షాక్‌.. ఎంపీ ప‌ద‌వికి జేసీ రాజీనామా!

అనంత‌పురం ఎంపీ, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు జేసీ దివాక‌ర్ రెడ్డి సంచ‌లన వార్త ప్ర‌క‌టించారు. వ‌చ్చే మంగ‌ళ లేదా బుధ‌వారాల్లో త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న బాంబు పేల్చారు. ఎవ‌రూ ఎన్న‌డూ ఊహించ‌ని విధంగా జేసీ ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక్క‌సారిగా ఉలికిపాటు వ‌చ్చింది. ఈ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న వెనుక ఎవ‌రైనా ఉన్నారా? అనే కోణంలోనూ ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచించారు. అయితే, ఇది త‌న సొంత నిర్ణ‌య‌మ‌ని, దీనిలో ఎవ‌రి ఒత్తిడీ లేద‌ని జేసీ చెప్పుకొచ్చారు. ఎంపీగా తాను ఫెయిల్ అయ్యాయ‌ని, గ‌తంలో ఎన్నోసార్లు ప‌ద‌వులు అలంక‌రించాన‌ని అయినా ఎప్పుడూ ఇంత బాధ క‌ల‌గ‌లేద‌ని అన్నారు.

అయితే, ఇప్పుడు మాత్రం త‌న‌కు ఇబ్బందిగా ఉంద‌ని, త‌న మ‌న‌స్సాక్షి త‌న‌ను రాజీనామా చేయాల‌ని కోరింద‌ని చెప్పుకొచ్చారు. చాగల్లుకు నీళ్లు తేలేని త‌నకు ఎంపీ పదవి ఎందుకని? ప్ర‌శ్నించుకున్నారు. తాడిపత్రి సాగు, తాగు నీటి అవసరాలను తీర్చలేకపోయానని, అలాగే అనంతపురంలో రోడ్లను విస్తరించలేక పోయాన‌ని చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో గెలవలేదని, ప్రజల మద్దతుతోనే ఎంపీ అయ్యాన‌ని చెప్పారు. తనలాంటివాళ్లు రాజకీయాల్లో ఉండటం వృథా అని, విలువలేనప్పుడు పదవిలో కొనసాగడం భావ్యం కాదని తెలిపారు.

ఈ నెల 25 లేదా 26న రాజీనామా చేస్తానని తెలిపారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్‌కు అందజేస్తానన్నారు. అయితే పదవికి మాత్రమే రాజీనామా చేస్తానని, పార్టీకి కాదని చెప్పుకొచ్చారు. బాబు వెంటే ఉంటాన‌న్నారు. అయితే, ఇప్పుడు జేసీ కామెంట్ల‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ సాగుతోంది. గ‌తంలోనూ అనంత అభివృద్ధి ప‌నులు స‌హా త‌న‌ను చంద్ర‌బాబు స‌రిగా వినియోగించుకోవ‌డం లేదంటూ జేసీ ప‌లు స‌భ‌ల్లో కామెంట్లు చేశారు. అయితే, ఇప్పుడు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లకు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎలాంటి హామీలు ఇవ్వ‌లేద‌ని అయినా కూడా వారి క‌ష్టాల‌ను, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం త‌న‌పై ఉంద‌ని ఈ క్ర‌మంలోనే అవి తీర్చ‌లేక‌పోయాన‌ని చెప్పుకొచ్చారు.

మొత్తంగా జేసీ వ్యాఖ్య‌లు బాబునే టార్గెట్ చేశాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి రాజీనామా చేయ‌డానికి ఇంకా ఐదు రోజుల వ‌ర‌కు గ‌డువు ఉంది కాబ‌ట్టి.. ఈలోగా అమ‌రావ‌తి నుంచి పిలుపు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, బాబు.. జేసీని కూర్చోబెట్టుకుని మాట్లాడ‌తార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అనంతపురానికి ఏదైనా ప్యాకేజీ కూడా ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు క‌ర్నూలు ను ప‌ట్టించుకుంటున్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌కు ముందు, త‌ర్వాత కూడా ఈ జిల్లాకు నిధులు, నీళ్లు ఇస్తున్నారు. అనంత‌పురాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇదే ఇప్పుడు జేసీని ఇబ్బంది పెట్టి ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.