జ‌న‌సేన సీటు రేటు కోట్లు ప‌లుకుతోందా…

ప్ర‌శ్నిద్దాం అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పార్టీ పెట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా టీడీపీ+బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేశారు. ఆ త‌ర్వాత ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు వివిధ అంశాల్లో ఆ రెండు పార్టీల‌తో క్ర‌మ‌క్ర‌మంగా విబేధిస్తూ వ‌చ్చిన ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిపోరుకు రెడీ అవుతున్నారు. జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేసి తీరుతుంద‌ని, తాను ఏపీలోని అనంత‌పురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టించి వ‌చ్చే ఎన్నిక‌ల వేడిని హీటెక్కించేశాడు.

ప‌వ‌న్ ముందు నుంచి అవినీతి ర‌హిత రాజ‌కీయ స‌మాజాన్ని నెల‌కొల్పుతాన‌ని, ఎన్నిక‌ల్లో ఎప్ప‌టి నుంచో పోటీ చేస్తూ వ‌స్తోన్న నాయ‌కుల కంటే త‌ట‌స్థులుగా ఉండి, ఎలాంటి మ‌చ్చ‌లేనివారితో పాటు కొత్త ర‌క్తాన్ని ప్రోత్స‌హిస్తాన‌ని చెపుతున్నారు. ప‌వన్ మాట‌లు ఎలా ఉన్నా వాస్త‌వంగా జ‌న‌సేన‌లో ఇలాంటి ప‌రిస్థితులే ఉన్నాయా ? అంటే హైద‌రాబాద్ జ‌న‌సేన ఆఫీస్ కేంద్రంగా జ‌రుగుతోన్న రాజ‌కీయాలు చూస్తుంటే లెక్క‌లేనన్ని సందేహాలు క‌లుగుతున్నాయి.

ఏపీ, తెలంగాణ‌లో ప్ర‌స్తుతం జ‌న‌సేన ఆ పార్టీకి కావాల్సిన జ‌న సైనికుల కోసం ఎంపిక‌లు నిర్వ‌హిస్తోంది. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి పోటీ చేయాల‌ని కోరిక‌గా ఉన్న ఆశావాహులు త‌మ బ‌యోడేటాతో ఆ పార్టీ ఆఫీస్‌కు వెళుతుంటే అక్క‌డ వారికి దిమ్మ‌తిరిగే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయ‌ట‌. ఆశావాహులు త‌మ‌కు ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం ఇస్తే అక్క‌డ త‌మ ప‌ని స్టార్ట్ చేసుకుంటామ‌ని, జ‌న‌సేన‌ను సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేస్తామని చెపుతున్నార‌ట‌. అయితే ఆఫీస్‌లో కార్య‌క్ర‌మాలు చూసేందుకు ప‌వ‌న్ నియ‌మించిన టీం మాత్రం వారికి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంద‌ట‌.

మీరు వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే మీకు ఏ సీటు కావాలి ? మీరు క‌నీసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెడ‌తారు ? మీకు టిక్కెట్ ఇస్తే పార్టీ కోసం కొంత ఫండింగ్ కూడా ఎరేంజ్ చేయాల్సి ఉంటుంది ? మీరు ఎంత ఫండ్ ఇవ్వ‌గ‌ల‌రు ? లాంటి ప్ర‌శ్న‌లు ఆశావాహుల‌కు ఎదుర‌వ్వ‌డంతో వారు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డుతున్నార‌ట‌. మా దగ్గ‌ర అన్ని కోట్లు ఉంటే జ‌న‌సేన నుంచి ఎందుకు పోటీ చేస్తాం? ఏ టీడీపీనో లేదా వైసీపీ నుంచో పోటీ చేసే వాళ్లం గ‌దా అని వారు వాపోతున్నార‌ట‌.

ప‌వ‌న్ స్థాపిస్తానంటోన్న అవినీతి ర‌హిత రాజ‌కీయాలు అంటే ఇవేనా ? అని కూడా వారు ప్ర‌శ్నిస్తున్నారు. జ‌న‌సేన టిక్కెట్టు కావాలంటే కోటీ వ‌ర‌కు ఫండింగ్ ఇచ్చుకోవాల్సిందే అన్న టాక్ కూడా జ‌న‌సేన కార్యాల‌యం నుంచి లీక్ అయ్యింది. ఏదేమైనా ప‌వ‌న్ జ‌న‌సేన‌లో సైతం అప్పుడే ధ‌న రాజ‌కీయాల‌కు తెర‌లేచిన‌ట్ల‌య్యింది. జ‌న‌సేన‌పై ఈ త‌ర‌హా టాక్ అప్పుడే స్టార్ట్ అవ్వ‌డం ఆ పార్టీకి పెద్ద మైన‌స్సే. మ‌రి ప‌వ‌న్ ఈ విష‌యంలో పార్టీ రూటు మారుస్తాడేమో చూడాలి.