ప‌వ‌న్ ఒంట‌రిపోరే… పోటీ చేసే సీట్ల‌పై క్లారిటీ

జ‌నసేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీపై నిన్నిటి వ‌ర‌కు చాలా క‌న్‌ఫ్యూజ‌న్ వాతావ‌ర‌ణం ఉంది.  ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాడా ?  లేదా ?  టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడా ?  బీజేపీతో క‌లిసి ముందుకు వెళ‌తాడా ?  లేదా జ‌గ‌న్ ప‌వ‌న్‌తో పొత్తు కోసం వెంప‌ర్లాడుతుండ‌డంతో జ‌గ‌న్‌తో క‌లుస్తాడా ? అస‌లు ప‌వ‌న్ పోటీ లెక్క ఎలా ఉంటుంద‌న్న‌దానిపై నిన్న‌టి వ‌ర‌కు పెద్ద గంర‌ద‌గోళ‌మే ఉండేది.

తాజాగా ప‌వ‌న్ సోమ‌వారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేసే సీట్ల‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. 2019 ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 175 స్థానాల్లో జనసేన పార్టీ తన అభ్యర్థులను పోటీకి దింపుతున్నట్టు ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో కొద్దిసేపటి క్రితం పోస్ట్‌ చేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 294 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ప‌వ‌న్ చెప్పిన దానిని బ‌ట్టి చూస్తే పార్టీకి బాగా బ‌లం ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ త‌మ అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపుతుంద‌ని తేలింది. 

2019 ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీ చేయాలని పవన్ స్పష్టతనివ్వడంతో వాటిలో ఏ నియోజక వర్గాలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీతో జట్టు కడతారు అనేది ఉత్కంఠగా మారింది. ఇక ఈ రోజు గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా పార్టీ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక జ‌న‌సేన వ‌ర్గాల నుంచి అందుతోన్న ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలోని చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల్లోనే ఎక్కువ సీట్ల‌లో పోటీ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ప‌వ‌న్ 175 సీట్ల‌లో పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో జ‌న‌సేన పోటీపై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న పెద్ద క‌న్‌ఫ్యూజ‌న్ తొల‌గిపోయింది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చిన పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే బరిలోకి దిగుతారని అందరూ భావించారు. తెలుగుదేశం పార్టీ కూడా పవన్ పట్ల సానుకూలంగా ఉంది. పవన్ లేవనెత్తే సమస్యలన్నింటినీ పరిష‌్కరించే దిశగా ప్రయత్నిస్తుంది. కాని టీడీపీ ఆశలకు పవన్ గండికొట్టినట్లే కన్పిస్తోంది.