప‌ష్టం అవుతోంది. ప‌వ‌న్ చూసి జ‌నాలు ఓటు వేయాల‌న్నా.. స్థానికంగా ఓ మంచి నేత అనే వాడి ఎంపిక జ‌ర‌గాలి క‌దా?

ఆదిశ‌గా ప‌వ‌న్ ఎక్క‌డా కార్యాచ‌ర‌ణ ప్రారంభించ‌లేదు. జిల్లాల్లో ఏదో వ్యాస‌ర‌చ‌న‌, త‌దిత‌ర పోటీలు పెట్టి నేత‌ల‌ను రెడీ చేసుకున్నా.. అదిమొద‌ట ఉన్న ఊపు త‌ర్వాత కోల్పోయింది. దీంతో 2019లోనూ ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న‌వ‌స్తోంది. 2014లో బీజేపీ-టీడీపీకి ప‌వ‌న్ మ‌ద్ద‌తిచ్చి ప‌క్క‌న నుంచొన్నారు. అయితే, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాత్రం స్పందిస్తున్నారు. ప్ర‌త్యేక హోదా, ఉద్దానం కిడ్నీ బాధితులు, అగ్రిగోల్డ్ బాధితులు, రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌లు, తుందుర్రు ఆక్వా రైతులు, వ్య‌వ‌సాయ విద్యార్థులు, ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 విద్యార్థుల స‌మ‌స్య ఇలా ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో స్పందించారు. వాటి ప‌రిష్కారానికి కృషి చేశారు.

అయితే, ఇలా ఎన్నాళ్లు? అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే ఉత్ప‌న్న‌మ‌వుతోంది. గ‌డిచిన మూడేళ్ల‌లో జ‌న‌సేన త‌న సొంత బ‌లాన్ని పెంచుకోలేదు. రాబోయే ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లోనూ సొంతంగా పోటీ చేస్తామ‌ని ప‌వ‌న్ చెప్పినా, ఈ మ‌ధ్య‌నే త‌న సోష‌ల్ మీడియా టీమ్ శ‌త‌ఘ్నితో మాట్లాడుతూ.. 2018 డిసెంబ‌ర్ వ‌ర‌కూ పోటీకి సంబంధించి ఏమీ చెప్ప‌లేన‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు. పార్టీ నిర్మాణం ఇప్పుడే మొద‌లైంది కాబ‌ట్టి, వ‌చ్చే డిసెంబ‌ర్ లో ప‌రిస్థితులు అంచ‌నా వేసుకుని, అప్ప‌టి బ‌లాబ‌లాలు చూసుకున్నాక ఎంత‌మందిని పోటీకి దింపాల‌నేది ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

మ‌రి ప‌రిస్థితి ఇలా ఉంటే.. ప‌వ‌న్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏమిటి? అనేది జ‌న‌సేన అభిమానుల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌. అధికారం త‌న ల‌క్ష్యం కానంత మాత్రాన రాజ‌కీయంగా మ‌రీ అంత నిరాస‌క్తంగా ఉంటున్న‌ట్టు క‌నిపించకూడ‌దు క‌దా! జ‌న‌సేన‌కు చెందిన కొంత‌మంది ప్ర‌తినిధులైనా చ‌ట్టస‌భ‌లో ఉంటే, ప్ర‌జ‌ల త‌ర‌ఫున త‌మ వాణిని మ‌రింత బ‌లంగా వినిపించే అవ‌కాశం ఉంటుంది క‌దా. ఈ విష‌యంలో ప‌వ‌న్ చురుగ్గా ఆలోచించ‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా గ‌త ఎన్నికల సీనే పున‌రావృతం కావొచ్చ‌నే భావ‌న ఆ పార్టీ వ‌ర్గాల్లో ఉంది. ప‌వ‌న్ ఆదిశ‌గా పోస్ట్ మార్ట‌మ్ నిర్వ‌హించి పార్టీని లైన్‌లో పెడ‌తాడో లేదో చూడాలి.