జేసీ మాట‌లు అర్థ‌మ‌య్యాయా.. బాబూ..!

అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి మ‌రోసారి పూన‌కం వ‌చ్చింది! నిన్న సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో నిర్వ‌హించిన ఏరువాక కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో జేసీ.. త‌న‌దైన శైలిలో మైకులో విరుచుకుప‌డ్డాడు. సీఎంగా చంద్ర‌బాబు త‌ప్ప ఈ రాష్ట్రాన్ని ఎవ‌రూ బాగుచేయ‌లేర‌ని అంటూ..నే రైతులను బాబు హ‌యాంలోనే పోలీసులు వేధిస్తున్నారంటూ చుర‌కలంటించారు. దీనికి వాళ్లు సూట్ అని పేరు పెట్టిన‌ట్టు చెప్పారు. కొద్దిసేపు.. మా వాడు అంటూ జ‌గ‌న్ ఊసెత్తిన జేసీ.. ఆ త‌ర్వాత త‌న వాగ్ధాటిని బాబుపై మ‌ళ్లించాడు.

చంద్రబాబు ఎప్పుడూ అమరావతి గురించే మాట్లాడుతున్నారన్న జేసీ.. తమకు రాజధాని కన్నా రైతుల గోడు తీర్చడమే కావాలంటూ బాబును మెచ్చుకున్న‌ట్టే మెచ్చుకుని విమ‌ర్శించేశాడు. 2018 నాటికల్లా పోలవరం ప్రాజెక్టు నుంచి, గ్రావిటేషన్‌ ద్వారా నీరు వస్తాయన్న చంద్రబాబు మాటలను తాను నమ్మబోనన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబుకే తెలియని సమస్యలు వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా, చంద్రబాబును గాంధీలాంటి వాడు అన్న నోటితోనే, ఆయన రాజకీయ లబ్ధి కోసం జిమ్మిక్కులూ చేస్తాడంటూ చురక వేశారు.

చంద్రబాబు ఎవరి కాళ్లు, జుట్టు పట్టుకుంటున్నారో కానీ, సాంకేతికతను మాత్రం ఒడిసిపట్టుకుని, పనులు వేగంగా చేయిస్తున్నారని జేసీ దివాకరరెడ్డి కితాబునిచ్చారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలోని బైరవానితిప్ప ప్రాజెక్టుకు నీటి కేటాయించాలని, సీఎంకు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి, దివాకరరెడ్డి ప్రసంగం విన్నవారు, ఆయన చంద్రబాబును పొగిడారో, తిట్టారో తేల్చుకోలేక సతమతమయ్యారు. మ‌రి సీఎం చంద్ర‌బాబు కు ఏమ‌న్నా అర్ధ‌మైందో లేదో ఆయ‌న‌కే తెలియాలి!!