జ‌న‌సేనలో సామాన్యుల‌కు చోటు లేదా?!

ఏపీలో నూత‌న పార్టీ జ‌న‌సేన చుట్టూ ఇప్పుడు ఆస‌క్తికర చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌డిచిన వారం రోజులుగా ఈ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఆహ్వానం పలుకుతోంది. అంతేకాదు, జ‌న‌సేన‌లో కీల‌క పోస్టుల నియామ‌కం కూడా చేస్తోంది. దీనికిగాను ఎంట్రీ టెస్ట్‌లు నిర్వ‌హించ‌డం బ‌హుశ దేశంలో ఇదే తొలిసారి కావొచ్చు. ఏ పార్టీ కూడా ఇంత రేంజ్‌లో ఎంట్రీ టెస్ట్‌లు పెట్టి కార్య‌క‌ర్త‌ల‌ను, నేత‌ల‌ను నియ‌మించిన సంద‌ర్భాలు లేవు.

నిజానికి ఐఏఎస్ చ‌దివి.. ఉద్యోగానికి రిజైన్ చేసి లోక్‌స‌త్తా స్థాపించిన జేపీ కూడా త‌న పార్టీలోకి వ‌చ్చే వారికి ఎలాంటి ప‌రీక్ష‌లూ పెట్ట‌లేదు. అలాంటిది ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ నేతృత్వంలో పురుడు పోసుకున్న జ‌న‌సేన‌.. కొత్త‌గా టెస్టులు, స్పీచ్‌లు అంటూ పెద్ద ఎత్తున జిల్లాల్లో హంగామా సృష్టిస్తోంది. దీనికి పెద్ద ఎత్తున చ‌దివిన వారు క్యూ క‌డుతున్నార‌ని తెలుస్తోంది.

నిజానికి ఏ పార్టీ అయినా హిట్ అవ్వాలంటే మాస్ ఇమేజ్ కావాలి. ఈ ఇమేజ్ లేక‌పోవ‌డం వ‌ల్లే.. జేపీ త‌న పార్టీ జెండాను పీకేయాల్సి వ‌చ్చింది. ఇప్పుడు జ‌న‌సేన కేవ‌లం ప‌రీక్ష‌లు, పోటీలు అంటూ ఉన్న‌త‌స్థాయి విద్యావంతుల‌కే పెద్ద‌పీట వేయ‌డం వ‌ల్ల‌.. దిగువ స్థాయిలో మాస్‌.. పెద్ద ఎత్తున హ‌ర్ట్ అయ్యే ఛాన్స్ క‌నిపిస్తోంది. రాష్ట్ర అక్ష్య‌రాస్య‌త ఎంత ఉంద‌నేది ప‌క్క‌న పెడితే.. పెద్ద‌గా చ‌దువుకున్న‌వారు మాత్రం క‌రువే.

ఈ ప‌రిస్థితిలో అంతా చ‌దువుకున్న‌వాళ్లే రాజ‌కీయాల్లోకి రావాలి. వాళ్ల‌కే ప‌ద‌వులు ఇస్తాం అంటే.. మాస్ ప‌రిస్థితి ఏంటి? వాళ్లు రాజ‌కీయంగా ఎప్పుడు ఎదుగుతారు. ప్ర‌స్తుతం ఉన్న జ‌న‌సేన ప‌రిస్థితిని చూస్తే.. చ‌దువుకున్న‌వారికి ప‌ద‌వులు, చ‌దువులు లేనివారికి జెండాలు అన్న సూత్రం పాటిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇది పార్టీ ఎదుగుద‌ల‌కు ఎలా దోహ‌దం చేస్తుందో చూడాలి! ఏ పార్టీ జెండా మోయాల‌న్నా.. పెద్ద ఎత్తున నినాదాలు చేయాల‌న్నా.. అది కేవ‌లం మాస్ వ‌ల్లే సాధ్యం.

ఈ విష‌యాన్ని గ‌మ‌నించో ఏమో.. దేశంలో దేనికైనా విద్యార్హ‌త నిర్ణ‌యించారు. కానీ, రాజ‌కీయాల‌కు మాత్రం విద్య‌తో ముడిపెట్ట‌లేదు. కానీ.. ఇప్ప‌డు ప‌వ‌న్ తీసుకొస్తున్న ట్రెండ్ పైకి బాగానే ఉంద‌ని అనిపిస్తున్నా.. మాస్‌కి పార్టీ దూరం అవుతోంద‌న్న విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇలాగైతే.. జ‌న‌సేన కొంద‌రి పార్టీగానే మిగిలిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.

నిజాయితీ, నిబ‌ద్ధ‌త, అంకిత భావం అనేవి.. చ‌దువుకున్న వారిలోనే ఉంటాయ‌ని ప‌వ‌న్ భావిస్తే.. అంత‌క‌న్నా ఫూలిష్ ఇంకోటి లేదు. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అవినీతి పాల్ప‌డుతున్న‌వారంతా పెద్ద పెద్ద చ‌దువులు చ‌దివిన వారేన‌ని ఆయ‌న తెలుసుకోవాలి. దీనిని బ‌ట్టి మాస్‌కి కూడా ప్రాధాన్యం ఇస్తూ.. పార్టీ నిర్మాణం చేయాలి. అప్పుడే నిజ‌మైన జ‌న‌సేన ఆవిష్కృత మ‌వుతుంది.