రిలీజ్ రోజే ‘ జ‌య జాన‌కి నాయ‌క‌ ‘ కు పెద్ద దెబ్బ‌

టాలీవుడ్‌లో ఆగ‌స్టు 11న పెద్ద యుద్దం జ‌రుగుతోంది. ఎప్పుడో సంక్రాంతికో ద‌స‌రాకో ఒకేసారి రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అవి కూడా ఒక్క రోజు గ్యాప్ తేడాలో వ‌స్తుంటాయి. అయితే ఈ శుక్ర‌వారం మాత్రం ఒకేసారి మూడు సినిమాలు ఏకంగా రిలీజ్ అవుతున్నాయి. మూడు సినిమాల మీద మంచి అంచ‌నాలు ఉన్నాయి. వీకెండ్ మూడు రోజుల‌తో పాటు సోమ‌వారం సెల‌వు, ఆగ‌స్టు 15 కూడా సెల‌వు ఇలా మొత్తం ఐదురోజుల పాటు సెల‌వులు ఉండ‌డంతో ఈ లాంగ్ వీకెండ్ క్యాష్ చేసుకునేందుకు మూడు సినిమాలు ఈ రోజే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తున్నాయి.

ఈ రోజు భారీ అంచ‌నాల‌తో జ‌య జాన‌కి నాయ‌క‌, లై, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు వ‌స్తున్నాయి. ఈ సినిమాల్లో ఏది హిట్‌, ఏది ఫట్ అన్న సంగ‌తి ముందుగా తెలియ‌క‌పోయినా ప్రేక్ష‌కుల్లో భారీ హైప్ ఉన్న జ‌య జాన‌కి నాయ‌క థియేటర్ల విషయంలో బాగా వెన‌క‌ప‌డింది.

ఈ సినిమా నిర్మాత కొత్త‌వ్య‌క్తి కావ‌డం, బ‌య్య‌ర్లు కూడా అనుభ‌వం లేని వ్య‌క్తులు కావ‌డంలో ఈ సినిమాకు కావాల్సిన‌న్ని థియేట‌ర్లు దొరక్క‌పోవ‌డం ఓ కొర‌త అయితే, మంచి థియేట‌ర్లు కూడా దొర‌క‌లేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఏపీలో మార్కెట్‌కు కీల‌క‌మైన సీడెడ్‌లో చూస్తే నేనే రాజు నేనే మంత్రికి 70 థియేట‌ర్లు, లైకు 60 థియేట‌ర్లు దొరికితే జ‌య జాన‌కి నాయ‌క‌కు 40 థియేటర్లు కూడా దొర‌క‌లేదు. అవి కూడా మంచి థియేట‌ర్లు దొర‌క‌లేద‌ని తెలుస్తోంది.

జయ జానకి నాయక సీడెడ్ రైట్స్ రూ 7.20 కోట్ల‌కు అమ్ముడైతే అందులో స‌గం రేటుకు కూడా లై, నేనే రాజు అందులో స‌గం ధ‌ర కూడా ప‌ల‌క్క‌పోవ‌డం విశేషం. నేనే రాజు నేనే మంత్రికి అన్ని థియేట‌ర్లు దొర‌క‌డం వెన‌క సురేష్‌బాబే కార‌ణం అని వేరే చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కే చాలా థియేట‌ర్లు ఉన్నాయి.

ఇక మంచి డిస్ట్రిబ్యూట‌ర్ల వ‌ల్ల లై లాంటి క్లాస్ మూవీకి కూడా మాస్ ఏరియాల్లో మంచి థియేట‌ర్లు దొరికాయి. ఇక మిగిలిన థియేట‌ర్లు అది కూడా చాలా త‌క్కువుగా 40కి లోపు థియేట‌ర్ల‌లో మాత్ర‌మే జ‌య జాన‌కి నాయ‌క విడుద‌ల‌వుతోంది. ఏదేమైనా రిలీజ్‌కు ముందు ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఇది పెద్ద దెబ్బ‌లాంటిదే. అయితే సినిమా బాగుంటే మౌత్ టాక్‌తో క‌లెక్ష‌న్ల‌కు ఇబ్బంది ఉండ‌దు.