ఏపీలో జనసేనతో కొత్త ఫ్రంట్‌

2019 ఎన్నిక‌లు తెలంగాణ‌లో కంటే ఏపీలో ర‌స‌కందాయంగా ఉండేలా క‌నిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంత గ్యాప్ ఉన్నా మ‌రోసారి అధికార కూట‌మి అయిన టీడీపీ+బీజేపీ కూట‌మి క‌లిసి పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్‌గా క‌నిపిస్తోంది. విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ మోడీని క‌లిసిన నేప‌థ్యంలో వైసీపీ, బీజేపీ పొత్తు ఉండ‌వ‌చ్చ‌ని ఊహాగానాలు ఉన్నా అది మాట‌లో లేదా ప్ర‌క‌ట‌న‌ల‌కో మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వ్వ‌డం ఖాయం.

ఇక కొత్త‌గా ఎంట్రీ ఇస్తోన్న జ‌న‌సేన సైతం కూట‌మికి తెర‌లేపే సూచ‌న‌లు మెండుగా ఉన్న‌ట్టు తాజా రాజ‌కీయ ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఏపీలో క‌మ్యూనిస్టు పార్టీల ప్ర‌భావం రోజు రోజుకు బాగా త‌గ్గిపోతోంది. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో సీపీఎం, సీపీఐ చెరో స్థానం గెలుచుకున్నా ఏపీలో మాత్రం ఈ రెండు పార్టీలు ఖాతా తెర‌వలేదు. అయినా ఈ రెండు పార్టీల‌కు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సంస్థాగ‌తంగా మంచి ఓటు బ్యాంకు ఉంది. అయితే ఆ ఓట్ల‌ను సీట్ల రూపంలో మార్చుకునే స‌త్తా ఈ పార్టీల‌కు లేదు.

ఈ క్ర‌మంలోనే ఈ రెండు పార్టీలో కొత్త‌గా ఎంట్రీ ఇస్తోన్న జ‌న‌సేన‌తో జ‌ట్టుక‌ట్టేందుకు చాలా సుముఖత‌ను వ్య‌క్తం చేస్తున్నాయి. ప‌వ‌న్‌కు కూడా కాస్తో కూస్తో క‌మ్యూనిస్టు భావ‌జాలం ఉంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ప‌వ‌న్ సైతం క‌మ్యూనిస్టుల‌తో పొత్తుపై సానుకూలంగానే వ్యాఖ్యానించ‌డంతో జ‌న‌సేన‌+క‌మ్యూనిస్టుల అల‌యెన్స్‌కు మార్గం సుముఖంగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

జ‌న‌సేన‌తో పొత్తు కోసం సీపీఎం కంటే సీపీఐ చాలా స్పీడ్‌గా ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. ఈ పొత్తు కోసం సీపీఐ నుంచి జాతీయ నేత సీతారాం ఏచూరి నుంచి రాష్ట్ర స్థాయి నేత నారాయణ వరకు ఆసక్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.పవన్ కూడా ఈ మధ్యకాలంలో కమ్యూనిస్టు పార్టీల పట్ల ఆకర్షితుడవుతున్నాడనే ప్రచరం జోరందుకుంది.

తాజాగా సీపీఐ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ సైతం జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చాయని అందుకే పవన్ కళ్యాణ్‌తో క‌లిసి మాట్లాడుతున్నామ‌ని చెప్పారు. ఇక కేంద్రంలోను, రాష్ట్రంలోను బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌ను క‌లుపుకుని పోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఆయ‌న గుర్తు చేశారు. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ ఉనికిని బ‌లంగా చాటుకునేందుకు క‌మ్యూనిస్టులు జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు వెళ్లేందుకు ఇంట్ర‌స్ట్‌గా ఉన్న‌ట్టు క‌న‌ప‌డుతోంది.